కరోనా ఎప్పటికీ తగ్గదేమో..!
కరోనా ఎప్పటికీ తగ్గదేమో..!

సడలింపుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
జెనీవా: కరోనా వైరస్‌ను ప్రపంచం నుంచి మటుమాయం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చాలా దేశాలు లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్‌తో జీవించటం అలవాటు చేసుకోవాలని అంతర్జాతీయ సంస్థ సూచించింది. అంతేకాకుండా కొవిడ్-19ను సమూలంగా తుడిచిపెట్టడం ఇప్పట్లో సాధ్యం కాని పని అని సంస్థ వ్యాఖ్యానించింది.
తొలుత వుహాన్‌లో తలెత్తిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాల్లో నలభై లక్షల మందికి పైగా వ్యాప్తించి, సుమారు మూడు లక్షల ప్రాణాలను బలిగొంది. కాగా ఓ కొత్త వైరస్ వ్యాప్తి చెందటం ఇదే తొలిసారి అని… మనిషి దానిపై ఎప్పుడు విజయం సాధించగలడనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వ్యవహారాల డైరక్టర్ మైఖేల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.
200 పైగా దేశాల్లో వ్యాపించిన కొవిడ్-19 స్థానిక వైరస్‌గా మారగలదని… ఇది శాశ్వతంగా కనుమరుగవటం అనేది జరగదని ఆయన అన్నారు. మరో ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌ను ఉదహరిస్తూ, హెచ్ఐవీని నిర్మూలించలేకపోయినప్పటికీ దానిని ఎలా కట్టడిచేయాలో తెలుసుకున్నాం. అదేవిధంగా కరోనా ఉనికిని కూడా భావించాలని ఆయన అన్నారు.
అంతేకాకుండా ప్రపంచ జనాభాలో సగానికి పైగా లాక్డౌన్లో ఉన్నారని… ప్రస్తుత సడలింపుల నేపథ్యంలో కొవిడ్ రెండోసారి వ్యాప్తి చెందవచ్చని ఆయన హెచ్చరించారు.
ప్రపంచ దేశాలు కరోనా ఆంక్షలను సరళీకృతం చేస్తున్నప్పటికీ… అప్రమత్తంగా ఉండటం అత్యావశ్యకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అథనోమ్ సూచించారు.
మళ్లీ సాధారణ స్థితికి వచ్చేందుకు మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. లాకడౌన్‌తో కరోనాను పూర్తిగా కట్టడి చేసేయవచ్చని లేదా దానిని ఎత్తివేయడమే ఉత్తమం అనే రెండు రకాల ఆలోచనా విధానాలు సరికాదని ఆయన ఆన్నారు.
వ్యాక్సిన్‌ను కనుగొనగలిగితే కొవిడ్ కట్టడిలో అది అతిపెద్ద ముందడుగు అవుతుందని.. దానిని అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయటమే మానవాళి ముందున్న పెద్ద కర్తవ్యం అని వివరించారు.