News

Realestate News

కొత్తడా రెక్కలొచ్చెనా….

కొత్తడా రెక్కలొచ్చెనా….
టీయూ వెనుక రెక్కలు కనిపించేలా ఏర్పాటు
మరెన్నో మార్పులు.. చేర్పులు
విశాఖ నగరానికి తలమానికంగా నిలిచిన టీయూ142 యుద్ధ విమాన మ్యూజియం రోజు రోజుకు నవీకరణ చేసుకుంటూ ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చిన వారు కేవలం యుద్ధ విమానమే చూసిపోకుండా ఆ ప్రాంగణంలోనే మరికొన్ని అనుభూతులు పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ మ్యూజియం టిక్కెట్ల కాణ్నుంచి అన్ని ధరలూ ఎక్కువగానే ఉన్నాయని సందర్శకులు వాపోతున్నారు. సాధారణ మధ్యతరగతి, పేద ప్రజలు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టలేరని చెప్తున్నారు. ఈ ధరల విషయంలో వుడా ఆలోచించాలని కోరుతున్నారు.

టీయూ 142ను పలు మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు యుద్ధ విమానం ముందు భాగంలో ఒకవైపు రెక్కలే కనిపించేవి. రెండో వైపు విమాన రెక్కలను ఏరో బ్రిడ్జి మూసేయడం వల్ల  కనిపించేవి కావు. ఈ సమస్యను గుర్తించిన వుడా అధికారులు ఏరో బ్రిడ్జిని తొలగించారు. దీనిని వెనక్కు మార్చడంతో యుద్ధ విమానం ముందు భాగంలో అడ్డు తొలగి రెండు వైపుల రెక్కలు చక్కగా కనిపిస్తున్నాయి. విమానం ముందు ఫొటోలు దిగేవారికి పూర్తి విమానం చక్కగా కనిపిస్తోండటంతో సంతోషిస్తున్నారు.

12 నిమిషాల ‘ఏవీ’
ఎంతోకాలంగా ఊరిస్తున్న ఏవీ గదిని ఇంకా ప్రారంభించలేదు. ఈ గదిలో అంతర్జాతీయ ప్రమాణాలతో యుద్ధ విమానం ఘన చరిత్రను, అందించిన సేవలను సందర్శకులకు తెలియజెప్పేలా ఓ ప్రత్యేక ప్రదర్శన ఉండాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇందుకు 10 నుంచి 12 నిమిషాల నిడివి కలిగిన ఆడియో విజువల్‌ (ఏవీ) చూపాలని నిర్ణయించారు. ఇందులో కేవలం 30 మంది మాత్రమే కూర్చునే వీలు ఉంది. మరో పక్క రోజు సగటున 1,800 మంది వరకు సందర్శకులు విచ్చేస్తున్నారు. రద్దీ రోజుల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువే. దీని వల్ల ప్రతి 30 మందికి 12 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తే పరిమిత సంఖ్యలోనే సందర్శకులు దీనిని తిలకించగలుగుతారు. ఈ డైలమా నెలకొనడం వల్లే ఏవీ గది ప్రారంభం విషయంలో యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇన్ఫోటెయిన్‌మెంట్ విధానం అందుబాటులోనికి తేవడం వల్ల సందర్శకులకు మంచి అనుభూతి కలుగుతుంది.

