ఉమ్మడి పరీక్షలు శ్రీకారం

6 నుంచి 9 తరగతుల వరకు అమలు
ప్రైవేటు పాఠశాలలకూ వర్తింపు
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం
సీలేరు, న్యూస్టుడే
ఎన్సీఈఆర్టీ ప్రశ్నపత్రంతో..
గతంలో ఏ జిల్లాకు ఆ జిల్లాలో ప్రశ్నపత్రాలను రూపొందించుకుని ఉమ్మడి పరీక్షలు నిర్వహించే వారు. నూతన విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రశ్నపత్రాలను రాష్ట్ర విద్యా పరిశోధనా మండలి (ఎన్సీఈఆర్టీ) రూపొందించి సీడీల రూపంలో జిల్లాలకు పంపుతుంది. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ప్రశ్నపత్రాలను ముద్రించి మండలాలకు సరఫరా చేస్తుంది.
పర్యవేక్షణకు కమిటీలు
పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణకు మోడరేటివ్ కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని మండలాలకు ఈ కమిటీలను వేశారు. కమిటీలకు ఆయా మండల ఎంఈవోలు ఛైర్మన్లుగా వ్యవహరిస్తారు. వీరితోపాటు సదరు మండలాల్లో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, మరో ఇద్దరు సీనియరు ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు పాఠశాల అసిస్టెంట్లు ఉంటారు. వీరంతా వేర్వేరు సబ్జెక్టులకు చెందిన వారై ఉండాలన్నది నిబంధనగా ఉంది. ఈ కమిటీలు మండల స్థాయిలో జరిగే పరీక్షలను పర్యవేక్షిస్తాయి. జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు నుంచి వచ్చే ప్రశ్నపత్రాలను ఆయా పాఠశాలలకు చేరవేసేందుకు చర్యలు తీసుకుంటాయి.
పరీక్ష ఇలా..
ప్రతి సబ్జెక్టుకు 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులను ప్రాజెక్టు వర్కు, విద్యార్థి అవగాహన తదితర అంశాల ఆధారంగా కేటాయిస్తారు.
పాత పద్దతిలోనే మూల్యాంకనం
జవాబు పత్రాల మూల్యాంకనం ప్రస్తుతానికి పూర్వ పద్దతిలోనే నిర్వహించాలి విద్యా శాఖ నిర్ణయించింది. తొలుత నిర్ణయించి ప్రకారం ప్రతి మండలానికి చెందిన జవాబు పత్రాలు పక్క మండలాల్లో వేరు ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంది. అమలులో అనేక సమస్యలున్నందున ప్రస్తుతం ఈ విధానాన్ని విద్యా శాఖ వాయిదా వేసింది. పరిస్థితులు అనుకూలిస్తే 8, 9 తరగతులకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
బట్టీ విధానంలో మార్కులు రావు
ప్రస్తుతం ప్రశ్నపత్రాలు బట్టీ విధానానికి దూరంగా ఉండనున్నాయి. ప్రశ్నలకు జవాబులు సొంతంగా ఆలోచించి రాయాలి. పాఠ్యపుస్తకాల్లో విషయాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటేనే ప్రశ్నకు జవాబు రాయం సాధ్యమవుతుంది. ఇప్పటివరకూ విద్యార్థులు మార్కులు సాధన కోసం గైడ్లు, పాత ప్రశ్నపత్రాల జవాబు పత్రాలను బట్టీ పట్టేవారు. ఇలా చేయడంతో వారికి మిడిమిడి జ్ఞానమే తప్ప విషయ పరిజ్ఞానం ఉండటం లేదు. ఈ పరీక్షలు విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి.
అందరిలో మార్పు రావాలి
ప్రసుత్త విద్యా విధానం మార్కులే పరమావధిగా సాగుతోంది. ప్రభుత్వం మార్కులను బట్టే ర్యాంకులు ఇస్తోంది. నూతన విధానం వల్ల అందరిలో మార్పు వస్తుందని ఆశించవచ్చు.
సత్ఫలితాలు వస్తాయి
ప్రస్తుతం అమలు చేస్తామంటున్న పరీక్షల విధానం మంచి ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నాం. బట్టీ విధానంతో విద్యార్థులకు మార్కులు తప్ప ఏమి రావు. పరీక్షలు సక్రమ నిర్వహణతో విద్యార్థుల భవిష్యత్తు మారే అవకాశం ఉంది.
మౌలిక వసతులపై దృష్టిసారించాలి
ఎంతసేపూ మెరుగైన ఫలితాలు తీసుకురావాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలుపై ప్రభుత్వం దృష్టిసారించాలి. మార్పు మంచిదే అయితే సత్వర ఫలితాలు ఆశించకూడదు. మార్పుతో మంచి జరిగేలా చూడలే తప్ప ఇతరులకు నష్టం జరిగేలా ఉండకూడదు.
– రాంబాబు, తెలుగు ఉపాధ్యాయుడు