క్రీడాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం

క్రీడాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం
ఒలింపిక్స్‌లో స్వర్ణం తేలేకపోయాం: మంత్రి గంటా
న్యూస్‌టుడే, విశాఖ క్రీడలు, బీచ్‌రోడ్డు
క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పోర్టు స్టేడియంలో జరిగిన పోలీసు క్రీడల ముగింపోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అఖిల భారత స్థాయి పోలీసు క్రీడలకు విశాఖ వేదిక కావడం అభినందనీయమన్నారు. నిత్యం ఒత్తిడిలో ఉండే పోలీసులు అయిదురోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో పాల్గొని ఉల్లాసంగా గడపడం ముదావహమన్నారు. రియో ఒలింపిక్స్‌లో మన దేశం స్వర్ణ పతకం కనీసం తేలేకపోయామని, రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. మన కన్నా అతి తక్కువ జనాభా కలిగిన జింబాబ్వే, తదితర దేశాలు స్వర్ణాలు తేవడంలో ముందున్నాయంటే క్రీడల్లో మనం ఎంత వెనుకబడి ఉన్నామో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ పరిణామం మారాలని, రాష్ట్రం క్రీడహబ్గా తయారవుతుందని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంటు సౌజన్యంతో గచ్చిబౌలి తరహాలో అంతర్జాతీయ స్టేడియం విశాఖలో నిర్మితం కానుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో అర్చరీ అకాడమీ ఒక్కటి ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. డీజీపీ ఎన్.సాంబశివరావు మాట్లాడుతూ పోలీసు క్రీడలు ఘనంగా నిర్వహించిన సీపీ యోగానంద్, ఆర్.పి.మీనాలను అభినందించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన పోలీసు క్రీడాకారులు విశాఖ అందాలను ఆస్వాదించారన్నారు. అంతకుముందు మంత్రి గంటాశ్రీనివాసరావు, డీజీపీ ఎన్.సాంబశివరావులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇంటిలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టరు అరవింద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.