గోవాకు దీటుగా విశాఖ అభివృద్ధి

* పర్యాటక అభివృద్ధి అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో వివిధ శాఖలతో కలిపి ‘టూరిజం బ్యూరో’ను ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవల అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటుచేసి పర్యాటక అభివృద్ధిపై సమగ్రంగా చర్చించాం. గుడ్లవానిపాలెంలో ప్రభుత్వ భూమిని పర్యాటక అవసరాల కోసం వినియోగించుకునేలా పునః ప్రకటన (డీ నోటిఫికేషన్) కోసం కలెక్టర్ ప్రతిపాదనలు పంపారు. మధురవాడలో భారీ సమావేశ ప్రాంగణం (కన్వెన్షన్ సెంటర్) ఏర్పాటు కోసం ఇటీవలే ఇన్కాప్ సంస్థ టెండర్లు ఆహ్వానించింది. విశాఖ ఓడ రేవు సాయంతో తీరంలో పర్యాటక నౌకల రాకపోకల కోసం జట్టీ ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నాం.హెలీకాప్టర్లో విశాఖ నగర అందాలను పర్యాటకులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో నగరానికి వచ్చి వెళ్లేలా జపాన్, హాంకాంగ్ ఎయిర్ లైన్స్ నిర్వాహకులతో సంప్రదింపుల కోసం చర్యలు తీసుకుంటున్నాం.
* ఉత్తరాంధ్రలోని అన్ని ప్రఖ్యాత దేవాలయాలను పర్యాటకులు దర్శించేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలని సంబంధిత వర్గాలకు సూచించాం. ఆరోగ్య కేంద్రంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తోంది. బే పార్కు ప్రారంభంతో ఆరోగ్యధాంగా విశాఖ మరింత ఉన్నత స్థాయిని అందుకోగలదు. విశాఖ ఏజెన్సీలో అందమైన, ఆహ్లాదమైన వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నాం. అరకులో సాహస క్రీడల కోసం దిల్లీలోని సంబంధిత వర్గాలతో సంప్రదింపులు చేస్తున్నాం. గోల్ఫ్ కోర్సుల ఏర్పాటు కోసం కూడా చర్యలు తీసుకుంటున్నాం. లంబసింగి అభివృద్ధి కోసం రూ.8 కోట్లతో వివిధ పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డల్లాపల్లిలోనూ మరో రూ.4.50 కోట్లతో పర్యాటకుల కోసం పలు వసతులు కల్పిస్తున్నాం. విశాఖలో ‘ఎమ్యూజ్మెంట్ పార్కు’ ఏర్పాటు కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది.