News

Realestate News

గిరిపుత్రుల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం

గిరిపుత్రుల ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం
మంత్రి కామినేని శ్రీనివాస్‌
పాడేరు, న్యూస్‌టుడే: గిరిజనుల ఆరోగ్య సంరక్షణకే వైద్య, ఆరోగ్య శాఖ అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. పాడేరులో రూ.4 కోట్లతో కొత్తగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రిబ్బను కత్తిరించి ఆసుపత్రిలో ప్రవేశించారు. ఆసుపత్రి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందుతున్న తీరు, వైద్యుల సంఖ్య, ఇతర సిబ్బంది వివరాలను జిల్లా సమన్వయకర్త డా.నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇతర సిబ్బంది ఉన్నా.. ప్రత్యేక నిపుణులైన వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని సమన్వయకర్త నాయక్‌ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వైద్య సేవలను మెరుగుపర్చాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్‌ వైద్య సేవల ద్వారా ఉచితంగా వివిధ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక పీఎంఆర్సీ అతిథి గృహానికి చేరుకొని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తల్లి, బిడ్డ మృతి చెందిందని, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్‌, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించి బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి ద్వారా రూ.2 లక్షలు నష్ట పరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు సబ్‌కలెక్టర్‌ శివశంకర్‌, ఏడీఎంహెచ్‌ఓ వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధికమిటీ అధ్యక్షుడు అడపా బొంజునాయుడు, వైద్యాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వైద్య నిపుణుల కోసం నిబంధనల సడలింపు
ఏజెన్సీలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చే ప్రత్యేక వైద్య నిపుణుల కోసం అవసరమైతే నిబంధనలను సడలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కామినేని పేర్కొన్నారు. పాడేరు ప్రాంతీయ ఆసుపత్రిలో సోమవారం తల్లీబిడ్డ చనిపోవడం బాధాకరమని, కేవలం గైనకాలజిస్టు ఉండి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదన్నారు. ఏజెన్సీలో స్థానికంగా వైద్యవిద్యను పూర్తి చేసిన వైద్యులు సామాజిక స్పృహతో సాటి గిరిజనులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తే వైద్యుల కొరత ఉత్పన్నం కాదని చెప్పారు. వైద్య నిపుణుల ఖాళీలను పూరించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, పాడేరు, అరుకు ఆసుపత్రిల్లో పని చేసేందుకు వచ్చే గైనకాలజిస్టుకు నెలకు రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో ఇక్కడ పని చేసేందుకు ఇష్టపడని వారికి తాత్కాలికంగా ప్రతి రెండు నెలలకోసారి వచ్చి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో రూ.4.30 కోట్లతో కొత్త ఆసుపత్రికి నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు.

275 వాహనాలతో ప్రజల చెంతకే వైద్యం
అరకులోయ, న్యూస్‌టుడే: ప్రజల చెంతకే మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా రాష్ట్రంలో 275 సంచార వాహనాలతో చంద్రన్న సంచార చికిత్సను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం అరకులోయలో నూతనంగా రూ. 4 కోట్లతో నిర్మించిన ప్రాంతీయ వైద్యకేంద్రం భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో 104 వాహనాల సేవలు సక్రమంగా అందకపోవటంతో వాటి స్థానంలో చంద్రన్న సంచార చికిత్స వాహనాలను ప్రారంభించామన్నారు. ఈ వాహనాల్లో ఓ వైద్యుడు, నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌ ఉండి వాహనంలో పరీక్షలు నిర్వహించి అక్కడే వారికి మందులను అందజేస్తారన్నారు. ఈ వాహనాలకు జీపీఆర్‌ఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి సక్రమంగా సేవలందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాతా, శిశువుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా వైద్యసిబ్బందికి ట్యాబ్‌లను పంపిణీ చేశామన్నారు.

డిప్యుటేషన్‌పై వైద్యనిపుణుల నియామకం
అరకులోయ, పాడేరు ప్రాంతీయ వైద్యకేంద్రాల్లో నిపుణులైన వైద్యుల కొరత ఉందన్నారు. వీటిని అధిగమించేందుకు డిప్యుటేషన్‌పై నిపుణులైన వైద్యులను నియమించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు స్త్రీవైద్య నిపుణులు అదనపు వైద్యాధికారులుగా పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విధానం సరైంది కాదన్నారు. వసతి గృహాల్లో వరుసగా విద్యార్థుల మరణాలు తమ దృష్టికి వచ్చిందని, వీటిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు అరకులోయ వచ్చిన మంత్రి కామినేని శ్రీనివాస్‌కుఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమ, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ నృత్యం థింసాతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మహిళలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొని పాదం కలిపారు.

మృతిచెందిన గర్భిణి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం
పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: అత్యవసర వైద్యం అందక పాడేరు మండలం బొక్కెళ్లు గ్రామానికి చెందిన గర్భిణి దనసాని సుబ్బలక్ష్మి (28) పసికందుతో సహా సోమవారం మృతి చెందటం తెలిసిందే. దీనిపై మంగళవారం తెల్లవారు జాము నుంచి పాడేరులోని ప్రాంతీయాస్పత్రి ప్రధాన గేటు వద్ద మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. దీంతో ఆసుపత్రికి వివిధ ప్రాంతాల నుంచి అత్యవసర సేవలు నిమిత్తం వచ్చిన రోగులను 12 గంటల వరకు లోనికి వెళ్లనివ్వలేదు. వివిధ సంఘాలు నేతలు, పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు. మృతి చెందిన తల్లీబిడ్డల కుటుంబాన్ని, అనాథలైన ఇద్దరు పిల్లలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని.. జీకే వీధి మండలం కస్తూర్భా గాంధీ పాఠశాలలో తాత్కాలిక ఫిజిక్స్‌ ఉపాధ్యాయురాలికి ఏడాది బకాయి వేతనాలు ఇప్పించాలని.. చికిత్సలో నిర్లక్ష్యం వహించిన వైద్యురాలు డాక్టర్‌ శోభారాణి, సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని.. రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని.. ఐదు మండలాలకు ప్రధాన కేంద్రమైన ఏరియా ఆసుపత్రిలో గైనిక్‌ వైద్య నిపుణులను నియమించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం పాడేరు సుండ్రుపుట్టు సమీపంలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభం అనంతరం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ పీఎంఆర్సీలో అధికారులతో సమీక్షించారు. ఏరియా ఆసుపత్రి వద్ద ఆందోళన సమాచారం తెలుసుకున్న మంత్రి అక్కడికి చేరుకుని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మృతురాలి కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారం చెల్లిస్తామన్నారు. సుబ్బలక్ష్మి జీకే వీధి మండలంలోని ఉపాధ్యాయురాలికి వేతన బకాయిలపై విచారణ చేపట్టి వేతనాలు అందేలా చూడాలని సబ్‌కలెక్టరుకు సూచించారు. దీంతో బంధువులు ఆందోళనను విరమించుకుని మృతదేహాన్ని తమ స్వగ్రామానికి తరలించారు.

Source : http://www.eenadu.net/