కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!
విశాఖ కేంద్రంగా సాకారమైన జోన్ కల
ఉద్యోగ నియామకాలూ ఇక్కడే..
వాల్తేరు డివిజన్ రద్దుతో ఆవేదన
ఈనాడువిశాఖపట్నం
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!
మూడు దశాబ్దాలకు పైగా వేచి చూసిన రోజు..
బుధవారంతో సాకారమైంది. రైల్వే ఉద్యోగాల కోసం మన బిడ్డలు హౌరాకో, భువనేశ్వర్కో వెళ్లి అవమానాలకు గురైన దాఖలాలున్నాయి.
ఇవన్నీ భరిస్తూ.. ఒడిశా కేంద్రంగా ఇన్నాళ్లూ జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని సహిస్తూ..
ఓపిగ్గా పోరాటం చేసిన ఎందరో యోధులకు సంతృప్తికర వార్త అందింది.
విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్ రైల్వేజోన్‌ని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా,
నగర వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.
ప్రధానంగా ఆర్ఆర్బీ నియామకాలు విశాఖ కేంద్రంగానే జరిగేలా నిర్ణయం తీసుకోవడం..
చాలా మంచి వార్తగా నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యేకించి ఉత్తరాంధ్ర వాసులు రైల్వే ఉద్యోగాలు పొందేందుకు ఇదెంతో దోహదపడుతుందని అన్నారు.
మరోవైపు ప్రస్తుతమున్న వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేసే విధంగా ప్రకటన ఉండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
సరకు రవాణా ఆదాయమే ప్రధాన లక్ష్యంగా ఈ విభజన జరుగుతుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
వాల్తేరు డివిజన్లో ఆదాయాన్నిచ్చే ప్రాంతాల్ని ఒడిశాకు తీసుకెళ్లి..
కేవలం ప్రయాణికులకు సంబంధించిన ప్రాంతాన్ని విజయవాడ డివిజన్లో కలిపేస్తూ నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం కదులుతోందని
నిరసన వ్యక్తం చేస్తున్నారు.