News

Realestate News

కన్నీటి కష్టాలకు చెల్లు!

కన్నీటి కష్టాలకు చెల్లు!
రూ.138 కోట్లతో భారీ తాగునీటి పథకం నిర్మాణం
సూత్రప్రాయ అంగీకారం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే
నర్సీపట్నంలో రూ.138 కోట్లు ఖర్చు కాగల భారీ తాగునీటి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకరించింది. తదుపరి చర్యల్లో భాగంగా ఏసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు ఆమోదానికి పంపింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ అమలుకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 42 పురపాలికల్లో రూ.3723.30 కోట్లు ఖర్చు కాగల తాగునీటి ప్రాజెక్ట్‌లకు కేంద్రం నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించగా దీంట్లో నర్సీపట్నానికి చోటు దక్కింది.

పూర్వపు నర్సీపట్నం, బలిఘట్టం, పెదబొడ్డేపల్లి పంచాయతీలను కలిపి 2011లో పురపాలికగా ఏర్పాటు చేశారు. 41.95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నర్సీపట్నం విశాఖపట్నం నగరపాలిక తర్వాత అతిపెద్ద పట్టణ స్థానిక సంస్థగా గుర్తింపు పొందింది. ప్రస్తుత అంచనా ప్రకారం 71వేల జనాభా ఉంది. 2047 సంవత్సరం నాటికి పెరగనున్న జనాభాని పరిగణలోకి తీసుకుని ఒక్కోక్కరికి 135 లీటర్ల చొప్పున తాగునీరు ఇచ్చేలా ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు.

ఇదీ ప్రాజెక్ట్‌ స్వరూపం
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచనలను అనుసరించి సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక రూపొందించారు. నర్సీపట్నం-కోటవురట్ల మార్గంలో యండపల్లి వద్ద ఏలేరు కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తీసుకువస్తారు. పురపాలికలోని జోగునాథునిపాలెం వద్ద ఆరువందల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తారు. నర్సీపట్నం పెద్దచెరువులో ఆరువందల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మిస్తారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అదనంగా నాలుగు సర్వీసు రిజర్వాయర్లు నిర్మిస్తారు. 11.86కి.మీ పొడవైన సరఫరా లైను వేస్తారు. 15వేల ఇళ్లకు వ్యక్తిగత కొళాయిలు ఇస్తారు.

వాటర్‌ ట్రీట్‌మెంట్‌, ఫిల్టరేషన్‌ ఫాయింట్‌ను 13.5 ఎం.ఎల్‌.డి.ల సామర్థ్యంతో నిర్మిస్తారు. పంచాయతీ కాలం వివిధ ప్రదేశాల్లో ఉన్న పైపులైన్లు, మోటార్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఏడాది పొడవునా సరిపడినంత నీటి లభ్యత లేదు. ప్రస్తుతం ఒక్కొక్కరికి 45 లీటర్ల మించి నీరు ఇవ్వలేకపోతున్నారు. ఈ సమస్యలకు కొత్త ప్రాజెక్ట్‌ పూర్తి పరిష్కారం చూపనుంది. ప్రాజెక్ట్‌ నిర్మించిన సంస్థ ఏడేళ్లపాటు నిర్వహణ బాధ్యత చూస్తుంది.

సంక్షిప్త సమాచారం
* 2011 లెక్కల ప్రకారం జనాభా 61,540
* 2017 అంచనా ప్రకారం జనాభా 71,000
* విస్తీర్ణం 41.95 చదరపు కిలోమీటర్లు
* విస్తీర్ణం అనకాపల్లి, తుని, ఎలమంచిలి, విజయనగరం కంటే ఎక్కువ
* ఇళ్లు: 16,168, వార్డులు 27
* సిమెంట్‌, బీటీ రోడ్ల పొడవు: 172కి.మీ
* కచ్చా రోడ్ల పొడవు: 164కి.మీ
* సిమెంట్‌ కాలువలు 164 కి.మీ
* కచ్చా కాలువలు 182 కి.మీ

నీటి సరఫరా పరిస్థితి
* ఆధారం: వరాహా నది
* అవసరం: 10ఎం.ఎల్‌.డి.లు
* ప్రస్తుత సరఫరా : 3.42 ఎం.ఎల్‌.డి.లు
* సరఫరా: రోజుకు గంట చొప్పున
* పబ్లిక్‌ కొళాయిలు: 1182
* ప్రవేట్‌ కొళాయిలు: 1218

సమృద్ధిగా స్వచ్ఛమైన నీరు
ప్రతిపాదిత ప్రాజెక్ట్‌కు కేంద్రం సూత్రపాయంగా ఆమోదించడం వల్ల ఇక త్వరితంగా కార్యాచరణ మొదలవుతుంది. ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చితే ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు పొందవచ్చు. ప్రతి ఇంటికీ వ్యక్తిగతంగా కొళాయిలు ఇస్తాం. ఎన్ని ఇళ్లకు కొళాయిలు అవసరమో అంచనా ఉంది. ప్రాజెక్టు వచ్చిన తర్వాత వీధి కొళాయిల అవసరం ఉండకపోవచ్చు. ఈ భారీ ప్రాజెక్టు సాధించడంలో మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రత్యేకంగా శ్రద్ధ చూపారు.

– సిహెచ్‌.సన్యాసిపాత్రుడు, పురపాలిక వైస్‌ఛైర్మన్‌