News

Realestate News

గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తాం

గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తాం
మంత్రి గంటా  శ్రీనివాసరావు
విశాఖపట్నం, న్యూస్‌టుడే : సింహాచలంలో ఈనెల 26వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఆయన సింహగిరిపై ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించాక విలేఖరులతో మాట్లాడారు. ఈ ఉత్సవానికి ఈసారి రాష్ట్రేతర భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గత అనుభవాలను సమీక్షించుకుని ఎక్కడా లోటు పాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2వేల మంది పోలీసులు భద్రతా చర్యలు చేపడతారన్నారు. గిరి చుట్టూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతేడాది మరుగుదొడ్లు చాల్లేదని ఫిర్యాదులు రావడంతో ఈసారి వాటి సంఖ్యను పెంచినట్లు చెప్పారు. కొండదిగువన తొలి పావంచా ప్రాంతాన్ని విస్తరించడం వల్ల భక్తుల రద్దీ సమస్య తీరుతుందన్నారు. ఈనెల 27న సంపూర్ణ చంద్రగ్రహణం రావడం వల్ల భక్తులంతా ఈనెల 26వ తేదీనే స్వామిని దర్శించుకోవడం మంచిదని సూచించారు. ఏర్పాట్లపై ఈవో రామచంద్రమోహన్‌ మంత్రికి వివరించారు. అంతకుముందు మంత్రి అప్పన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.