ఐటీ నిపుణులకు భరోసా!
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
ఎట్టకేలకు దృష్టి సారించిన ప్రభుత్వం
రుషికొండ సెజ్‌లో 1.50 ఎకరాల కేటాయింపు
ఈనాడు – విశాఖపట్నం

2007లో రుషికొండ ఐటీ ఆర్థిక మండలిలో వివిధ సంస్థలకు స్థలాలు కేటాయించినా, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టలేదు. దీంతో ఉద్యోగులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. రెస్టారెంట్ కూడా లేకపోవడంతో ఐటీ సంస్థల్లో పని చేసేందుకు నిపుణులు విముఖత చూపే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం దృష్టి సారించడంతో సమస్యలకు పరిష్కారం లభించినట్లేనని ఐటీవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.
ఐలా ఆధ్వర్యంలో….
రుషికొండ ఐటీ ఆర్థిక మండలిని ‘ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ’ (ఐలా) పరిధిలో చేరుస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ కంపెనీలన్నీ కలిసి సొసైటీగా ఏర్పడేందుకు ముందుకు రావడంతో ఐలాకు మార్గం సుగమమైంది. ఏపీఐఐసీ అధికారి ఒకరు దీనికి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. కంపెనీలన్నీ ఆస్తి పన్ను బకాయిలను ఐలాకు చెల్లిస్తున్నాయి. కొత్త నిర్మాణాలకూ ఆ సంస్థ నుంచే అనుమతులు తీసుకుంటున్నాయి. ఇలా వచ్చే ఆదాయంలో ఏటా 50 శాతాన్ని జీవీఎంసీకి చెల్లించి మిగతా 50 శాతాన్ని ఐటీ సెజ్‌లో వివిధ పనుల కోసం ఖర్చు చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, రహదారులు, కాల్వల అభివృద్ధి వంటివి ఇదే కోవకు చెందుతాయి. ఇప్పటివరకు ఈ పనులన్నీ జీవీఎంసీ వర్గాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి. ఐలా ఆధ్వర్యంలో వీటి నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని ప్రత్యేక కమిషనర్ కృష్ణప్రసాద్ తెలిపారు. రుషికొండ ఐటీసెజ్లో మూడు కొండలపైనా సోలార్ వీధి దీపాల ఏర్పాటు కోసం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వీటిని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. పచ్చదనం అభివృద్ధి కోసం పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఐటీ సంస్థల సాయంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే యోచనతో ఉన్నట్లు కృష్ణప్రసాద్ వివరించారు.
Source : http://www.eenadu.net/