Posted on October 10, 2016 by vijay kumar in Realestate News
కిక్కిరిసిన పర్యటక కేంద్రాలు బొర్రాగుహల ఒక్కరోజు ఆదాయం రూ. 4.5 లక్షలు
అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే : దసరా సెలవులు ఉండడంతో పర్యటక ప్రాంతాలు జనంతో కళకళలాడుతున్నాయి. ప్రకృతి అందాలకు నిలయమైన బొర్రాగుహలను తిలకించడానికి ఆదివారం పర్యటకులు బారులుతీరారు. ఉదయం నుంచి గుహల్లో ప్రకృతి సోయగాలను తిలకించడానికి తరలివచ్చారు. ఆదివారమే సుమారుగా ఆరువేలమంది పర్యటకులు గుహల అందాలను తిలకించారు. ఒక్కరోజు గుహలు ఆదాయం సుమారు రూ.4.5 లక్షల వరకు వచ్చింది. బొర్రాగుహలు తిలకించేందుకు వచ్చిన పర్యటకుల వాహనాలు కిలోమీటరు దూరం వరకు బారులుతీరాయి. బెంగాలీ, ఒడిశా తదితర ప్రాంతాలనుంచి పర్యటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కటికిజలపాతం, తాడిగుడ జలపాతం, కాఫీప్లాంటేషన్, వ్యూపాయింట్ వద్ద పర్యటకుల రద్దీ కనిపించింది. వర్షాలు కురుస్తుండడంతో ఘాట్‌రోడ్డులో ఎక్కడ చూసినా మంచు రహదారులపైకి వచ్చి కశ్మీర్‌ను తలపించింది.