News

Realestate News

చంద్రన్న నగర్‌.. జిగేల్‌ జిగేల్‌

చంద్రన్న నగర్‌.. జిగేల్‌ జిగేల్‌
పేద, మధ్య తరగతి వర్గాలకు 2,528 గృహాలు
దక్షిణకొరియా సాంకేతిక పరిజ్ఞానంతో చురుగ్గా నిర్మాణం
కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే
పేద, మధ్యతరగతి వర్గాల కోసం ప్రారంభించిన భవన నిర్మాణ పనులు రికార్డు స్థాయిలో సాగుతున్నాయి. అనకాపల్లి మండలంలోని సత్యనారాయణపురం పంచాయతీ పరిధిలోని చంద్రన్న నగర్‌లో జీవీఎంసీ చేపట్టిన 2,528 ఇళ్ల పనులు వేగం పుంజుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా పేదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన అత్యంత ఆధునిక పరిజ్ఞానం ఉత్తమ ఫలితాలతో ఆదర్శం కానుంది.

పురపాలక శాఖకు చెందిన పట్టణ నివాస సముదాయాలు, మౌలిక సదుపామాల అభివృద్ధి సంస్థ(ఏపీటిడ్కో) ప్రత్యేక శ్రద్ధతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 9,560 గృహాల నిర్మాణ పనులు చేపట్టింది. మహావిశాఖ నగర పరిధికి చెందిన అనకాపల్లి జోన్‌ ప్రాంత వాసుల కోసం ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కృషితో అత్యధికంగా తొలి విడతలోనే 2,528 ఇళ్ల నిర్మాణాన్ని గత ఏడాది నవంబర్‌లో ప్రారంభించారు. పనులను డిసెంబర్‌లో చేపట్టారు. తొలి కాంక్రీటు పనులు జనవరి 23న ప్రారంభించగా, రెండు నెలల్లోనే 30కి పైగా స్లాబులను వేశారు. ఇప్పటికే ఆరు బ్లాకుల్లో పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు బ్లాకుల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కో బ్లాకులో 32 అపార్టుమెంట్లు ఉండేలా నిర్మిస్తున్నారు. దక్షిణ కొరియాకు చెందిన షియర్‌వాల్‌ టెక్నాలజీతో ఇటుక, ప్లాస్టరింగ్‌లు అవసరం లేకుండా పునాదుల నుంచి పై కప్పు, తుది నిర్మాణాల వరకు కాంక్రీటుతో నిర్మిస్తున్నారు. వంద రోజుల్లో నాలుగు అంతస్తుల భవనాన్ని నమూనాగా పూర్తి చేశారు.

కేటగిరి ఒకటిలో 300 చదరపు అడుగుల గృహానికి రూ.6.46 లక్షల వెచ్చిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ రాయితీ రూ.3.03 లక్షలు, లబ్ధిదారుని వాటా రూ.500, బ్యాంకు రుణం రూ.3.45 లక్షలు ఉంటుంది. అలాగే కేటగిరి రెండులో 365 చదరపు అడుగుల గృహానికి రూ.7.42 లక్షలు వ్యయం చేస్తున్నారు. ఇందులో ప్రభుత్వ రాయితీ రూ.3.03 లక్షలు కాగా లబ్ధిదారుని వాటా రూ.50 వేలు, బ్యాంకు రుణం రూ.3.92 లక్షలు అవుతుంది. కేటగిరీ మూడులో 430 చదరపు గజాల స్థలానికి రూ.8.37 లక్షల వ్యయం అవుతుండగా అందులో ప్రభుత్వ రాయితీ రూ.3.03 లక్షలు, లబ్ధిదారుని వాటా రూ.లక్ష కాగా బ్యాంకు రుణంగా రూ.4.36 లక్షలు సమకూరుస్తుంది. రూ.518.5 కోట్లతో చేపట్టిన పనులు చురుగ్గా సాగుతుండటంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. ఆగస్టు నెలలో తామంతా సొంత గృహానికి యజమానులు కానున్నామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో ప్రాంగణ అభివృద్ధి పనులు : సత్యనారాయణపురం చంద్రన్ననగర్‌లో నిర్మిస్తున్న టిడ్కో భవన సముదాయ ప్రాంగణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయని టిడ్కో డీఈ కేవీ జయకుమార్‌ తెలిపారు. ప్రాంగణంలో నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ రూ.18 కోట్లతో చేపట్టిన పనుల టెండర్లను నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ(ఎన్‌సీసీ)  చేజిక్కించుకుందన్నారు. వారం రోజుల్లో వారు పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఆగస్టు నాటికి భవన నిర్మాణాలతో పాటు అన్ని మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేయనున్నామన్నారు. ప్రాజెక్టు మేనేజర్‌ వెంకటేశ్వరరావు, ఇంజినీర్‌ ప్రధాన్‌, ఏఈలు సత్యశ్రీ, ప్రియాంక పాల్గొన్నారు.

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo