News

Realestate News

కేంద్రాసుపత్రిలో పలు కీలక పోస్టులు ఖాళీ, వైద్యులకే అదనపు బాధ్యతలు

పేరుకే పెద్దాసుపత్రి..
కేంద్రాసుపత్రిలో పలు కీలక పోస్టులు ఖాళీ
వైద్యులకే అదనపు బాధ్యతలు
ఇబ్బందులు పడుతున్న రోగులు
కేంద్రాసుపత్రి.. జిల్లా వ్యాప్తంగా పేదలకు ఓ పెద్దాసుపత్రి ఉందనే భరోసా ఇస్తోంది. అందుకే ఇక్కడ రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతోంది. నిత్యం వందలాది మంది రోగులు వస్తుంటారు. ఇంతటి ప్రధానమైన వైద్యశాలలో పర్యవేక్షణ కరవైందనే విమర్శలు ఉన్నాయి. పలు కీలకమైన విభాగాల్లో అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడమే ఇందుకు కారణం. ఉన్నతాధికారులు దీనిపై దృష్టిపెట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉంది.

– న్యూస్‌టుడే, విజయనగరం రింగురోడ్డు

వచ్చే రోగుల సంఖ్య: సుమారు 700 నుంచి 800 మంది ఆసుపత్రిలో ప్రధానమైంది పర్యవేక్షణే. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అటు ఘోషాసుపత్రి ఇటు కేంద్ర ఆసుపత్రి చూస్తున్నారు. కేంద్ర ఆసుపత్రిలో వార్డుల వారీగా చూడాల్సిన బాధ్యతలు ఆర్‌ఎంవోకు ఉంటాయి. ఈ పోస్టు సుమారు రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఉన్న డీసీహెచ్‌ ఆర్‌ఎంవోగా బాధ్యతలు గతంలో నిర్వర్తించే వారు. ఆమె డీసీహెచ్‌గా వెళ్లిపోయారు. అప్పటి నుంచి ముఖ్యమైన విభాగాల్లో ఉన్న వారిని తీసుకొచ్చి ఆర్‌ఎంవోలుగా కూర్చొబెట్టడంతో వైద్యం కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రధాన వైద్యులకు బాధ్యతలా..?
అప్పుడప్పుడు వైద్యులు గౌరీశంకర్‌, సత్యశ్రీనివాస్‌ ఆర్‌ఎంవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ కూడా ముఖ్యమైన విభాగాలకు చెందిన వాళ్లే. ఒకరు చిన్న పిల్లల నిపుణులు కాగా, మరొకరు రక్తనిధి విభాగంలో పని చేస్తున్నారు. తాజాగా ఇన్‌ఛార్జి ఆర్‌ఎంవో బాధ్యతలు కంటి విభాగానికి చెందిన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ రత్నకుమారికి అప్పగించారు. ఇలా ముఖ్యమైన విభాగాల వారికి బాధ్యతలు అప్పగించడంతో అన్ని వార్డులకు వెళ్లి సిబ్బందిని, నిర్వహణ తదితర అంశాలు చూసి ఆ తరువాత ఓపీలోకి వచ్చి కూర్చొనేసరికి పుణ్యకాలం గడిచిపోతోంది. మధ్యాహ్నం 12 గంటల దాటిన తర్వాత ఓపీ కేసులను చూసే పరిస్థితి చాలా విభాగాల్లో లేకపోవడం, ఆసుపత్రిలో సేవలందించాల్సిన సమయంలో సమావేశం ఉందని, పై అధికారులు రమ్మంటున్నారని వెళ్లిపోతుండడంతో వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కంటి విభాగానికి రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. వైద్యులు కేఎన్‌ మూర్తి, త్రినాథ్‌, రత్నకుమారి ఈ విభాగాల్లో సేవలందిస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరూ లేకపోయినా, శస్త్రచికిత్స నిమిత్తం ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లినా ఆ రోజు రోగులకు నరకమే.

రోగుల ఇబ్బందులు ఇలా..
గజపతినగరానికి చెందిన పైడమ్మ వైద్యం కోసం ఓపీ రాయించుకొని వైద్యుడి వద్దకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వెళ్లింది. అంతకుముందు ఆమె కనీసం గంటకు పైగా వరుసలో నిలబడితే గాని ఓపీ రసీదు రాలేదు. అది పట్టుకొని వెళ్లేసరికి ఈ రోజు సమయం అయిపోయింది రేపురా అంటూ పంపించేశారు. చాలా దూరం నుంచి వచ్చానని బతిమిలాడినప్పటికీ కనికరించలేదు. మళ్లీ ఆమె మరుసటి రోజు వచ్చింది. చాలా సేపు కూర్చుంటేగాని లోపలికి వెళ్లలేని పరిస్థితి. ఏదో విధంగా వైద్యుడు దగ్గరికి వెళ్లేసరికి నిన్న ఓపీ రసీదు తీసుకు వస్తే ఎలా..? ఈ రోజుది పట్టుకొని రా..అంటూ ఆమెను బయటకు పంపించేశారు. పాపం ఆమె గంటకుపైగా మళ్లీ వరుసలో నిలబడితేగాని ఓపీ చీటీ రాలేదు. ఇలా గంటల కొద్ది ఓపీలో నిలబడి ఆ తర్వాత వైద్యుడు దగ్గరికి వెళ్లేసరికి.. మూసేసే సమయానికి వస్తే ఎలా అంటూ కొంతమంది దిగువ స్థాయి సిబ్బంది నుంచి వైద్యుల వరకు రుసరుసలాడడంతో నిరాశతో వెనుతిరిగింది.

ఆదేశాలు రాగానే భర్తీ చేస్తాం
కేంద్ర ఆసుపత్రి, ఘోషాసుపత్రుల్లో ఆర్‌ఎంవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటి భర్తీ విషయమై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి. ప్రస్తుతానికి నాయకత్వ లక్షణాలు ఉన్న వారితో నెట్టుకొస్తున్నాం. వారికి సూపరింటెండెంట్‌గా నేను, డీసీహెచ్‌ డాక్టర్‌ ఉషశ్రీ అవసరమైన సహకారాన్ని అందిస్తున్నాం. ముఖ్యమైన విభాగాల్లో వారిని తీసుకొచ్చి ఈ పోస్టుల్లో ఉంచడం వలన ఆయా విభాగాల్లో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయం మా దృష్టికి కూడా వచ్చింది. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo