News

Realestate News

కొంచెం మందగమనం… ఆపై పురోగమనం..

progression

స్థిరాస్తి రంగంపై పెద్దనోట్ల రద్దు ప్రభావం

ప్రస్తుతం క్రయవిక్రయాలు తగ్గే అవకాశం
క్రమేణా పుంజుకుంటుందన్న ఆశాభావం

నగరంలో స్థిరాస్తి వ్యాపార రంగంపై రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రభావం చూపే అవకాశాలున్నాయి. కొన్నాళ్లపాటు క్రయ విక్రయాలు మందగించవచ్చని సంబంధిత వర్గాలే చెబుతున్నాయి. కాలక్రమేణా పుంజుకుని బ్యాంకు రుణాలకు గిరాకీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. విశాఖతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత రెండున్నరేళ్లుగా స్థిరాస్తి వ్యాపారం శరవేగంతో ముందుకెళుతోంది. స్థానిక వ్యాపారులు, సంస్థలతోపాటు దేశంలో పేరెన్నికగన్న స్థిరాస్తి వ్యాపార సంస్థలూ తమ కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభిస్తున్నాయి. ఒక్క నగర పరిధిలోనే ఫ్లాట్లు, స్థలాలు కలుపుకొని ఏటా రూ. 2,500 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు ఒక అంచనా. రాబోయే రోజుల్లో ఈ వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు నిర్ణయం కలకలం సృష్టిస్తోంది.
స్థిరాస్తి వ్యాపారంలో నల్లధనం వినియోగం లేకపోలేదు. చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) ధర బహిరంగ మార్కెట్లో రూ. 5 వేలు ఉందనుకుంటే ప్రభుత్వ ధర రూ. 2,500 ఉంటుంది. దీంతో రూ. 2,500 ధరకే దస్తావేజులు రాయించుకొని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటారు. ఎస్‌ఎఫ్‌టీకి రూ. 2,500 చొప్పున మిగతా నగదును కొనుగోలుదారులు నేరుగా వ్యాపారులకు చెల్లిస్తుంటారు. దీనికి అధికారికంగా లెక్కాపత్రం ఉండదు. స్థలాల క్రయ విక్రయాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు చేయడంతోపాటు ఇళ్లల్లో దాచుకున్న మొత్తాన్ని వచ్చే నెలాఖరులోగా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అంటే రాబోయే రోజుల్లో ప్రతి రూపాయికీ లెక్క చూపించే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటిలా భారీ మొత్తాల్లో ఇళ్లు, స్థలాల కొనుగోళ్లు ఉండకపోవచ్చని సంబంధిత వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విక్రయాలు జరిగినా నల్లధన వినియోగం అంతంత మాత్రమే ఉంటుందన్నది అంచనా. ఫలితంతా రాబోయే రోజుల్లో స్థిరాస్తి వ్యాపారం కాస్త మందగించే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే రెండు, మూడు నెలలూ విక్రయాలు బాగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. కొంతమంది కొనుగోలుదారులు నల్లడబ్బును దొంగచాటుగా ఇస్తామన్నా వ్యాపారులు తీసుకునే పరిస్థితి లేదు.

బ్యాంకు రుణాలకు గిరాకీ….
ఇళ్లు, స్థలాల కొనుగోలుకు రాబోయే రోజుల్లో ప్రజలు బ్యాంకు రుణాలను విరివిగా తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రుణాలు తీసుకుంటున్న వారిలో ఎక్కువగా ఉద్యోగులే ఉంటున్నారు. భవిష్యత్తులో దాదాపు అన్ని వర్గాలవారు బ్యాంకు రుణాలపై మొగ్గు చూపే వీలుంది. దీనివల్ల స్థిరాస్తి వ్యాపార రంగంలో ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆపై పారదర్శకత, రుణగ్రహీతలకూ ఆదాయ పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలుంటాయి. ప్రస్తుతం నగర పరిధిలో వివిధ జాతీయ బ్యాంకులు ఇళ్ల రుణాల కోసం ఏటా రూ. 2,500 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల వరకు అందిస్తున్నట్లు అంచనా. రాబోయే రోజుల్లో రూ. 5 వేల కోట్లకు రుణాలు పెరుగుతాయని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రభావం తక్కువ ఉండొచ్చు…
స్థిరాస్తి వ్యాపార రంగంపై రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు వూహించినంత ప్రభావం ఉండకపోవచ్చు. ఈ ప్రాంతంలో మధ్య తరగతి కుటుంబాలే ఎక్కువగా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తున్నాయి. ధరలు కూడా చదరపు గజం రూ. 4 వేల నుంచి రూ. 5 వేలలోపే ఉంటోంది. ప్రభుత్వ ధరకు దగ్గరగా ఉంటున్నందున అనధికారికంగా నగదు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? మార్కెట్‌ ధరకు అటు, ఇటుగానే స్థలాలు కొనుగోలు చేసి ఆ మేరకే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. వ్యాపారులు కూడా భారీగా ధరలు నిర్ణయించి విక్రయించే పరిస్థితి లేదు. ఎంతో కొంత లాభం వస్తే చాలనుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో స్థలాల ధరలు భారీగా ఉన్నచోట్ల నోట్ల రద్దు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఒకటి, రెండు నెలలు అమ్మకాలు తగ్గినా మళ్లీ క్రమంగా పెరిగే వీలుంది.

– తాళ్లూరి శివాజీ, విశాఖ అపార్ట్‌మెంట్‌ బిల్డర్ల అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు.
స్థిరాస్తిపై ప్రభావం తాత్కాలికమే…
రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు వ్యాపార రంగాన్ని కుదిపే అంశమైనా ఈ ప్రభావం తాత్కాలికమే. వ్యాపారం మళ్లీ పుంజుకోవటం ఖాయం. స్థిరాస్తి వ్యాపారంలో నల్లధన ప్రవాహం ఎక్కువగా ఉంటుందనేది అపోహ మాత్రమే. గతంలో ఈ పరిస్థితి ఉన్నా, గత కొన్నేళ్లుగా కొనుగోలుదారులు, వ్యాపారుల ఆలోచనల్లోనూ మార్పులొచ్చాయి. వ్యాపారికి చెల్లించిన ధరకే రిజిస్ట్రేషన్‌ చేయించుకోడానికి కొనుగోలుదారులు ప్రాధాన్యమిస్తున్నారు. అవసరమైతే ప్రభుత్వానికి అదనపు స్టాంపు డ్యూటీ చెల్లించేందుకు వారు వెనుకాడటం లేదు. నోట్ల రద్దుతో ప్రజల్లో గందరగోళం, అనిశ్చితి కారణంగా కొంతకాలం స్థిరాస్తి వ్యాపార రంగంలో స్తబ్ధత ఉంటుంది. క్రమంగా మళ్లీ పూర్వ పరిస్థితి రావొచ్చు.
-కె.రామకృష్ణారావు, ఛైర్మన్‌, క్రెడయ్‌ విశాఖ చాప్టర్‌