ఒకే రోజు …రూ.172 కోట్లు!

బ్యాంకుల్లో విరివిగా నోట్ల మార్పిడి
వేలాదిగా తరలి వచ్చిన ఖాతాదారులు
పోలీసు బందోబస్తు మధ్య చెల్లింపులు
రూ.172 కోట్లు… గురువారం ఒకే రోజు నగరంలో జరిగిన నగదు మార్పిడి ఇది. వివిధ జాతీయ, ప్రయివేటü బ్యాంకుల ఆధ్వర్యంలోని 524 శాఖల్లో వేలాది సంఖ్యలో రద్దు చేసిన రూ. 500, రూ.1000 నోట్ల స్థానే ఖాతాదారులు రూ.4 వేలు చొప్పున కొత్త సిరీస్ రూ.500, రూ.100, రూ.50, రూ.20 నోట్లు పొందారు. పోలీసు బందోబస్తు మధ్య ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగదు బట్వాడా జరిగింది. వాస్తవంగా సాయంత్రం 6 గంటలకే నిలిపివేయాలని మొదట నిర్ణయించినా ఖాతాదారులు సాయంత్రం 5 గంటల తరువాత మళ్లీ తరలి రావడంతో మరో 2 గంటలపాటు అదనంగా బ్యాంకులు పని చేశాయి. ఆకస్మాత్తుగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంతో బుధవారం తీవ్ర అవస్థలు పడిన నగర ప్రజలు గురువారం నోట్ల మార్పిడితో కాస్త వూరట చెందారు. ఉదయం 8 గంటల నుంచే బ్యాంకుల ముందు వీరంతా బారులు తీరారు. చాలా శాఖలకు సకాలంలో నగదు చేరకపోవడంతో అత్యధిక చోట్ల ఉదయం 11 గంటల తరువాత నగదు మార్పిడి ప్రక్రియ మొదలైంది. స్వీయ ధ్రువీకరణతోపాటు ఆధార్, ఓటరు గుర్తింపు, పాన్ కార్డుల వివరాల్ని బ్యాంకు సిబ్బంది ఖాతాదారుల నుంచి సేకరించి పాత నోట్లకు బదులుగా రూ.4 వేల నగదు పంపిణీ చేశారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆధ్వర్యంలోనే రూ.100 కోట్లకుపైగా నగదు మార్పిడి జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆంధ్రాబ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐఓబీ, కార్పొరేషన్ బ్యాంకు, ఐడీబీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, ఇతర ప్రయివేట్ బ్యాంకుల్లో మరో రూ.72 కోట్లు బడ్వాటా చేసినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కయ్యపాలెం, సీతమ్మధార, ద్వారకానగర్, ఎంవీపీకాలనీ, మధురవాడ, కంచరపాలెం, మర్రిపాలెం, గోపాలపట్నం, గాజువాక తదితర ప్రాంతాల్లో ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో మొదట కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితులకు చక్కదిద్దారు. ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ బాబూరావునాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. నగదు మార్పిడి తీరుపై రాజధాని నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ కూడా సమీక్షించారు. పోలీస్ కమిషనర్ యోగానంద్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు పరిస్థితులను సమీక్షించి అవసరమైనచోట అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొరత తీరే వరకు నగదు మార్పిడి, చెల్లింపులు….
నగరంలో నగదు కొరత తీరే వరకు రద్దు చేసిన నోట్లు తీసుకొని నగదు ఇవ్వడం, పొదుపు ఖాతాలపై నిర్దేశించిన మేరకు చెల్లింపులు చేసేలా కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్ర, శనివారంతోపాటు సెలవు దినమైన ఆదివారం కూడా బ్యాంకులన్నీ తెరిచి ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదనపు సమయం పని చేసేలా ఉద్యోగులను అధికారులు సమాయత్తం చేశారు. గురువారం రాత్రి 9 గంటల వరకు చాలా శాఖల్లో ఉద్యోగులు సేవలు అందించారు. నగదు మార్పిడి ప్రక్రియ ఎంతో ప్రశాంతంగా సాగిందని, ప్రజలు ఎంతో సహకరించారని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) డిప్యూటీ జనరల్ మేనేజర్ ఏకే పండిట్ ‘ఈనాడు’తో మాట్లాడుతూ తెలిపారు. ఉద్యోగులు కూడా శ్రమ అనుకోకుండా ఎంతో అంకితభావంతో సేవలు అందించారన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా మొదటి రోజు ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు. ఆదివారం కూడా మిగతా శాఖలతోపాటు ఎస్బీఐ బ్రాంచిలన్నీ పని చేస్తాయన్నారు. ఇదే సహకారాన్ని మున్ముందు అందించాలని ప్రజలను కోరారు.
నేటి మధ్యాహ్నం తరువాతే ఏటీఎంల్లో నగదు…
నగర పరిధిలోని వివిధ బ్యాంకులకు చెందిన 732 ఏటీఎం కేంద్రాల్లో శుక్రవారం మధ్యాహ్నం తరువాతే నగదు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. వాస్తవంగా మొదట ఉదయం నుంచే ఏటీఎం కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించినా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సాధ్యం కాలేదు. మధ్యాహ్నం తరువాత అందుబాటులోకి వచ్చే ఈ కేంద్రాల్లో ఒక్కో ఖాతాదారుడు రూ.2 వేలు డ్రా చేసే వెసులుబాటు మాత్రమే ఆర్బీఐ కల్పించింది. దశల వారీగా పరిమితి పెంచే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.