News

Realestate News

ఉద్దానం నుంచే విజయానికి శ్రీకారం చుట్టాలి

ఉద్దానం నుంచే విజయానికి శ్రీకారం చుట్టాలి

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కమిటీలు

విజయవాడలో జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలతో పవన్‌

అరసవల్లి: జిల్లాలోని ఉద్దాన ప్రాంతంలో జనసేన పార్టీ గెలిచే అవకాశముందని, రాష్ట్రంలో పార్టీ గెలుపు అక్కడి నుంచే ప్రారంభం కావాలని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు.

విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం శ్రీకాకుళం జిల్లా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు రానున్నాయని, కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు.

జిల్లాల్లో మరో వారం, పది రోజుల్లో కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు.

ఈ కమిటీలను నియమించేందుకు జిల్లాకు చెందిన గురుప్రసాద్‌, సత్తిబాబు, ఉదయ్‌, బమ్మిడి సంతోష్‌, గోవింద్‌లకు బాధ్యతలను అప్పజెప్పారు.

గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల సభ్యులతో కమిటీ వేయనున్నట్లు ప్రకటించారు.

దశాబ్దాల నుంచి నాయకులు ప్రజలను దోచుకోవడమే తప్ప వారి గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు.

జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే తప్ప వారికి న్యాయం జరగదన్నారు.

ఉద్దానంలో ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండేవారు కాదని, ప్రభుత్వం నుంచి కిడ్నీ సమస్యపై పరిశోధన ఉండేది కాదని వివరించారు.

జనసేన అధికారంలోకి వస్తే ఉద్దానంలో కిడ్నీ సమస్య పూర్తిగా తొలగిపోయేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సమావేశంలో జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలు కోరాడ సర్వేశ్వరరావు, చైతన్య, రామ్మోహన్‌, గురుప్రసాద్‌, శ్రీరామ్మూర్తి, ప్రవీణ్‌, మనోజ్‌, ఉదయ్‌, దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు.