News

Realestate News

కన్నీటి వరదలా.. తడి ఆరని జ్ఞాపకంలా…


కన్నీటి వరదలా.. తడి ఆరని జ్ఞాపకంలా…

నగరంలో వాడవాడలా కొవ్వొత్తుల ర్యాలీలు
కశ్మీర్‌ దాడితో నగరవాసుల్లో ఉద్వేగం
అమరజవాన్లకు ఘన నివాళులు
ఈనాడు, విశాఖపట్నం

మాతృభూమి సేవలో మీ త్యాగం అజరామరం…
ఉగ్రభూతంతో మీ పోరు అనన్య సామాన్యం…
జాతి మదిలో స్ఫూర్తి మంత్రాల వెలుగు మీరు..
శత్రు గుండెలు చీల్చే పదునైన బాకులు మీరు…
నేరుగా ఎదుర్కోలేక మీపై విషపు వల పన్నారు…
ఆ దుర్మార్గాన్ని ఛేదిద్దాం… అమర జవాన్లకు నివాళు లర్పిద్దాం…
… అంటూ నగరవాసులు ర్యాలీలు నిర్వహించారు.

జమ్ము-కశ్మీర్‌లో గురువారం ఉగ్రదాడిలో మరణించిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కన్నీటితో అంజలి ఘటించారు.

ఆర్‌కే బీచ్‌లోనూ, జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద, నగరంలోని పలు వీధుల్లో సైతం ర్యాలీలు నిర్వహించారు.

జమ్ము-కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ వాహనాన్ని పేల్చేసిన ఘటనలో 40మందికి పైగా మృత్యువాత పడిన ఘటన

తెలుసుకుని నగరవాసులు తీవ్ర విషాదంలో మునిగారు. నగరంలోని పలు కేంద్ర భద్రతా బలగాలు కొలువుదీరాయి.

రక్షణశాఖకు చెందిన నౌకాదళంలోనే ఏకంగా 5వేల మందికి పైగా విధులు నిర్వర్తిస్తుండగా సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌,

ఎన్డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ, కోస్ట్‌గార్డ్‌ తదితర బలగాలన్నీ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్నాయి.

లాతూమోడే ఘటన తెలుసుకుని ఆయా కేంద్ర భద్రతా విభాగాలకు చెందిన అధికారులు,

ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కేంద్రబలగాల సిబ్బంది విధి నిర్వహణలో భాగంగా కొంతకాలంపాటు జమ్ముకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తుంటారు.

దీంతోపాటు కేంద్రబలగాలు కొన్నికొన్ని ఆపరేషన్లను ఇతర విభాగాల సాయంతో సంయుక్తంగా కూడా

నిర్వహిస్తుంటుంది. విభాగాలు వేరైనా వాటిలోని అధికారులు, ఉద్యోగుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది.

ఈ నేపథ్యంలో గురువారం నాటి సంఘటనలో తమకు తెలిసిన వారెవరైనా చనిపోయారేమోనని తీవ్ర ఆందోళనకు

గురయ్యారు.

శుక్రవారం మధ్యాహ్నానికి మృతిచెందిన వారి వివరాలు పేర్లతో సహా అధికారికంగా వెల్లడయ్యాయి.

దీంతో మృతిచెందినదెవరన్న అంశంపై స్పష్టత వచ్చినట్లైంది.

జమ్మూ కశ్మీర్‌ సంఘటనలో మృతిచెందిన వారిలోగానీ,

గాయపడ్డవారిలో గానీ నగరవాసులెవరూ లేకపోవడంతో ఒకింత ఊరట కలిగించే అంశం.

డాక్‌యార్డు నివాళి
భారత్‌లో అంతర్భాగమైన కశ్మీరులోని పుల్వామా జిల్లాలో జవాన్లపై ఉగ్రవాదుల విరుచుకుపడటాన్ని నిరసిస్తూ

శుక్రవారం నేవల్‌ డాక్‌యార్డు గేటు వద్ద సిబ్బంది నివాళులు అర్పించారు.

యూనియన్‌ నాయకులు నాగేశ్వరరావు అధ్యక్షతన కొవ్వొత్తులను వెలిగించి అంజలి ఘటించారు.

దేశ ప్రజలంతా సైన్యానికి బాసటగా నిలవాలని కోరారు.

– న్యూస్‌టుడే, సింధియా

 

 

అమర జవాన్లకు నివాళి
కొమ్మాది, న్యూస్‌టుడే: శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిపై జరిగిన ఉగ్ర ఘాతుకంలో ప్రాణాలు కోల్పోయిన

సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు శుక్రవారం బక్కన్నపాలెం 16 బెటాలియన్‌లో 234 సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్‌ కమాండెంట్‌

ఆర్‌.ఎస్‌.బాలపూర్‌కర్‌ నేతృత్వంలో అధికారులంతా నివాళులు అర్పించారు.

అమరుల కుటుంబాలకు దేశప్రజలంతా అండగా ఉండాలని కోరారు.

కార్యక్రమంలో అదనపు కమాండెంట్‌ నరేష్‌కుమార్‌యాదవ్‌,

ఆపరేషన్‌ కమాండెంట్‌ ఖాసంఖాన్‌, డిప్యూటీ కమాండెంట్స్‌ ఆర్‌.పి.శర్మ, శివరామ్‌మీనా,

సహాయ కమాండెంట్‌ డాక్టర్‌ సింధు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక అధికారాల చట్టం ఉండడం వల్లనే..
విపత్కర పరిస్థితులు తలెత్తితే కాల్పులు జరపడానికి అవకాశం కల్పించే రక్షణదళాల ప్రత్యేక అధికారాల చట్టం

ఉండబట్టే బలగాలకు కొంత రక్షణ లభిస్తోంది.

ఆ చట్టమే లేకపోతే మరిన్ని దాడులు జరిగి మరింతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.

కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులకు బలైపోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,

ఎంపీ హరిబాబు నివాళులర్పించారు.

లాసన్స్‌బే కాలనీలో గల నగర భాజపా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల

సమావేశంలో కన్నా మాట్లాడుతూ ఉగ్రవాద ఘాతుకాన్ని ఖండించారు.

అనంతరం బీచ్‌రోడ్డులో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.

ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, నగర పార్టీ అధ్యక్షుడు ఎం.నాగేంద్ర, సీనియర్‌ నాయకులు పి.వి.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.