News

Realestate News

ఉక్కు సంకల్పం.. జలజలమనిపించే..!

ఉక్కు సంకల్పం.. జలజలమనిపించే..!
నీటి కొరతను అధిగమించే దిశగా అడుగులు
ఆదర్శంగా నిలుస్తున్న ఉక్కు కర్మాగారం
ఉక్కునగరం, న్యూస్‌టుడే
విశాఖ ఉక్కు వంటి భారీ పరిశ్రమల మనుగడ నీటిపైనే ఆధారపడి ఉంటుంది. నీటి లభ్యత ఉన్నంత కాలం ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా పరిశ్రమ మనుగడ సాగిస్తుంది. దీనిపై దృష్టిపెట్టిన కర్మాగారం యాజమాన్యం, ఉద్యోగులకు తాగునీరు, పరిశ్రమకు అవసరమైన నీరు అందించేందుకు 1981లో కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(కేబీఆర్‌)ను రూ.30 కోట్లతో నిర్మించి వినియోగంలోకి తెచ్చారు.

* 3.4 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నపుడు వేసవిలో తప్ప మిగతా రోజుల్లో నీటికొరత ఉండేది కాదు. వేసవి వచ్చిందంటే ఉక్కు కర్మాగారానికి నీరు అందించే జలాశయాలు అడుగంటిపోవడంతో నీటికి కటకటలాడాల్సి వచ్చేది. ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో మరీ ఇబ్బంది ఎదుర్కోవలసి వచ్చేది. మరో 20రోజులకు మాత్రమే సరిపడా నీరు ఉంటుందని, అక్కడి నుంచి ఉత్పత్తి నిలుపుదల చేయాల్సి ఉంటుందేమోనని అధికారులు హైరానా పడే పరిస్థితులూ ఉండేవి. జీవీఎంసి అధికారులపై ఒత్తిడి చేస్తే గోదావరిలో పంపులు ఏర్పాటు చేసి ఎత్తిపోయడం చేసేవారు. ఇలా వర్షాలు పడేవరకు దినదినగండంగా గడిపేవారు.

మరో రిజర్వాయర్‌ నిర్మాణం
ప్రస్తుతం 7.2 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి స్థాయికి విశాఖ ఉక్కు విస్తరించింది. రోజుకు 45 మిలియన్‌ గ్యాలన్ల నీరు అవసరం. కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌-1 ద్వారా 35 ఎంజీడీ వినియోగిస్తున్నారు. పెరిగిన ఉత్పత్తి, అవసరాల దృష్ట్యా మరిన్ని నీటి అవసరాలు ఏర్పడ్డాయి. దీన్ని అధిగమించేందుకు మరో రిజర్వాయర్‌ నిర్మాణం ఆవశ్యకతను గుర్తించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా మరో జలాశయం నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాని ఫలితమే జాతీయ రహదారి పక్కన రిజర్వాయర్‌ నిర్మాణం .

* సుమారు 225 ఎకరాలలో 1070 మీటర్ల పొడవు, 650 మీటర్ల వెడల్పుతో 12.32 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యం కలిగిన కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(కేబీఆర్‌-2) నిర్మాణం ప్రారంభించారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పనులు కలుపుకొని సుమారు రూ.465 కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు. 24 నెలల్లో పని పూర్తి చేయాల్సి ఉండటంతో రాత్రి, పగలు పెద్ద పెద్ద యంత్రాలతో పనులు నిర్వహిస్తున్నారు.

తక్కువ విస్తీర్ణం..ఎక్కువ నిల్వ సామర్థ్యం
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కేబీఆర్‌-2 భూ మట్టానికి 14 మీటర్ల లోతు, భూమట్టం నుంచి 11.24 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పాత జలాశయం సుమారు 700 ఎకరాల్లో నిర్మించగా ప్రస్తుత జలాశయం 225 ఎకరాల్లో నిర్మించ¿నుండటం విశేషం. ఇంచుమించు పాత జలాశయం నీటి నిల్వ సామర్థ్యం దీనికి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

రూ. 54 కోట్లతో కేబీఆర్‌-1 ఆధునికీకరణ
2014 అక్టోబర్‌లో వచ్చిన హుద్‌హుద్‌ తుపాను వల్ల కేబీఆర్‌ రక్షణ గోడ, లోపలి వైపు కొంత మేర దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నీటిని అందించేందుకు సిద్ధపడినా నిల్వ చేసుకొనే పరిస్థితి లేకపోవడంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. దీన్ని పునరుద్ధరించేందుకు ఉక్కు యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖలు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. సుమారు రూ.54 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. జలాశయం చుట్టూ సుమారు 7 కిమీ గట్లను, రెండు చెరువులను విడదీసి మధ్యలో రోడ్డు 3 కిమీ మేర(డైక్‌) గట్టును పటిష్టం చేయడంతో పాటు లోపల, బయట వాలు(స్లోప్‌) పెంచనున్నారు. లోపలి వైపు వాలులో అలలను విరగగొట్టే ఏర్పాట్లు చేశారు.

బొట్టును.. ఒడిసి పడుతూ..
ఏలేరు రిజర్వాయర్‌ నుంచి రావలసిన సుమారు 32 ఎంజీడీల నీరు సక్రమంగా అందక పోవడం, మరోవైపు విస్తరణ పనులు వేగంగా పూర్తయి నీటి అవసరాలు పెరిగి పోతుండటంతో విశాఖ ఉక్కు యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి దాన్ని కేబిఆర్‌లోకి పంపింగ్‌ చేయడం (రెయిన్‌ హార్వెస్టెంగ్‌) వంటి బృహత్తర కార్యక్రమం చేపట్టింది. అగనంపూడి పరిసర ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు, కణితి, కూర్మన్నపాలెం, దువ్వాడ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు వృథాగా సముద్రం పాలైపోతుంది. దువ్వాడ పరివాహక ప్రాంతంలో సుమారు 5ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువును, దువ్వాడ, కూర్మన్నపాలెం, కణితి పరివాహక ప్రాంతంలో సుమారు 5ఎకరాల విస్తీర్ణంలో మరో చెరువును నిర్మించారు. ఆ చెరువుల నుంచి వర్షపు నీటిని కేబిఆర్‌లోకి పంపింగ్‌ చేసేందుకు సుమారు రూ.7 కోట్లతో రెండు పంపింగ్‌ స్టేషన్లను నిర్మించారు. ఒక్కో స్టేషన్‌కు గంటకు 2 మిలియన్‌ గ్యాలన్ల/ రోజుకు 20 మిలియన్‌ గ్యాలన్ల నీటిని పంపింగ్‌ చేసే సామర్థ్యం ఉంది. దీంతో నీటి కష్టాలను అధిగమించేందుకు మార్గం సుగమమైంది.

వ్యర్థ జలాల శుద్ధి..వినియోగం
ఉక్కునగరంలోని 12 సెక్టార్లలో వెలువడే వ్యర్థ జలాలను కణితిలో ఏర్పాటు చేసిన 9 ఎంఎల్‌డీ వ్యర్థ జలాల శుద్ధీకరణ ప్లాంట్‌లో శుద్ధి చేసి అనంతరం కర్మాగారంలోని ఆల్ట్రా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు పంపుతారు. అక్కడ రసాయనాలతో శుద్ధీకరించి రోలింగ్‌ మిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ వంటి విభాగాలలో వినియోగిస్తున్నారు. కర్మాగారంలో వెలువడే వ్యర్థ జలాలను అప్పికొండ, బాలచెరువు ప్రాంతంలో ఉన్న మరో రెండు ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల ద్వారా శుద్ధీకరించి ఇతర విభాగాలలో కూలింగ్‌ తదితర అవసరాలకు వినియోగిస్తున్నారు.

ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో..
నీటి వినియోగంలో మిగతా భారతీయ ఉక్కు పరిశ్రమలకు ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నాం. దక్షిణాదిలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎటువంటి అవరోధం లేకుండా నీటి సరఫరా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరగా ఆయన స్పందించి వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తగిన చర్యలు తీసుకోవడం హర్షణీయం.

– పి.మధుసూదన్‌, ఉక్కు సీఎండీ