ఎన్ఏడీ పైవంతెన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన

పశ్చిమ జనచైతన్య యాత్రలో మంత్రి అయ్యన్న వెల్లడి
ఎన్ఏడీకూడలి, న్యూస్టుడే: ఎన్ఏడీ కొత్తరోడ్డు కూడలిలో పైవంతెన నిర్మాణానికి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారు. జీవీఎంసీ 67వ వార్డు బాజీకూడలిలో మంగళవారం నిర్వహించిన జనచైతన్యయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎంతో కాలం నుంచి ఎన్ఏడీలో ప్రయాణికులు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను ఎమ్మెల్యే గణబాబు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారన్నారు. తర్వలోనే నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఈ నెల 10వ తేదీన జిల్లాలో 65 వేల డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న 6,81,668 మహిళలకు ఒక్కొక్కరికి రూ. 3,000 చొప్పున మొత్తం రూ. 204 కోట్ల రుణమాఫీ జరుగుతుందన్నారు. అర్హులైన కార్మికులంతా చంద్రన్న బీమా పథకంలో చేరాలన్నారు. అంతకముందు ఆయన బాజీకూడలిలో పార్టీ జెండాను ఎగరేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ… కార్యకర్తల సంక్షేమానికి కృషి చేసే ఏకైక పార్టీ తెదేపా అన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి పనికి అడ్డుపడడమే వైకాపా తెలిసిన పని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు నమ్మి శ్రీను, మూర్తియాదవ్, మళ్ల అప్పారావు, కామాకుల నాగేశ్వరరావు పాల్గొన్నారు.