Posted on December 30, 2016 by vijay kumar in Realestate News
గిరిజనుల కళ్లలో ఆనందం! జిల్లా పోలీసుల చొరవతో 38 మందికి నేత్ర శస్త్రచికిత్సలు
విశాఖపట్నం, ఈనాడు: దృష్టిలోపాలు.. ఇతర నేత్ర సమస్యలతో బాధపడుతున్న గిరిజనుల కళ్లల్లో వెలుగులు నిండాయి. పోలీసుల చొరవతో వారి కళ్లలో ఆనందం కనిపించింది. జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న దర్శిని కార్యక్రమంలో భాగంగా జీకేవీధి, సీలేరు, జి.మాడుగుల, చింతపల్లి మండలాల్లో ఈనెల 19న ఆయా ప్రాంతాల్లో మెగా నేత్ర వైద్యశిబిరం నిర్వహించి దృష్టిలోపాలను గుర్తించారు. వీరిలో 38 మంది గిరిజనులకు శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర శస్త్రచికిత్సలు నిర్వహించారు. మరో 13 మందికి అవసరమైన మందులు అందజేశారు. వీరితోపాటు సహాయకులుగా వచ్చిన 73 మందికి గత మూడు రోజులుగా జిల్లా పోలీసులు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. మూడు రోజులపాటు జీకేవీధి ఎస్సై బి.చంద్రశేఖర్ వీరితో ఉంటూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. చివరి రోజు గిరిజనులు ఎస్పీతోపాటు ఇతర పోలీసు సిబ్బందిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలుచేసే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ప్రగతిపథంలోకి గిరిజన ప్రాంతాలు ముందుకు సాగాలని ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఆకాంక్షించారు. శస్త్రచికిత్సలు చేసుకుని తిరుగు ప్రయాణమైన గిరిజనులతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ముచ్చటించారు. వారికి ఎస్పీ స్వయంగా భోజనాలు వడ్డించారు. గిరిజనులకు పోలీసుల మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. మావోయిస్టుల అభివృద్ధి నిరోదక చర్యలను గుర్తించి ఇప్పటికైనా వారి ప్రభావం నుంచి బయటపడాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) అట్టాడ బాబూజీ, ఎస్బీఎక్స్ సీఐ వెంకటరావు, డీఎస్బీ సీఐ కిరణ్‌కుమార్, డీఏఆర్ ఆర్ఐ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.