News

Realestate News

కొండల్లో జలధారలు… కాపాడేవారేరి…?

కొండల్లో జలధారలు… కాపాడేవారేరి…?
కాలగర్భంలో కలుస్తున్న చారిత్రక ప్రాంతాలు
పరిరక్షణ చర్యలు లేక కనుమరుగు
న్యూస్‌టుడే, వికాస్‌నగర్‌(ఆటోనగర్‌)
పూర్వం కాలంలో సమృద్ధిగా నీటిని అందించిన జల వనరులను పూర్తి స్థాయిలో కాపాడుకోకపోడంతోనే నేడు నగర వాసులకు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. నాడు గాజువాకకు పేరు తెచ్చిన చారిత్రక జలవనరు నేడు నెమ్మదిగా కాల గర్భంలో కలిసిపోతోంది. నీటికి చిరునామాలా ఉండే ఆ ప్రాంతం… ప్రస్తుతం ముళ్లపొదలు, చెత్తాచెదారాలతో నిండిపోయి ఉంది. నీటి వనరుల ఆవశ్యకతను గుర్తించకపోవడం, వాటిన కాపాడే బాధ్యత ఎవరూ తీసుకోకకపోవడంతోనే అవి కనుమరుగైపోతున్నాయి.

గాజువాక బీసీరోడ్డులోని డిఫెన్సుకాలనీ వెనుక ప్రాంతంలో ఉన్న చిన్నపాటి రెండు జలాశయాలే నాడు గాజువాకకు ఆ పేరు తీసుకొచ్చాయని చాలా మందికి తెలియదు. శ్రీకృష్ణదేవరాయలు హయాంలోనే వాటిని నిర్మించినట్లు పూర్వీకులు చెబుతున్నారు. ఇక్కడకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల మధ్యన రెండు జలధారలు ఉండేవని, వాటి ద్వారా నిత్యం నీరు ప్రవహించేదని వివరిస్తున్నారు. చుట్టుపక్కల ఎక్కడ నీరున్నా… లేకపోయినా ఇక్కడ జలధారలు మాత్రం నిత్యం నీటి ప్రవాహంతో కళకళలాడేవి. సింహాచలం కొండమీద ఉన్న గంగధారకు ఇక్కడి జలధారలకు సంబంధం ఉందని పూర్వీకులు వాదన.

‘గజవాక’ నుంచి ‘గాజువాక’ వరకు…
శ్రీ కృష్ణదేవరాయల హాయంలోనే కొండల మధ్యన ఉన్న జలధారల నుంచి వచ్చే నీటిని ఒడిసి పట్టేందుకు సుమారు మూడు కిలోమీటర్ల పొడవున రాతి కాలువలను నిర్మించారు. ఆ కాలువల ద్వారా నీరు జలాశయాలకు చేరే ఏర్పాటు చేశారు. సింహాచలం వరాహనృసింహస్వామి ఆలయ నిర్మాణ సమయంలో రాయల వారి పరివారం కొంత ఇక్కడే బస చేసేది. సమృద్ధిగా నీటివసతి ఉండడంతో గజ బలగాన్ని ఇక్కడ ఉంచే వారని, వాటి కోసమే రాతి కట్టు కాలువలు, జలాశయాలు నిర్మించారని పూర్వీకులు చెబుతున్నారు. ఇక్కడి నిర్మాణాలకు, సింహాచలంలో నిర్మాణాలకు ఒకే రకమైన రాయిని వినియోగించడం, నిర్మాణాల్లోనూ పోలికలు ఉండడంతో… పూర్వీకుల వాదనకు బలం చేకూరుతుంది. రెండు కొండల మధ్య ఎనుగులు ఉండడం చూసిన ప్రజలు ఈ ప్రాంతాన్ని ‘గజవాక’గా పిలిచేవారని….. కాలానుక్రమంలో ఆ పేరు ‘గాజువాక’గా మారిందని చరిత్రకారులు చెబుతున్నారు.

‘జలకళ’ నేపథ్యం…
ఈ రెండు జలధారల్లో ఒకటి సుమారు ఐదారేళ్ల కిందటే ఆగిపోయిందని, రెండోది కూడా ఆగిపోడానికి సిద్ధంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడే గాజువాక ఇనాం హక్కుదారుడు భానోజీరావు అతిథిగృహం కూడా ఉంది. ఆ గృహం దగ్గర్లో ఉండే బావి 1994 వరకు గాజువాకలో సగం ప్రాంతానికి మంచినీటిని అందించేది. అప్పటి పురపాలక సంస్థ అధికారులు నీటిని ట్యాంకర్లలోకి ఎంత తోడినా… ఉదయానికి మళ్లీ బావి నీరుతో నిండుగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
* అలనాటి నీటి వనరులతోనే ఇక్కడ అన్ని కాలాల్లో నీరు సమృద్ధిగా లభిస్తుంటుంది. దీంతో వివిధ రకాల పక్షులు వలస వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నీటి వనరును పరిరక్షిస్తూ…ఇక్కడి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

అభివృద్ధి చేస్తేనే ఫలితం
ఇక్కడి నీటి వనరులను కాపాడాలని గత పురపాలిక సంఘానికి పలుమార్లు విన్నవించాం. నీటి నిల్వ కోసం ఇక్కడ చిన్నపాటి ఆనకట్ట నిర్మించాలని, భూగర్భ జలాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరాం. ఆ తర్వాత కాలంలో గాజువాక జనాభా పెరిగింది. ఇక్కడి నీరు సరిపోయే స్థాయి లేకపోయింది. అయితే సహజసిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే… ఎంతో ఫలితం ఉంటుంది.ప్రస్తుతం ఆ దిశగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.

– గొల్లపల్లి రాంబాబు, వ్యవస్థాపకులు, దుర్గామల్లేశ్వర ఛారిటబుల్‌ ట్రస్టు, దేవపర్వతం