News

Realestate News

కాఫీ రైతులకు ప్రత్యేక రుణాలు

Development works groundbreakings

జీసీసీ నిర్ణయంతో 4,310 మందికి లబ్ధి

పాడేరు, న్యూస్‌టుడే : గిరిజన సహకార సంస్థ(జీసీసీ) సంస్థలో నమోదైన కాఫీ రైతులకు ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ రవిప్రకాశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2014-15లో జీసీసీ ద్వారా సుమారు 4,310 మంది కాఫీ రైతులు జీసీసీ కాఫీ సేకరణలో తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకున్నారు. వీరి నుంచి గత ఏడాది రెండు రకాల కాఫీ గింజలను సేకరించింది. ఇందులో పార్చెమెంట్‌ రకం 1661 క్వింటాళ్లు, చెర్రి రకం 1237 క్వింటాళ్లు సేకరించి ‘ఈ-వేలం’ ద్వారా మార్కెటింగ్‌ సదుపాయాన్ని కల్పించింది. సేకరించిన కాఫీలకు ముందస్తు అపెక్సు కమిటీ ద్వారా ధర నిర్ణయించి 50 శాతం సేకరణ జరిగే సమయంలో వారి వ్యక్తిగత ఖాతాల్లో జమచేశారు. ఈ మొత్తం రూ.7.18 కోట్ల వరకు ఉంది. ఇటీవల దేశీయ మార్కెటింగ్‌లో ‘ఈ-వేలం ద్వారా మార్కెటింగ్‌ చేసిన మొత్తం రెండో దశగా మరో రూ.4.5 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ చేసింది. జీసీసీపై నమ్మకంతో కాఫీ గింజలను ఇచ్చినందుకు సంస్థ ద్వారా అదనంగా రూ.10 వేల వరకు రుణాన్ని మంజూరు చేయనుంది. కాఫీ గింజలకు అపెక్సు కమిటీ నిర్ణయించిన ధరకు తగ్గట్టుగా మార్కెటింగ్‌ అనుకూలించకపోవడంతో రైతుకు ముందుగా నిర్ణయించిన ధరను జీసీసీ చెల్లించలేకపోయింది. ఏజెన్సీలో చాలాచోట్ల రైతులు నిరాశతో పలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇదే సమయంలో కాఫీ రైతుల్లో వేడిని చల్లార్చేందుకు జీసీసీ ప్రతి కాఫీ రైతుకు రూ.10 వేల మేర రుణం రూపంలో ఇచ్చేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇస్తున్న ఈ రుణాన్ని వచ్చే ఏడాది కాఫీ రైతుల నుంచి సేకరించిన కాఫీ గింజల ద్వారా రికవరీ చేయనుంది. ఏదీ ఏమైనా జీసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో మన్యం కాఫీ రైతులకు కొంత వూరట లభించినట్లయింది.