News

Realestate News

‘ఈత’రానికి శిక్షణ

vizag news 2106

ఈతలో మెలకువలు నేర్పుతున్న కలకత్తా సంస్థ
బీచ్‌ రోడ్‌, (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే

వారు ఈత తెలియని వారు కాదు.. అలాగని ఈత తెలిసిన వారందరూ ప్రమాదంలో ఇంకొకరిని రక్షిస్తారన్న నమ్మకం లేదు. దీనికి కొన్ని మెలకువలు తెలిసుండాలి. తమను తాము కాపాడుకుంటూ బాధితులను కాపాడే అవగాహన ఉండాలి. ఇప్పుడు వీరికి జరుగుతున్న శిక్షణ అదే. ఈతపై అవగాహన కల్పించి.. గజ ఈతగాళ్లుగా మారుస్తున్నారు. నీటిపై పట్టు పెంచుతున్నారు.
పుష్కరాలు.. వరదలు.. తుపాన్లు.. ప్రకృతి విపత్తులు.. సముద్ర తీరాల్లో ప్రమాదవశాత్తూ నీట మునిగిన వారిని రక్షించేందుకు లైఫ్‌ గార్డులను ఏర్పాటు చేస్తుంటారు. వీరినే మన పరిభాషలో గజ ఈతగాళ్లుగా వ్యవహరిస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించేందుకు గజ ఈతగాళ్లు తమ ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఈత తెలిసిన ప్రతి ఒక్కరు ప్రమాదంలో ఉన్నవారిని రక్షించలేరు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతంలో తన ప్రాణాలను కాపాడుకుంటూ ఆపదలో ఉన్న వారిని రక్షించగలగడం ఎంతో బాధ్యతాయుతమైన పని. ఇలా విపత్తులలో ప్రాణాలు నిలపగలిగే ప్రాణ రక్షక దళాన్ని విశాఖ సాగర తీరంలో తయారు చేస్తున్నారు. ఈతలో ప్రావీణ్యం ఉన్న మత్స్యకార కుటుంబాలకు చెందిన పలువురు యువకులు మరిన్ని మెలకువలు నేర్చుకొని రాటు దేలుతున్నారు.

‘లైఫ్‌ సేవింగ్‌ సొసైటీ’ ఆధ్వర్యంలో..
కోల్‌కతాకు చెందిన ‘లైఫ్‌ సేవింగ్‌ సొసైటీ’ ఆధ్వర్యంలో బీచ్‌రోడ్‌లోని ఆక్వా స్పోర్ట్సు కాంప్లెక్స్‌లో ఉన్న ఈత కొలనుల్లో మెలకువలు నేర్చుకుంటున్నారు. నీటి అడుగు భాగంలోనికి వెళ్లి వెతకడం, ప్రమాదానికి గురై నీట మునిగిన వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడం, క్షతగాత్రులు ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రాథమిక చికిత్స, ఇలా పలు అంశాలలో యువకులు శిక్షణ పొందుతున్నారు.

సరదా యాత్రలతో…
సముద్ర, నదీ స్నానాలు చేసే సమయంలో అజాగ్రత్త, లోతు, ప్రమాద ప్రాంతాలను గుర్తించకపోవడం వంటి కారణాలతో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రధానంగా విహార యాత్రలు, సరదా కోసం వచ్చే యువకులు, చిన్నారులు ఇటువంటి ప్రమాదాలలో చిక్కుకుంటున్నారు. నీటి ప్రమాదం పొంచి ఉన్న సురక్షితం కాని ప్రాంతాల్లో లైఫ్‌ గార్డుల ఏర్పాటు ఆవశ్యకత చాలా ఉంది. అయితే మనకు ఉత్సవాలు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల సమయాల్లో మాత్రమే గజ ఈతగాళ్లను ఉపయోగిస్తుంటారు. కానీ వీరి అవసరం విపత్తుల సమయంలోనే కాక విశాఖ లాంటి సుందర తీరం ఉన్న నగరానికి చాలా అవసరం ఉంది. అయితే ఇక్కడ తగిన ఉపాధి అవకాశాలు లేక పోవడంతో గజ ఈతగాళ్లు ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఉపాధి అవకాశాలను చూసుకొని తరలిపోతున్నారు. ఈతలో నైపుణ్యాలను అందించే శిక్షణ సంస్థలు మనకు తక్కువగానే ఉన్నాయి. ఈత కొలనులు అందుబాటులో ఉండడంతో ఇటీవల కాలంలో దీనిపై ఆసక్తి పెరిగి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తున్నారు. మరి కొందరు వ్యాయామంగా ఈతను నేర్చుకుంటున్నారు. ఆకర్షణీయ నగరంగా ఖ్యాతి గాంచిన విశాఖ సముద్ర తీరంలో రక్షణ కోసం గజ ఈతగాళ్ల అవసరమూ ఉంది. దీనిని ప్రభుత్వం గుర్తిస్తే వీరికి కూడా ప్రజల ప్రాణాలను కాపాడగలగడమే కాక ఉపాధి పొందగలుగుతారు.

నెల రోజుల శిక్షణ
ఈతతో పాటు మెలకువలు నేర్పుతాము. తద్వారా వీరు ఈతలో ఆరితేరతారు. సుమారు నెల రోజుల పాటు ఈ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. ప్రత్యేక వ్యాయామాలు చేయించడం ద్వారా వీరిని మంచి ఆరోగ్య వంతులుగాను చేస్తాం. విపత్తులు, ఉపద్రవాలు చోటు చేసుకున్న సమయంలో ఇటువంటి నిపుణులైన వారి అవసరం చాలా ఉంటుంది. ప్రజల ప్రాణాలను కాపాడగలిగే మహత్తర బాధ్యతను నిర్వర్తించగలగడం ఎంతో ఉన్నతమైనది. ఆపదలో ఉన్నవారిని కాపాడడాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తాం. ఈత కొలనులోనే కాక, సముద్రంలోను మెలకువలు నేర్పి ప్రతిభావంతులుగా తీర్చి దిద్దుతున్నాం
– పి.బాలాజీ, లైఫ్‌ సేవింగ్‌ సొసైటీ ప్రధాన శిక్షకులు

నీటితోనే జీవనం…
పుట్టి పెరిగింది సముద్ర తీరంలోనే అయినా సంప్రదాయ తరహాలో కాకుండా ఈతలో మరిన్ని మెలకువలను నేర్చుకోగలిగాను. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఈదగలిగిన సామర్థ్యం సాధించాను. దీనితోపాటు నీటిలో మునిగిన వారిని బయటకు తీసుకువచ్చే సమయంలో ఎలా చేయాలి. దాని ద్వారా వారి ప్రాణాలను నిలపగలం అన్న కీలకమైన సూత్రాలను నేర్చుకున్నాను. దీని ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశపడుతున్నాను. రామోలు రాజు, డిగ్రీ విద్యార్థి, విశాఖపట్టణం
విదేశాల్లో ఉపాధి

ఈతలో ప్రావీణ్యం ఉండడం వల్ల లైఫ్‌ గార్డుగా ఉద్యోగం చేసేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం లభించింది. అయితే మరిన్ని మెలకువలు నేర్చుకొనేందుకు లైఫ్‌ సేవింగ్‌ సొసైటీ శిక్షణ శిబిరంలో చేరాను. భవిష్యత్తులో ఉపయోగపడే ఎన్నో మెలకువలను ఇక్కడ నేర్చుకోగలిగాను. ప్రజలకు, సమాజానికి ఉపయోగపడే లైఫ్‌ గార్డు వృత్తిని ఎంచుకోవడం ఆనందంగా ఉంది.- ఎస్‌.శ్రీనివాస్‌, ఐటీఐ విద్యార్థి, జాలరి పేట

మంచి అవకాశం…
ఈత నేర్చుకోవడం వల్ల మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చునని ఇక్కడ శిక్షణ పొందుతున్నాను. చిన్న నాటి నుంచి నాకు ఈతలో ఎంతో ప్రావీణ్యం ఉంది. అయినా ఈ శిక్షణ శిబిరంలో ప్రధాన శిక్షకుల వద్ద ఉపయోగపడే అంశాలు తెలుసుకున్నాను. ఈ శిక్షణ నాకు ఎంతగానో ఉపయుక్తం అవుతుంది. గజ ఈతగాడిగా జీవనం ప్రారంభించాలని ఆశపడుతున్నాను.- వి.లక్ష్మణరావు, భీమిలి