ఉత్సవాల నిర్వహణపై గట్టి నిఘా
ఉత్సవాల నిర్వహణపై గట్టి నిఘా

ఉత్సవాల నిర్వహణపై గట్టి నిఘా
గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించే ఉత్సవాల్లో అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా శాశ్వతంగా చెక్ పెట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి డీఎస్పీ ఎస్.వి.వి.ప్రసాదరావు తెలిపారు.
పోలీసు నిఘా పెంచడంతో పాటు డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కశింకోట పోలీసు స్టేషన్లో శుక్రవారం సాయంత్రం మండలంలోని తీడ గ్రామపెద్దలు, ప్రజా ప్రతినిధులు, సమావేశం నిర్వహించారు. శివరాత్రి పురస్కరించుకుని ఈనెల 4, 5, 6 తేదీల్లో కళ్యాణ పోతురాజు ఉత్సవాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చోటుచేసుకోకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నిఘాలో భాగంగా ఆడియో, వీడియోలతో సహా రికార్డు చేసే ప్రత్యేక యాప్ వినిగిస్తున్నట్లు తెలిపారు. కోడిపందేలు, జూదాలు, లాటరీలు నిర్వహించరాదని హెచ్చరించారు.
జీపీఎస్ పద్ధతిని ప్రవేశ పెడుతున్నామని, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎస్పీ కార్యాలయం చేరుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత చట్టవ్యతిరేక విధానాలకు దూరంగా ఉండాలని సూచించారు.
విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా యువకులకు ప్రోత్సహించడానికి క్రికెట్, వాలీబాల్ కిట్లను అందజేశారు.
ప్రత్యేక బందోబస్తు
కళ్యాణ పోతురాజు ఉత్సవాన్ని పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 25మంది పోలీసు అధికారులు, 100 మంది సిబ్బంది, ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, ఆరుగురు ఆర్ఎస్సైలు గట్టి నిఘా ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
గ్రామంలో 30 మంది యువకులు శ్రీకళ్యాణ పోతురాజు యూత్ అసోసియేషన్‌గా ఏర్పడాలని, వీరంతా ప్రత్యేక టీ షర్టులు వేసుకోవాలన్నారు. మండల పరిధిలో 144 సెక్షన్ విధించడానికి ఆదేశాలు జారీ చేశామన్నారు.
మద్యం అమ్మకాలు జరగకుండా ఎక్సైజ్‌శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. ఎస్సై ఎ.ఎస్.వి.ఎస్.రామకృష్ణ, మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు చిరికి సన్యాసినాయుడు, గ్రామపెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.