News

Realestate News

ఎన్‌ఏడీ కూడలిలో పెట్టె తరహా పైవంతెన

01-06-2016 Vizag Real Estate News

ప్రతిపాదన రూపొందించిన వ్యాక్స్‌ కన్సెల్టీ సంస్థ
పాదచారుల రాకపోకలపై ఇంకా స్పష్టత లేదు
చర్చించిన అధికారులు.. త్వరలో నిర్ణయం
మర్రిపాలెం – గోపాలపట్నం

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఎన్‌ఏడీ కూడలి వద్ద నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలను ప్రారంభించింది. దీనికి సంబంధించి వుడా ఆధ్వర్యంలో వ్యాక్స్‌ కన్సెల్టెన్సీ సంస్థ తయారుచేసిన ప్రతిపాదనలపై మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో ప్రాథమికంగా చర్చలు జరిగాయి. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోయినా కన్సెల్టెన్సీ సంస్థ అందించిన ప్రతిపాదనలపై నిపుణులు, వివిధ శాఖలకు చెందిన అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తర్వాత జరిగే సమీక్షలో నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారు. నగరం నుంచి విమానాశ్రాయానికి వాహనాల రాకపోకలకు వీలుగా 60 మీటర్ల వెడల్పుతో దిగువ భాగం నుంచి పెట్టె ఆకారంలో సొరంగ మార్గం ఏర్పాటు చేస్తారు. పైవంతెన మీదుగా మర్రిపాలెం-సింహాచలం వాహనాలు రవాణా సాగిస్తాయి. భవిష్యత్తులో ఇదే మార్గంలో వచ్చే మెట్రో రైలు, బీఆర్‌టీఎస్‌ పనులను దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించారు. అయితే పాదచారులు ఎలా వెళతారనే విషయమై స్పష్టత లేదు. దీనికి మార్గసూచి ఇవ్వాలని సమీక్షలో నిర్ణయించారు. ఈ సమావేశంలో పోలీసు కమిషనర్‌ యోగానంద్‌, సంయుక్త కమిషనర్‌ ఖాన్‌, జీవీఎంసీ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, వుడా వీసీ బాబూరావునాయుడు తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామిక ప్రమాదాలపై దృష్టి…: పారాశ్రామిక భద్రతా ఏర్పాట్లపై కూడా ఇదే సమావేశంలో చర్చ జరిగింది. ఇటీవల కాలంలో విశాఖలో పారిశ్రామిక ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయించారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో జరిగే విపత్తులను ఎదుర్కొనేందుకు ఉన్న యంత్ర సామగ్రి, ఇతర అవసరాల వివరాలు కమాండ్‌కంట్రోల్‌లో అందుబాటులో ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా ఫోను నెంబర్లు ఇస్తారు. ఏదైనా సమాచారం రాగానే ఇక్కడి నుంచే ఆయా యంత్రాంగాలను అప్రమత్తం చేసి, సత్వరమే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యేలా చొరవ తీసుకుంటారు. అదేవిధంగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, దానికి న్యాయబద్ధమైన అధికారులు కల్పించాలని నిర్ణయించారు. కౌన్సిల్‌లో వివిధ శాఖలకు చెందిన అధికారులు, పారిశ్రామికవేత్తలు సభ్యులుగా ఉంటారు. జిల్లాలో 154 పరిశ్రమలున్నాయి. 21 రసాయన పరిశ్రమలు ఉండగా, వీటిలో 16 నగర పరిధిలో ఉన్నాయి. పరిశ్రమల్లో అమలవుతున్న భద్రతా చర్యలు, నిబంధనల అమలు, తదితర అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ప్రతీ నెలా కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తూ పరిస్థితులను సమీక్షించనున్నారు.

యోగా దినోత్సవానికి ఏర్పాట్లు : జూన్‌ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ యువరాజ్‌, సీపీ యోగానంద్‌ ఆదేశించారు. ప్రధాన వేదిక ఆర్‌కే బీచ్‌ కేంద్రంగా ఈ కార్యక్రమం జరగనుంది. సీఎం చంద్రబాబు ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. నగరంలో యోగాసనాలు వేయడానికి అనువుగా ఉండే భవనాలను గుర్తించాలని కలెక్టర్‌ యువరాజ్‌ జీవీఎంసీ కమిషనర్‌కు సూచించారు.

రాత్రి మారథాన్‌కు… : జులై 2న విశాఖ సముద్రతీరంలో నిర్వహించనున్న రాత్రి మారథాన్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ యువరాజ్‌ ఆదేశించారు. మారథాన్‌కు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్‌ యువరాజ్‌, సీపీ, ఇతర అధికారులతో కలిసి సమీక్షించారు. ఆర్‌కే బీచ్‌ నుంచి గాయత్రి విద్యాపరిషత్‌ కళాశాల వరకూ మారథాన్‌ కొనసాగనుంది. దారి పొడువునా ఆకట్టుకొనేలా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుదీకరణ, ట్రాఫిక్‌ మళ్లింపు వంటి అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.ఇళ్ల నిర్మాణానికి మురికివాడల ఎంపిక…

అందరికి ఇళ్లు పథకంలో భాగంగా పక్కా ఇళ్లను నిర్మించాల్సి ఉండటంతో ముందుగా మురికివాడల్లో ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ నిర్ణయించారు. మురికివాడల్లో గుడిసెల్లో ఉంటున్న వారికి ఇళ్లను నిర్మిస్తే స్మార్ట్‌ సిటీగా అవతరిస్తున్న విశాఖలో మురికివాడలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే సుమారు 30 మురికివాడలను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో జి+2, జి+3, జి+4 విధానంలో పక్కా ఇళ్లను నిర్మించి, స్థానికంగా ఉంటున్న వారికే కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మురికివాడల్లో ఉంటున్నవారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం రెవెన్యూ, యూసీడీ విభాగాలు సర్వే చేపట్టనున్నాయి.