News

Realestate News

గిరి గ్రామాల్లో తపాలా సేవల విస్తరణ

గిరి గ్రామాల్లో తపాలా సేవల విస్తరణ

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: గిరిజన గ్రామాల్లో తపాలా సేవలను విస్తరించి ప్రజలు పొదుపు మార్గంలో పయనించేలా చర్యలు చేపడుతున్నట్లు తపాలా శాఖ అనకాపల్లి డివిజన్‌ ఎస్పీ కె.ఎల్‌.నాయుడు చెప్పారు. ముంచంగిపుట్టు మండలం బరడ పంచాయతీలో తపాలా శాఖ నూతన కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సమావేశంలో మాట్లాడుతూ.. అరకులోయ సబ్‌డివిజన్‌లో 24 బ్రాంచి పోస్టాఫీసులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తొలి విడతగా బరడలో తపాలా కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో తపాలా కార్యాలయం ఏర్పాటు చేసి సేవలను అందించాలని సూచించినట్లు పేర్కొన్నారు. తపాలా కార్యాలయాల్లో పొదుపు, రికరింగ్‌ డిపాజిట్లు, గ్రామీణ తపాలా బీమా, సుకన్య సమృద్ధి పథకాలకు సంబంధించి ఖాతాలు తెరవవవచ్చన్నారు. తపాలా శాఖ ఆధ్వర్యంలో ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సర్పంచి సుశాంతి, అరకు ఐపీవో శ్రీను, అనకాపల్లి డివిజన్‌ కార్యాలయ సిబ్బంది కృష్ణారావు, పెదబయలు ఉప తపాలా కార్యాలయ సిబ్బంది రామారావు, గాసన్న, శ్రీను, గంగారావు తదితరులు పాల్గొన్నారు.