News

Realestate News

ఏపీ అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోంది : గంటా

ఏపీ అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోంది : గంటా
పీఎంపాలెం, న్యూస్‌టుడే:  ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అడ్డు పడుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పీఎంపాలెం వి-కన్వెన్షన్‌ కేంద్రంలో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రత్యేకహోదా ఇస్తారన్న నమ్మకంతో నాలుగేళ్లు భాజపాతో కలిసి పని చేశామన్నారు. చివరికి చేతులెత్తేయడంతో ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. రూ.65 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 75 రకాల ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తెదేపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశంలో ఒక్క తెదేపా మాత్రమే కార్యకర్తల కోసం ప్రత్యేక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో ఎన్టీఆర్‌ విద్య, వైద్యసేవలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను తెదేపా కైవసం చేసుకుంటుందని.. ఈసారి భీమిలి నియోజకవర్గంలో 50 వేల ఓట్ల మెజారిటీతో తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల నిర్వహించిన అభివృద్ధి రాష్ట్రాల సర్వేలో ఏపీకి అగ్రస్థానం దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,50,000 వేల కొత్త పింఛన్లు ఇవ్వాలని ఇటీవల కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు.