ఎలమంచిలో వెయ్యి గుంతలు

ఎలమంచిలో వెయ్యి గుంతలు
ఒక్క రోజులో తవ్వకం పనులు ప్రారంభం
ఎలమంచిలి, న్యూస్‌టుడే:
ఎలమంచిలి పట్టణంలో ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు తవ్వించి భూగర్భ జలాల వృద్ధికి కృషి చేస్తామని శాసనసభ్యుడు పంచకర్ల రమేష్‌బాబు చెప్పారు. ‘ఈనాడు – ఈటీవీ’ ఆధ్వర్యంలో శుక్రవారం ఎలమంచిలి పురపాలక సంఘ పరిధిలో ఇంకుడు గుంతల తవ్వకం పనులు చేపట్టారు. ఎమ్మెల్యే రమేష్‌బాబు, పురపాలక సంఘ ఛైర్‌ఫర్సన్ పిళ్లా రమాకుమారి ఆధ్వర్యంలో వెయ్యి ఇంకుడు గుంతల తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. తులసీనగర్ భూలోకమాంబ ఆలయం, ప్రాథమిక పాఠశాలల వద్ద శ్రమదానం చేసి ఇంకుడు గుంతలు తవ్వారు. మున్సిపల్ నిధులతో మెటీరియల్ తెప్పించారు. ఇంకుడు గుంతలు పాడవ్వకుండా చుట్టూ రక్షణ గోడలు నిర్మించి అందులోకి వర్షపు నీరు వెళ్లేలా పైపులు ఏర్పాటు చేశారు. రాళ్లు, నల్లపిక్కతో గుంతలను నింపారు. ఎమ్మెల్యే రమేష్‌బాబు మాట్లాడుతూ.. భావి తరాల కోసం మనందరం ఉత్సాహంగా ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మున్సిపల్ ఛైర్పర్సన్ రమాకుమారి మాట్లాడుతూ.. ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలన్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వార్డుల్లో ప్రజలను చైతన్యపరచి ఇంకుడు గుంతలు తవ్వుకునేలా చేస్తున్నామన్నారు. రాంనగర్లో విజయవంతంగా జరుగుతోందన్నారు. పురపాలక సంఘ మేనేజరు సన్యాసిరావు, డీఈఈ సురేష్‌కుమార్, ఏఈ కోటేశ్వరరావు, గోపాలకృష్ణ, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్, మెప్మా సీఓ లలిత, కౌన్సిలర్లు సూరిబాబు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
40 వేలు పూర్తి చేస్తాం
నియోజకవర్గంలో 40 వేల ఇంకుడు గుంతలు పూర్తి చేస్తాం. ఇందులో కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనాలి. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుదాం. పురపాలక సంఘంతోపాటు గ్రామాల్లోనూ ముమ్మరం చేద్దాం. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి.