ఎంపీ సుబ్బరామిరెడ్డి సేవలు ప్రశంసనీయం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: పేదలకు నిరంతరం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోన్న రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి సేవలు ప్రశంసనీయమని సినీ నటుడు మోహన్‌బాబు అన్నారు. గురువారం సైలాడ పైడితల్లి కల్యాణమండపంలో టీఎస్సార్ మెగా వైద్య శిబిరాన్ని సినీ నటుడు మోహన్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు సంపాదించడం గొప్ప కాదని, సంపాదించిన దాంతో పేద ప్రజలకు సేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఇంటింటికీ వైద్యసేవ అనే లక్ష్యం కోసం కృషిచేస్తోన్న సుబ్బరామిరెడ్డి గొప్ప సేవాతత్పరుడన్నారు. ఎంపీ సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మినీ వ్యాన్ల ద్వారా పేదలకు వైద్యం అందిస్తున్నామన్నారు. లక్షమందికి ఉచితంగా నేత్ర పరీక్షలు చేయించామన్నారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 17న ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగబోయే టి.సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను మోహన్‌బాబు పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు, వైద్యాధికారులు డాక్టర్ మధుసూదనబాబు, డాక్టర్ అర్జున తదితరులు పాల్గొన్నారు.es