కల్యాణ వైభోగమే..!
కన్నులపండువగా వెంకన్న కల్యాణం

ఇందులో పాల్గొన్న వేలాది మంది భక్తులు గోవిందా అంటూ రథాన్ని లాగారు. ఇది పూర్తయిన తర్వాత తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో వార్షిక కల్యాణం ప్రారంభించారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఉపమాక ఆలయ ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు, ఇతర వేద పండితులు కలిసి కార్యక్రమాన్ని నడిపించారు. శాస్త్రోక్తంగా పండితులు చదివిన వేదమంత్రాలు భక్తుల మదిని పులకింపజేశాయి. శ్రీనివాసాచార్యులు భక్తులను భాగస్వామ్యులు చేస్తూ, వారిచేత మంత్రాలు పలికిస్తూ ఆద్యంతం తన్మయత్వానికి గురిచేశారు. తుది కార్యక్రమంలో భాగంగా అమ్మవారి మెడలో స్వామి తాళికట్టడం, తలంబ్రాలు పోసే కార్యక్రమాన్ని నయనానందకరంగా చేపట్టారు. తితితే ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వహణాధికారి మునిరత్నంరెడ్డి అన్నమాచార్య కీర్తన కొంతవరకు ఆలపించి తనలోని ప్రతిభ చాటారు. వేడుక తర్వాత భక్తులకు తలంబ్రాలు అందించారు. ఇందులో విజిలెన్స్ భద్రత ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఆలయ అధికారులు చంద్రశేఖర్, బాలసుందరశర్మ ఇతర అధికారులు పాల్గొన్నారు.