News

Realestate News

కొరత తీరాలి… ఉత్పత్తి పెరగాలి

కొరత తీరాలి… ఉత్పత్తి పెరగాలి
ఉక్కులో కోక్‌ కొరత..?
అధిగమించేందుకు ప్రత్యామ్నాయ యత్నాలు
న్యూస్‌టుడే, విశాఖపట్నం
నాణ్యమైన కోక్‌తో పాటు ఇతర ముడిసరకులతోనే మెరుగైన ఉక్కు ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఉక్కు తయారీలో కోక్‌ ప్రధాన ఇంధనంగా పని చేస్తోంది. అది లేకపోతే ఉక్కు తయారీ లేనట్లే. విశాఖ ఉక్కులో ప్రస్తుతం దాని కొరత ఉంది. అధిగమించేందుకు సంస్థ ప్రతినిధులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

విశాఖ ఉక్కు కర్మాగారంలో మూడు బ్లాస్ట్‌ఫర్నెస్‌లు నిరంతరంగా పని చేస్తూ… ఉక్కు ఉత్పత్తికి దోహదపడుతున్నాయి. అందుకు బ్లాస్ట్‌ఫర్నెస్‌లకు అవసరమైన కోక్‌ను కోకోఒవెన్‌ విభాగం అందించలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం బ్లాస్ట్‌ఫర్నెస్‌ల్లో పూర్తిస్థాయిలో బ్యాటరీలు లేకపోవడమే.

గతంలో రెండు ఫర్నెస్‌లు నడిచినపుడు నాలుగు బ్యాటరీలు పనిచేసేవి. ఇప్పుడు మూడు ఫర్నెస్‌లు రావడంతో ఆ మేరకు బ్యాటరీల కొరత ఏర్పడింది. మూడో బ్లాస్ట్‌ఫర్నెస్‌ నిర్మాణ సమయంలో ఐదో బ్యాటరీ నిర్మాణానికి తగిన అనుమతులు ఉన్నా… పలు కారణాల దృష్ట్యా   నిర్మాణం జరగలేదు. ఇక ఆరో బ్యాటరీ ఊసేలేదు. దాంతో కర్మాగారానికి కోక్‌ పూర్తిస్థాయిలో అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇతర కర్మాగారాల నుంచి కోక్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

ఉప ఉత్పత్తులు-వినియోగం
ఈ కోక్‌ తయారీలో అనేక ఉప ఉత్పత్తులు వెలువడతాయి. అందులో ప్రధానమైనవి ముడికార్బన్‌ మోనాక్సైడ్‌ గ్యాస్‌, శుభ్రపరచిన కోకోవెన్‌ గ్యాస్‌, అమ్మోనియం సల్ఫేట్‌, ముడి బెంజాల్‌, ముడి తారు, సాల్వెంట్‌ ఆయిల్‌, నాఫ్తలీన్‌బాల్స్‌ వంటివి ఉత్పత్తి అవుతాయి.

కోక్‌లో బ్లాస్ట్‌ఫర్నెస్‌ కోక్‌, నట్కోక్‌, కోక్‌ బ్రీజ్‌, కోక్‌ డస్ట్‌ అనే రకాలు తయారు అవుతాయి.

బ్లాస్ట్‌ఫర్నెస్‌లో ద్రవ ఉక్కు తయారీకి అవసరమైన కోక్‌ను ఉత్పత్తి చేయడమే కోకోఒవెన్‌ బ్యాటరీల లక్ష్యం. ఈ కోక్‌ తయారీలో వెలువడే గ్యాస్‌ను కర్మాగారంలోని పలు విభాగాల్లో హీటింగ్‌ పనులకు వినియోగిస్తారు.

కోల్‌తార్‌ను పెయింట్ల తయారీలో, డైస్‌, ప్రింటింగ్‌లో వినియోగిస్తారు.
క్రూడ్‌ బెంజాయిల్‌ను ప్లాస్టిక్‌ పరిశ్రమల్లో, ఎరువుల కర్మాగారాల్లో, డిటర్జెంట్ల తయారీలో వినియోగిస్తారు.

కోక్‌ డస్ట్‌, కోక్‌ స్లడ్జెస్‌ను కెమికల్‌ కర్మాగారాలు, ఫోర్జ్‌షాపులు, పౌండ్రీల్లో వినియోగిస్తారు.

