News

Realestate News

కొత్తగా 13 ఐటీ సంస్థలు

కొత్తగా 13 ఐటీ సంస్థలు
ప్రారంభించిన మంత్రి లోకేష్‌
ఈనాడు, విశాఖపట్నం, మధురవాడ, న్యూస్‌టుడే: నగరంలో 13 నూతన ఐటీ సంస్థలను, మరో నాలుగు ఐటీ సంస్థల విస్తరణ విభాగాలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ శుక్రవారం ప్రారంభించారు. వీటి ద్వారా దాదాపు 10 వేల ఐటీ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఆయా సంస్థల్లోని యువ ఉద్యోగులతో మంత్రి లోకేష్‌ మాట్లాడారు. కొత్త ఉద్యోగాలొచ్చినందుకు ఎలా ఉందని ఆరా తీశారు. ఐటీ రంగంలో సాధ్యమైనన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ ఫలితంగానే కొత్త సంస్థలు వచ్చాయని వివరించారు. ఆయా సంస్థల ప్రారంభోత్సవాల్లో ఆయన యాజమాన్య ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కొత్త సంస్థలకు అవసరమైన అనుమతులను వేగంగా ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపరంగా ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిపుణులు సలహాలిస్తే కచ్చితంగా పాటిస్తామన్నారు. విశాఖ ఐ.టి. సంస్థల యజమానులు, సీఈవోలతో వాట్సాప్‌లో ఒక గ్రూపును ఏర్పాటు చేసి అందులో తన ఫోన్‌ నెంబరును కూడా జతపరచాలని ఐ.టి.శాఖ ప్రత్యేక కార్యదర్శి అనూప్‌సింగ్‌కు సూచించారు. దీనివల్ల మంచి ఆలోచనలు వేగంగా ఏరోజుకారోజు తెలుస్తాయని వివరించారు. మధురవాడ ఐ.టి.హిల్‌ నెంబరు-3పై మిలీనియం టవర్‌-ఎ నిర్మాణం పూర్తైనందున టవర్‌-బి నిర్మాణం కూడా సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. కాపులుప్పాడలో ఐ.టి.లేవుట్‌ నిర్మాణం చురుగ్గా సాగుతోందని, ప్రస్తుతం రహదారులను నిర్మిస్తున్నారని తెలిపారు. తొలుత వంద ఎకరాల లేఅవుట్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. స్థల కొరత తీర్చడం కోసం సుమారు మూడులక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాంగణం సిద్ధం చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

వసతుల పరిశీలన….:  కొత్తగా ప్రారంభమైన ఐటీ సంస్థల్లోని వసతులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా వాటిని రూపొందించారు. భద్రత కోసం సీసీ కెమెరాలను కూడా అమర్చారు. ఆయా సంస్థల ఉద్యోగులు మంత్రి లోకేష్‌తో సెల్ఫీలు దిగారు.

కొత్త రంగాలపై ఆసక్తి…: మధురవాడ ఐ.టి.హిల్‌పై సెరియం, సహస్రమాయ, ఇన్నోమైండ్స్‌, సింబయోసిస్‌ తదితర సంస్థల ఉద్యోగులతో మాట్లాటారు. గేమింగ్‌, యానిమేషన్‌ రంగంలో వస్తున్న మార్పుల గురించి సింబయాసిస్‌ ఉద్యోగులను ఆరా తీశారు. ఈ రంగం ఇటీవలికాలంలో బాగా విస్తరిస్తున్నందున నిపుణుల అవసరం పెరిగిందన్నారు.