News

Realestate News

క్యాన్సర్‌ మరణాలు కలచివేస్తున్నాయి

క్యాన్సర్‌ మరణాలు కలచివేస్తున్నాయి

ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే  : దేశంలో క్యాన్సర్‌ మరణాలు కలచి వేస్తున్నాయని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా 13 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయన్నారు. బాబా అణు పరిశోధన కేంద్రం, హోమీ బాబా క్యాన్సర్‌ ఆసుపత్రి, పరిశోధన కేంద్రం ద్వారా జాతికి అందిస్తున్న సేవలు, పనితీరును వుడా బాలల ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఉపరాష్ట్రపతికి అధికారులు, శాస్త్రవేత్తలు వివరించారు. అణు పరిశోధన కేంద్రం పనితీరుపై బార్క్‌ ప్రాంతీయాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. హోమీ బాబా క్యాన్సర్‌ ఆసుపత్రి పనితీరు, అందిస్తున్న సేవలను ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ రఘునాధరావు, డాక్టర్‌ లీల వివరించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశంలో వివిధ రకాల వ్యక్తులు, సంస్థలతో ముచ్చటిస్తున్నట్లు తెలిపారు. వీరిలో విద్యార్థులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, రైతులు ఉన్నారన్నారు. సమస్యలను  తెలుసుకొని ప్రభుత్వానికి, నీతి ఆయోగ్‌కు తెలియజేస్తానని తెలిపారు. ఇందులో భాగంగానే  56 విశ్వవిద్యాలయాలకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించానన్నారు. క్యాన్సర్‌ మరణాలను తగ్గించడంతోపాటు అందరికీ ఈ వైద్యసేవలు చేరాలన్నారు.

ఆర్థిక ఇబ్బందులు, అవగాహన రాహిత్యం, వైద్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోకపోవడం, వైద్యానికి దూరంగా ఉండడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. విద్యుదుత్పత్తిలో సుస్థిర అభివృద్ధి సాధించాలన్నారు. మన పూర్వీకులు మనకు మంచి సంస్కృతి, సంప్రదాయం, ఆహార అలవాట్లు చేశారన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ డాక్టర్‌  హరిబాబు, కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, డాక్టర్‌ ఎం.సత్యనారాయణ, డాక్టర్‌ మనోజ్‌, డాక్టర్‌ వెంకటరత్నం, సిఇ మూర్తి, డాక్టర్‌ కోటయ్య, ఎం.ఎస్‌.రావు, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.