కోక్‌ తయారీ ఇలా…
కోక్‌ తయారీకి ప్రధాన ముడిసరకు కోకింగ్‌ కోల్‌. ఇది 90 శాతం వరకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఓడరేవుల ద్వారా దిగుమతి అవుతుంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మొజాంబిక్‌, ఇండోనేషియా తదితర దేశాల నుంచి గంగవరం పోర్టు ద్వారా ఉక్కు పరిశ్రమకు చేరుతోంది. ఛత్తీస్‌ఘడ్‌, బిహార్‌ రాష్ట్రాల నుంచి రైలు మార్గం ద్వారా వచ్చే దేశీయ కోల్‌ కూడా సంస్థకు చేరుతుంది. ఏడాదిలో సుమారు 40 లక్షల టన్నుల విదేశీ, దేశీయ కోకింగ్‌ కోల్‌ సంస్థకు దిగుమతి అవుతోంది. ఇలా 90 శాతం విదేశీ కోకింగ్‌ కోల్‌ను, 10 శాతం దేశీయ కోకింగ్‌ కోల్‌ను కలిపి మొత్తాన్ని మెత్తని పౌడర్‌గా చేసి కోల్‌ ప్రిపరేషన్‌ ప్లాంట్‌కు పంపిస్తారు. అక్కడ నుంచి ఒవెన్స్‌తో నిండి ఉన్న కోకోవెన్‌ బ్యాటరీలకు సరఫరా అవుతుంది. ఒక బ్యాటరీలో 67 ఒవెన్స్‌ ఉంటాయి. ప్రసుత్తం ఉక్కు కర్మాగారంలో నాలుగు బ్యాటరీలు పని చేస్తున్నాయి. మరో బ్యాటరీ నిర్మాణ దశలో ఉంది. ఒవెన్స్‌లో నింపిన కోకింగ్‌ కోల్‌ పౌడర్‌ను సుమారు 1000 నుంచి 1050 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద 16 నుంచి 19 గంటల పాటు వేడి చేస్తారు. నిర్ణీత సమయం అనంతరం దాన్ని ఒవెన్స్‌ నుంచి తీసి కోక్‌ డ్రై కూలింగ్‌ ప్లాంట్‌ ఛాంబర్స్‌లో పోసి… 150 డిగ్రీల నుంచి 200 డిగ్రీల స్థాయికి చల్లబరుస్తారు. అప్పుడు తయారైన పదార్థాన్నే కోక్‌ అంటారు. కర్మాగారంలో పల్వనైజ్డ్‌ కోల్‌ ఇంజెక్షన్‌ అనే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతో కోల్‌ వినియోగం కొంత మేర తగ్గిస్తున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

అతిపురాతనమైన 7 మీటర్ల ఎత్తు ఉన్న బ్యాటరీలు దేశం మొత్తం మీద కేవలం విశాఖ ఉక్కులోనే ఉన్నాయి.

కోక్‌ఒవెన్‌ బ్యాటరీలో కోక్‌ను చల్లబరచే ప్రక్రియ నుంచి వెలువడే ఉష్ణాన్ని వినియోగించి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. అందులో ఎక్కువ మొత్తాన్ని సంస్థలోనే వినియోగించేస్తున్నారు. మిగిలిన దాన్ని గ్రిడ్‌కు ఎగుమతి చేస్తున్నారు.

ఒక టన్ను ఉక్కు తయారీకి సుమారు 500 నుంచి 600 కిలోల కోక్‌ను వినియోగిస్తారు. కర్మాగారంలో మూడు బ్లాస్ట్‌ఫర్నెస్‌లూ పని చేస్తే…. రోజుకు సుమారు 9075 టన్నుల కోక్‌ అవసరం ఏర్పడుతుంది. ఈ లెక్కన ఏడాదికి దాదాపు 33 లక్షల టన్నుల వినియోగం ఉంటుంది.

విశాఖ ఉక్కు కోకోఒవెన్‌ విభాగంలో ఏడాదికి 28 లక్షల టన్నుల కోక్‌ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. లోటును అధిగమించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు. ప్రసుత్తం నీలాచల్‌ వంటి ప్లాంట్ల నుంచి సుమారు 5 నుంచి 8లక్షల టన్నుల కోక్‌ కొనుగోలు చేస్తున్నారు.

ఇలా బయట నుంచి కోక్‌ను కొనుగోలు చేయాల్సి రావడంతో కర్మాగారంపై ఏడాదికి రూ. 110 నుంచి రూ. 180 కోట్ల అదనపు భారం పడుతుందని పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.