News

Realestate News

క్రమబద్ధీకరణ జీవో వచ్చేసింది


క్రమబద్ధీకరణ జీవో వచ్చేసింది

500 గజాలు దాటిన స్థలాలపై మరోసారి ఉత్తర్వులు
పంచగ్రామాల భూ సమస్య సమసినట్టే
విశాఖపట్నం, న్యూస్‌టుడే

పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంది.

మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు అడివివరం, వేపగుంట, వెంకటాపురం, చీమలాపల్లి, పురుషోత్తపురం గ్రామాల్లో భూముల క్రమబద్ధీకరణకు గురువారం సాయంత్రం 229 జీవోను విడుదల చేసింది.

ఈ నెల 5న మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల్లో కొన్నింటికి స్వల్ప మార్పులు చేసింది. విధి విధానాలను వివరిస్తూ 232 జీవోను కూడా విడుదల చేసింది.

క్రమబద్ధీకరణ రుసుములు, విధి విధానాలు, దరఖాస్తు పద్ధతి, ఇతర విషయాలను పొందుపరిచింది. ఈ నేపథ్యంలో త్వరలోనే క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇందుకు సంబంధించి కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఇప్పటికే సన్నాహాలు చేసినట్టు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేసిన దరఖాస్తుల స్వీకరణకు అధికారులు శ్రీకారం చుడతారని తెలిసింది.
301 చదరపు గజాల నుంచి 500 చదరపుగజాల్లోపు స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.

300 గజాల వరకు 1998 నాటి రిజిస్ట్రేషన్‌ విలువలో 30 శాతం, 300 గజాలు దాటిన విస్తీర్ణానికి ప్రస్తుత మార్కెట్ విలువను చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలి.

500 గజాలు దాటిన ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి తర్వాత ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

క్రమబద్ధీకరణ రుసుములు ఇలా…
పంచగ్రామాల్లోని దేవస్థాన భూముల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం శ్లాబుల వారీగా ధరలను నిర్ణయించింది.
* 1 నుంచి 100 గజాల్లోపు ఇళ్లు, ఇళ్ల స్థలాలను దారిద్య్ర రేఖకు దిగువున (బీపీఎల్‌) ఉన్న కుటుంబాలకు పూర్తి ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు.

దారిద్య్ర రేఖకు ఎగువున (ఏపీఎల్‌) కుటుంబాలు 1998 నాటి రిజిస్ట్రేషన్‌ విలువలో 7.5 శాతం చెల్లించాలి.
* 101 నుంచి 200 గజాల్లోపు అయితే 1998 నాటి రిజిస్ట్రేషన్‌ విలువలో 7.5 శాతం ధర చెల్లించాలి.
* 201 నుంచి 300 గజాల్లోపువారు 1998 నాటి రిజిస్ట్రేషన్‌ విలువలో 15 శాతం చెల్లించాలి.
* పంచగ్రామాల్లోని దేవస్థానం భూముల్లో 2008 లెక్కల ప్రకారం 12,149 నిర్మాణాలను దేవస్థానం గుర్తించింది.

ఈ ప్రకారం దేవస్థానానికి 547.13 ఎకరాల స్థలాన్ని ప్రత్యామ్నాయంగా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ భూమిని గుర్తించాలని కలెక్టర్‌ను ఆదేశించింది.