News

Realestate News

కోటి కోటి దండాలయ్య..కోనేటి రాయడా!

కోటి కోటి దండాలయ్య..కోనేటి రాయడా!
వెంకన్న సేవలో భక్తకోటి
భక్తులతో కిక్కిరిసిన ఉపమాక
ఘనంగా ధ్వజారోహణం
నక్కపల్లి, న్యూస్‌టుడే: అందరి తపన ఒక్కటే.. అందరి నడక అటువైపే.. మనసునిండా భక్తిభావన.. కలియుగం దైవం ఉపమాక వెంకన్నను దర్శించుకోవాలనే ఆనందంతో గోవిందనామస్మరణ చేస్తూ..పదులు..వందలు.. వేలుగా అంతా కలిసి ఉపమాక వైపే సాగారు.

నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయ వార్షిక కల్యాణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజల అనంతరం తెల్లవారుజామునుంచే భక్తులకు దర్శనాలు కల్పించారు. ఈ వేడుకను తిలకించడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం తర్వాత భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. ముందు జాగ్రత్తగా తితిదే అధికారులు భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. కొండపైకి దర్శనానికి వెళ్లేవారికి, ఆలయంలోకి వచ్చేవారికి వేర్వేరుగా వీటిని నిర్మించారు. ఉదయం 9గంటల తర్వాత ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆమేరకు క్యూలైను పూర్తిగా నిండిపోవడంతో ఆవరణలోనే పోలీసులు నాలుగు లైన్లు ఏర్పాటు చేసినా రద్దీని అదుపుచేయలేకపోయారు. దీంతో రాజయ్యపేట రోడ్డు మార్గంలోకి లైను నడిచింది. దీంతో తితిదే అధికారులు దర్శనాల వేగాన్ని పెంచారు. ఎప్పటికప్పుడు నక్కపల్లి సి.ఐ. రాంబాబు, ఎస్సై రామకృష్ణ పరిస్థితిని సమీక్షించి ఇబ్బందుల్లేకుండా చేపట్టారు. కొండపైకి వెళ్లే భక్తుల్లో చాలామంది మెట్లకు పసుపు, కుంకుమపూజలు చేశారు. అదే విధంగా బంధుర సరస్సులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించే ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. ఆలయంలో అలంకరించిన పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయంలో భక్తులకు ప్రత్యేకంగా ఉచిత ప్రసాదాలు అందించారు.

లడ్డూ కోసం పోటాపోటీ
తితిదే ఆధ్వర్యంలోని లడ్డూ పంపిణీ కేంద్రం వద్ద కొనుగోళ్ల కోసం భక్తులు పోటీపడ్డారు. ఉపమాక వెళ్లే మార్గంలో రామానుజచార్యుల వెయ్యేళ్ల జయంతి వేడుకల కార్యక్రమంలో భాగంగా తెచ్చి ఏర్పాటు చేసిన భారీ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంది.

వేడుకగా ధ్వజారోహణం
కల్యాణ వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం చేపట్టిన ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా సాగింది. పెద్ద పల్లకీలో సతీసమేతుడైన వెంకన్నను ఉంచి తిరువీధుల్లో ధ్వజపటంతో కలిపి వూరేగింపు చేపట్టారు. అనంతరం ఆలయానికి చేరుకుని అర్చకులు ధ్వజారోహణం చేశారు. ధ్వజపటానికి పూజలు చేసి, ఉత్సవాల ప్రారంభానికి సూచికగా స్తంభపైకి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో పలువురు చిన్నారులు వీధుల్లో చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. కాగిత గ్రామానికి చెందిన చిన్నారులు అన్నమాచార్య కీర్తనలకు కోలాటంతో వేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వెంకన్నను దర్శించుకున్న ప్రముఖులు
ఉపమాక వెంకన్న వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు స్వామి దర్శనానికి వచ్చారు. ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి స్వామివారిని దర్శించుకున్నారు. వీరందరికీ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. అదే విధంగా వివిధశాఖలకు చెందిన పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు దర్శనాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతో ఎంతో మేలు ఉందని అన్నారు. దీనిద్వారా అన్ని రకాలుగా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. ఉపమాక ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని అమలు చేయించారని, ఎవరూ వూహించనంత అభివృద్ధి ఇక్కడ కనిపిస్తుందని వివరించారు.