News

Realestate News

కిస్‌ విద్యా సంస్థ ఏర్పాటుకు స్థల పరిశీలన

కిస్‌ విద్యా సంస్థ ఏర్పాటుకు స్థల పరిశీలన
సీతంపేట, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని కిస్‌ సంస్థ నిర్వహిస్తున్న విద్యా సంస్థ మాదిరిగా సీతంపేట ఐటీడీఏ పరిధిలోనూ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు గిరిజన సంక్షేమశాఖ అధికారులతో పాటు ఆసంస్థ ప్రతినిధులు మంగళవారం పర్యటించారు. అక్కడ 25 వేల మంది విద్యార్థులతో విద్యాలయం నిర్వహిస్తున్నారు. అదే మాదిరి విద్యా సంస్థ కనీసం 3 నుంచి 5 వేల మందికి ఉపయోగపడేలా విద్యా సంస్థ నెలకొల్పడానికి కిస్‌ సంస్థ నిర్ణయించింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విస్తరించడానికి చర్యలు చేపట్టారు, దీనికి సంబంధించి ఐటీడీఏ పీవో ఎల్‌.శివశంకర్‌ చొరవతో గి.స.శాఖ కమిషనర్‌ పద్మ ఆదేశాల మేరకు సీతంపేట మండలం పణుకువలసలోని 15 ఎకరాలు, మెళియాపుట్టి మండలం పెద్దమడిలో 35 ఎకరాలు, ఆమదావలస మండలం గాజులకొల్లివలసలో 15 ఎకరాల స్థలాన్ని మంగళవారం అధికారుల బృందం, కిస్‌ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు.

సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ పబ్లిక్‌ సిస్టం(సిట్స్‌) సలహాదారు చిన్నవీరభద్రుడు, ట్రైకార్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ మురళి, కమిషనర్‌ కార్యాలయం నుంచి ఉప సంచాలకులు మల్లిఖార్జునరెడ్డి, కిస్‌ సంస్థ సీఈవో మహంతి ఆధ్వర్యంలోని సభ్యుల బృందం స్థల పరిశీలన జరిపారు. ఇది ఆమోదం పొంది ప్రారంభానికి చర్యలు చేపడితే భవనాలు పూర్తయ్యేవరకు సీతంపేటలోని వైటీసీ కాని, పీఎమ్మార్సీలో కాని ఆగస్టులో తరగతులు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం ఐటీడీఏ పీవో శివశంకర్‌తో వీరు సమావేశమయ్యారు. వీరితో పాటు సీతంపేట గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎం.రోజారాణి, డిప్యూటీ డీఈవో గున్ను రామ్మోహనరావు, సీఎంవో డి.శ్రీనివాసరావు, ఏటీడబ్ల్యూవోలు మల్లిఖార్జునరావు, బల్ల అప్పారావు, వెంకటరమణ, డీపీవో వై.సతీష్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.