సిమ్యులేటర్‌…
అద్భుతమైన యుద్ధ విమానం చూసిన సందర్శకులకు అందులో విహరించిన అనుభూతి కలిగించడం కోసం టన్నెల్లో ప్రత్యేక సిమ్యులేటర్‌ గదిని నిర్మించారు. వాటి ధరలు మాత్రం వందల్లో ఉన్నాయి. ఆయా గేమ్‌లకు రూ.100, రూ.200 చొప్పున ధరలు వసూలు చేస్తున్నారు. ఈ సిమ్యులేటర్‌ గదులను వుడా నిర్వాహకులకు కేవలం రూ.18వేల అద్దెకిచ్చింది. వచ్చిన ఆదాయంలో మొదటి ఏడాది కేవలం రెండుశాతం, రెండో ఏడాది మూడు శాతం, మూడో ఏడాది నుంచి అయిదు శాతం చొప్పున వుడాకు అందిస్తారు. లాభాలు ఆర్జించే వ్యాపార సంస్థలకు రాయితీలు ఇచ్చిన వుడా తనకు వచ్చే లాభాల కంటే ప్రజలు చూస్తున్న ఇటువంటి ప్రదర్శనల ధరలు తక్కువగా ఉండేలా చేస్తే ఎక్కువమంది వీక్షించే వీలు కుదురుతుందని సందర్శకులు కోరుతున్నారు.

ధరలు తగ్గిస్తే..
యుద్ధ విమానం వార్షిక, దుకాణాల నిర్వహణ తదితరాలను విశాఖ ఎంటర్‌ ప్రైజెస్‌ నిర్వహిస్తోంది. టిక్కెట్ల విక్రయం, భద్రత తదితరాలను వుడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వుడా ఈఈ మంతెన బలరామరాజు నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. సగటున టీయూ సందర్శన టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తోందని ఈఈ పేర్కొన్నారు. ప్రస్తుతం పెద్దలకు రూ.70, చిన్నలకు రూ.30 చొప్పున టిక్కెట్టు ధరలు వసూలు చేస్తున్నారు. సెంట్రల్‌ పార్కు టిక్కెట్ల ధరలను తగ్గించిన రీతిలో టీయూ 142 ప్రవేశ ధరల విషయంలోనూ వుడా సమీక్షించాలన్న విజ్ఞప్తి వ్యక్తమవుతోంది. నగరంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు, రోజువారి కూలీలు, తక్కువ వేతనాలకు పనిచేసే వారు, కర్షకుల కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నారు.

సాధారణ ప్రజలకు భారమే..
ఇద్దరు పిల్లలున్న నలుగురు కుటుంబం యుద్ధ విమానం చూడడానికి వస్తే టిక్కెట్లకే రూ.200 వెచ్చించాల్సి వస్తోంది. ఇక సిమ్యులేటర్‌, కాఫీ దుకాణాల జోలికి వెళితే వేలల్లోనే వ్యయం చేయాలి. ఈ లెక్కలు చూస్తే సాధారణ ప్రజలకు టీయూ సందర్శన ఆర్థిక భారమే. ఒక్క యుద్ధ విమానాన్ని మాత్రమే వీక్షించి వెళ్లాలనుకున్న పిల్లలతో వచ్చిన వారికి సిమ్యులేటర్‌ గదులకు వెళ్లకుండా సాధ్యపడడం లేదు. ఫలితంగా వీడియో గేమ్‌లను చూడాల్సి వస్తోంది. సావనీర్‌, కాఫీ షాప్‌లు విడివిడిగా ప్రారంభం కావల్సి ఉండగా ఒక విభాగంలోనే నడుపుతున్నారు. మరో విభాగం ఇంకా ప్రారంభించాల్సి ఉంది. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తే టీయూ 142 సందర్శకులను ఆకర్షిస్తున్నా ఇంకా బాలారిష్టాలను అధిగమించలేదు.

పార్కింగ్‌ ప్రధాన సమస్యగానే..
టీయూ సందర్శనకు వచ్చేవారు. బీచ్‌రోడ్‌లోని ప్రధాన రహదారిపైనే తమ వాహనాలను నిలపాల్సి వస్తోంది. టీయూ వద్దే సీ హారియర్‌ను ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంగణాన్ని, భూగర్భ పార్కింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నారు. గతంలోనే టీయూ 142, సబ్‌మెరైన్‌, విశాఖ మ్యూజియంల సంయుక్త ప్రదర్శన క్షేత్రాలుగా చేసి పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయాలని చూశారు. కొత్తగా సీ హారియర్స్‌ రానుండడంతో పార్కింగ్‌ స్థలాల అవసరత మరింత పెరిగింది. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo