News

Realestate News

ఎన్‌ఏడీ వంతెన ఆకృతులపై.. నిపుణులదే తుది నిర్ణయం

ఎన్‌ఏడీ వంతెన ఆకృతులపై.. నిపుణులదే తుది నిర్ణయం
ఆన్‌లైన్‌లో నగరవాసుల స్పందన అంతంత మాత్రమే
ఈనెలాఖరులోగా మిగతా శాఖల అభిప్రాయాల సేకరణ
విశాఖపట్నం
నగరంలో అత్యంత కీలకమైన ఎన్‌ఏడీ కూడలిలో పై వంతెన నిర్మాణానికి కన్సల్టెన్సీ కంపెనీలు తయారు చేసిన ఆకృతులపై నిపుణులే తుది నిర్ణయం తీసుకోనున్నారు. రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే ఈ పైవంతెన ఆకృతిని తొలుత వేక్స్‌ కన్సల్టెన్సీ తయారు చేసింది. దీనిని విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో విజయ నిర్మాణ్‌ కంపెనీ నిర్వాహకులు మరో ఆకృతిని ముఖ్యమంత్రికి చూపించారు. వీటిని పరిశీలించిన చంద్రబాబునాయుడు వీటి ఎంపికలో నగర ప్రజల అభిప్రాయం తీసుకోవాలని, ఎక్కువమంది ఆమోదించిన నమూనాను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ రెండు ఆకృతులను అధికారులు వుడా వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజల నుంచి సూచనలను ఆహ్వానించారు. దీనికి నగరవాసుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. గడువు తేదీ మించిన తరువాత కూడా మరికొన్నిరోజులపాటు ప్రజల అభిప్రాయాల కోసం నిరీక్షించారు. ఇప్పటివరకు 517 మంది అభిప్రాయాలు తెలియజేసినట్టు వుడా అధికారులు చెబుతున్నారు. విజయ్‌ నిర్మాణ కంపెనీ తయారుచేసిన ఆకృతికి అనుకూలంగా 303 మంది, వేక్స్‌ కన్సల్టెన్సీ తయారు చేసిన ఆకృతికి అనుకూలంగా 76 మంది మిగిలినవారు రెండు నమూనాలూ బాగున్నాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. పైవంతెన నిర్మించే కూడలి మీదుగా మెట్రో రైలు మార్గం వచ్చే అవకాశం ఉన్నందున ఆ విధంగా ఈ ఆకృతులుండి ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయపడ్డారు. వీటిని పరిగణలోకి తీసుకుని, నిపుణుల అభిప్రాయాలను కూడా తెలుసుకుని వంతెన నిర్మాణానికి చర్యలు ప్రారంభిస్తామని వుడా అధికారులు చెబుతున్నారు.

పరిగణనలోకి ఇతర శాఖల అభిప్రాయాలు
పైవంతెన నిర్మాణంలో ఇతర ప్రధాన శాఖల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆకృతులు, నిర్మాణ తీరుపై విజ్ఞాన్‌, గీతం, గాయత్రి, ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలతో పాటు విశ్వవిద్యాలయాల అభిప్రాయాలను తీసుకోనున్నారు. రైల్వే, పోర్టు, నౌకాదళం, ఆర్టీసీ, రవాణాశాఖ, జాతీయ రహదారులు, మెట్రో, రహదారులు భవనాలు, విద్యుత్తు, విమానయాన ఇతర శాఖల ముఖ్యఅధికారులతో సమావేశమై వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించాలని యోచిస్తున్నారు. ఈనెలాఖరులోగా ఈ సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

అత్యంత రద్దీ కూడలి..
నగర కూడళ్లలో కీలకమైన, రద్దీ కూడలి ఇది. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. నగరం నుంచి సింహాచలం, అరకు వెళ్లేందుకు ఈ కూడలి మీదుగానే వెళ్లాలి. నగర శివారు ప్రాంతాలకు వెళ్లాలన్నా దీన్ని దాటుకుని వెళ్లాల్సిందే. రవాణాశాఖ అంచనా ప్రకారం ఈ కూడలిని గంటకు 3200 మంది పాదచారులు దాటుతున్నారు. వాహనాల సంఖ్య చెప్పనవసరమే లేదు. అంతంటి ప్రాధాన్యత కూడిన కూడలిలో పైవంతెన నిర్మాణానికి స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో ప్రాజెక్టు పట్టాలెక్కేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు.