News

Realestate News

కాఫీ కథలో మేలిమలుపు

కాఫీ కథలో మేలిమలుపు
మహిళా కార్మికులకు కలిసివచ్చిన ఉపాధి
జీసీసీ గింజల శుద్ధి పనులతో అధిక ఆదాయం
ఈనాడు, విశాఖపట్నం

మన్యంలోని కాఫీ గింజలు నర్సీపట్నంలోని కొందరి మహిళా కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఏళ్ల తరబడి ఈ గింజల్లో నల్లటి పప్పును ఏరివేసే శుద్ధీకరణ పనుల ద్వారా వీరికి ఉపాధి లభిస్తోంది. మావోయిస్టుల ప్రభావంతో ఈ కాఫీ దిగుబడి ఏటా తగ్గిపోతోంది. దీంతో దినసరి కూలీలైన ఇక్కడి మహిళా కార్మికులకు కాఫీ గింజలు ఎక్కువగా లేకపోవడంతో పనిదినాలు తగ్గిపోయి వీరి ఆదాయం పడిపోతోంది. ఈ పరిస్థితిలో గిరిజన సహాకార సంస్థ (జీసీసీ) కాఫీ గింజలు సేకరణ ప్రారంభించడంతో వీరికి మహర్దశ పట్టినట్లయింది. జీసీసీ కాఫీని కూడా నర్సీపట్నంలోనే శుద్ధి చేయడానికి ఒప్పందం కుదరడంతో ఇప్పుడు వీరికి చేతి నిండా పనితో పాటు అధిక రాబడికి మార్గం సుగమం అయింది.

ఆంధ్ర ప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో విశాఖ మన్యంలో వేలాది ఎకరాల్లో పండించే కాఫీని నర్సీపట్నంలోనే శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. 1976వ, సంవత్సరం నుంచి ఇక్కడ ఈ శుద్ధీకరణ పనులు చేపడుతున్నారు. ఈ కాఫీ గింజల్లో నల్లటి పప్పును ఏరివేసే పనుల్లో కేంద్రం సమీపంలో నివసిస్తున్న మహిళలకే ఉపాధి కల్పిస్తున్నారు. సీజనల్‌ కార్మికులైన వీరు దినసరి వేతనంపై ఇక్కడ పనులు చేపడుతుంటారు. వీటి ద్వారా వందకు పైగా కుటుంబాలకు చెందిన వారికి ఏటా వారి కుటుంబ పోషణకు అవసరమైన ఆదాయం సమకూరుతోంది. సీఐటీయూ ఆధ్వర్యంలోని వీరికి కార్మిక చట్టం నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలన్నీ ..

పక్కాగా అమలవుతున్నాయి. గత కొన్నేళ్లుగా మన్యంలో కాఫీ ఉత్పత్తి తగ్గిపోతున్న మేరకు కేంద్రంలోని కార్మికులకు పనిదినాలు తగ్గిపోయి వారి ఆదాయానికి గండి పడుతోంది. ఈ దశలో జీసీసీ కాఫీని కూడా నర్సీపట్నంలోనే శుద్ధి చేస్తున్న మేరకు ఇప్పుడు వీరికి కరవు తీరా ఉపాధితో పాటు మంచి ఆదాయానికి అవకాశం ఏర్పడింది.

రూ.6 స్థాయి నుంచి రూ. 200కు పెరిగిన దినసరి కూలీ
ఇక్కడి కేంద్రంలో మహిళలకు తొలిరోజుల్లో అంటే 46 ఏళ్ల క్రితం రూ. 6 చోప్పున ఒక్కొక్కొరికి దినసరి కూలీ చెల్లించేవారు. ఇప్పుడు ఇది రూ. 200కి పెరిగింది. ప్రస్తుతం ఇందులో 120 మంది పనిచేస్తున్నారు. గతంలో వీరు రేకుల షెడ్లు కింద ఉండేవారు. ఇప్పుడు వీరికి భారీ గోదాంలు సమకూరాయి. గతంలో కాఫీ ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్న మేరకు ఒక్కో ఏడాది సీజన్లో అయిదు నెలలు పాటు వీరిలో ఒక్కొక్కొరికి 150 చొప్పున పనిదినాలు లభించడం విశేషంగా పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఏపీఎఫ్‌డీసీ కాఫీ దిగుబడి 300 టన్నులకు మించకపోవడంతో సీజన్‌ కాలం మూడు నెలలకు పడిపోయింది. దీంతో వీరి పని దినాలు 90కే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇవి బాగా తగ్గిపోతున్న మేరకు ఆందోళనలో ఉన్న వీరికి జీసీసీతో ఏపీఎఫ్‌డీసీకి కుదిరిన ఒప్పందంతో ఇప్పుడు కొత్త ఆశలు చిగురుస్తున్నాయి.

సీజన్‌ 8 నెలలకు పెరిగే అవకాశం
జీసీసీ ఏజెన్సీలో కాఫీ సేకరణ ప్రారంభించి ఇప్పటికే నర్సీపట్నం కేంద్రానికి శుద్ధీకరణ నిమిత్తం వెయ్యి టన్నుల వరకూ గింజలను పంపించింది. ఈ సంస్థ మరో వెయ్యి టన్నులు కూడా సేకరించి ఇక్కడికి తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో మొత్తం 2వేల టన్నుల కాఫీ శుద్ధి పనులతో ఇప్పుడు వీరికి సీజన్‌ కాలం ఏకంగా 8 నెలలకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అంటే అదనంగా మరో అయిదు నెలలు ఇది అధికం కానున్నది. దీని ద్వారామొత్తం ఎనిమిది నెలలకు ప్రస్తుతం ఇందులో పనిచేస్తున్న 120 మందికి 240 చొప్పున పనిదినాలు లభించనున్నాయి. దీని ద్వారా రోజుకు రూ.200 చొప్పున మొత్తం రూ.48వేల వరకూ ఒక్కొక్కొరికి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కేంద్రంలో కాఫీ గింజల బస్తాల లోడ్లు ఎత్తడం, దించడం వంటి పనులు చేపట్టే 12 మంది కళాసీలకు కూడా ఆదాయం ఆరు రెట్లు వరకూ పెరుగుతుందంటున్నారు.

కష్టాలు తీరాయి
గతంలో కేంద్రంలో సీజనల్‌ పనులు వల్ల మంచి రాబడి ఉండేది. రానురాను కాఫీ దిగుబడి తగ్గిపోవడంతో మాకు ఈ పనులు ఎంతమాత్రం గిట్టుబాటు కావడం లేదు. జీసీసీ కాఫీ గింజల శుభ్రం చేసే పనులతో ఇప్పుడు మా కష్టాలు తీరినట్లయింది. వీటితో అన్నివిధాలా లాభం చేకూరుతుంది. ఇటీవల మరమ్మతులకు గురైన కేంద్రంలోని బ్లాక్‌ యంత్రాన్ని బాగుచేస్తే కార్మికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

– వేచలపు సత్యవతి, కాఫీ మహిళా కార్మికుల సంఘం అధ్యక్షురాలు, నర్సీపట్నం

కార్మికులకు నిజంగానే మంచి రోజులు
ప్రభుత్వ రంగ సంస్థ అయిన జీసీసీ కాఫీ గింజలను నర్సీపట్నం కేంద్రంలో శుద్ధి చేసేందుకు ముందుకు రావడం ద్వారా ఇక్కడి కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. వీరికి నిజంగానే మంచి రోజులు వచ్చాయి. గత కొన్నేళ్లుగా వీరికి ఇక్కడ కాఫీ దిగుబడి బాగా తగ్గిపోతుడండంతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వీరి కష్టాలు గట్టెక్కినట్లయింది. మంచి ఆదాయం వస్తుంది. ఏపీఎఫ్‌డీసీ కూడా వీరికి కార్మిక సంక్షేమ పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తోంది.

– డి. సత్తిబాబు, సీఐటీయూ డివిజన్‌ నాయకుడు, నర్సీపట్నం

కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు
నర్సీపట్నం కేంద్రంలోనే జీసీసీ కాఫీని కూడా శుద్ధి చేసే పనులు చేపడుతున్నందున కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీరికి సీజన్‌తో పాటు పనిదినాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రాబడి అధికమవుతుంది. భవిష్యనిధి కూడా పెరుగుతుంది. జీసీసీ కాఫీని శుద్ధి చేసి విక్రయించడం వల్ల దానికి మార్కెట్టులో మంచి ధర పలుకుతుంది. దీని వల్ల మన్యంలోని రైతులకు ఆదాయం మెరుగవుతుంది. కేంద్రంలోని గోదాంల్లో జీసీసీ కాఫీని భద్రపర్చుకుంటున్న మేరకు అద్దెతో పాటు దీనిని శుద్ధి చేసేందుకు టన్నుకు నిర్ణీత ఛార్జి చొప్పున కూడా ఏపీఎఫ్‌డీసీకి ఆదాయం లభిస్తుంది.

– ధన్‌రాజ్‌, ఏపీఎఫ్‌డీసీ డివిజన్‌ మేనేజర్‌, నర్సీపట్నం

 

Source By: http://www.eenadu.net/

 

 

Free!

Services

Promotion

SMM

Posting

 

           Be the first to know about Free Service Offers

VRE Logo