ఈతరం.. ‘అంకుర’ పథం..
ఆవిష్కరణలకు ప్రశంసలు
స్టార్టప్‌లతో యువత ముందంజ
కొమ్మాది, న్యూస్‌టుడే

* కళాశాల నుంచి బయటకొచ్చేసరికి ఓ సంస్థకు యజమానిగా మారాలి.. ఇది నేటి మాట…
ఆ దిశగా యువత ఆలోచనలు సృజన పుంతలు తొక్కుతోంది. చదువుకునే సమయంలోనే తమ ప్రతిభను చూపించేందుకు పోటీపడుతున్నారు. ఒకవైపు ఎంచుకున్న విభాగంపై పట్టుసాధిస్తూ ఆ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృత పరిశోధనలు చేసి విజయం సాధిస్తున్నారు. రేపటి తరం పారిశ్రామికవేత్తల జాబితాలో తామూ ఉంటామని ఘంటాపథంగా చెబుతున్నారు.
ఆలోచనలను పదునుపెట్టి నూతన ఆవిష్కరణలను రూపొందించాలి. ఇది స్టార్టప్ కాగా.. దాన్ని వాణిజ్యకరణ చేస్తే స్టాండప్ అవుతుంది. ఆ రెండింటిని ఇంజినీరింగ్ ఈఈఈ ఆఖరిసంవత్సరం విద్యార్థి బి.అవధాని ప్రశాంత్, ఈసీఈ ఆఖరిసంవత్సరం విద్యార్థులు వై.హేమంత్, ఎం.సతీష్, బీబీఎం చదివిన ఎ.శ్రీవిష్ణులు సాధించారు. ప్రకృతిలో ముఖ్యమైన ‘విద్యుత్తుచ్ఛక్తి’ని నియంత్రణలో పెట్టేందుకు ఎనర్జీ మోనటరింగ్ సిస్టమ్ (విద్యుత్తుచ్ఛక్తి పర్యవేక్షణ పరికరం)ని రూపొందించారు. మరొకటి జీవ ఆధారమైన జలాన్ని వృథా చేయకుండా వినియోగించడంపై ‘స్మార్ట్ వాటరింగ్ సిస్టమ్’ ను తయారుచేసి పలు వేదికలపై ప్రదర్శించి విజయం సాధించారు.
స్టార్టప్.. స్టాండప్ను సాకారం చేస్తున్న విద్యార్థులు
* ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న నలుగురు విద్యార్థులు కలిసి ‘వర్డె సొల్యుషన్స్’ సంస్థను ఏర్పాటు చేశారు. సీఈవోగా బి.అవధాని ప్రశాంత్, డైరెక్టర్లుగా వై.హేమంత్, ఎం.సతీష్, శ్రీవిష్ణులు వ్యవహరిస్తున్నారు. తాము రూపొందించిన స్టార్టప్‌లు విద్యుత్తు వినియోగ పర్యవేక్షణ పరికరం, స్మార్ట్ వాటరింగ్ సిస్టమ్‌కు పేటెంట్ హక్కుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత సంస్థల నుంచి అవకాశాలు వచ్చినా, ఉన్నతమైన భవిష్యత్తు కోసం పేటెంట్ వచ్చిన తర్వాత వీటి ద్వారా వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన ఉందని విద్యార్థులు చెబుతున్నారు.
విద్యుత్తు వినియోగ పర్యవేక్షణ పరికరం(ఎనర్జీ మోనటరింగ్ సిస్టమ్)
* ప్రస్తుత విద్యుత్తు వినియోగాన్ని పర్యవేక్షించే పరికరాలు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటికి భిన్నంగా ఈ విద్యార్థులు ‘ఎనర్జీ మోనటరింగ్ సిస్టమ్’ను రూపొందించారు. ఇంట్లో, పరిశ్రమల్లో ఏ ఎలక్ట్రానిక్ పరికరం ఎన్ని ‘యూనిట్స్’ విద్యుత్తు వినియోగిస్తుందో తెలియదు. నిత్య జీవితంలో ఈ విషయాలను పట్టించుకోం. ఇంట్లో ఫ్యాన్, ఏసీ, ట్యూబ్లైటు తదితరాలు వేసి మరచిపోతాం. ఈ పరికరాన్ని ఉపయోగించి ఎక్కడున్నా వెబ్సైట్ నుంచి గానీ, స్మార్ట్ చరవాణి నుంచి గానీ పరికరాలను నియంత్రించవచ్చు. ఎంత విద్యుత్తు వినియోగం అవుతుందో తెలుసుకోవచ్చు.
పనిచేసే విధానం ఇలా..
విద్యుత్తు సరఫరా అయ్యే ప్రాంతంలో ఈ పరికరాన్ని ఏర్పాటు చేసి దాన్ని వైఫైకు, అక్కడి నుంచి సర్వర్‌కు అనుసంధానం చేస్తారు. తద్వారా వెబ్సైట్ లేదా, స్మార్ట్ చరవాణి ద్వారా విద్యుత్తు పరికరాలను నియంత్రించవచ్చు.
నీటి వృథాను అరికట్టే.. ‘స్మార్ట్ వాటరింగ్ వ్యవస్థ’
నగరాల్లో అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలో, బాల్కనీలో, మేడపైన చాలా మంది మొక్కలు పెంచుతుంటారు. పది, ఇరవై రోజులు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తే ఆ మొక్కలకు నీరందక జీవాన్ని కోల్పోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ‘స్మార్ట్ వాటరింగ్’ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే.. వాతావరణ పరిస్థితులను బట్టి ఏ మొక్కకు ఎంత నీరు చేరాలో అంచనా వేసి, మనం ఉన్నాలేకపోయినా నీటిని అందిస్తుంది. ఈ పద్ధతిలో మట్టిని వాడరు. మొక్కకు కావాల్సిన పోషకాలు కూడా నీటి ద్వారా అందిస్తారు. మట్టికి బదులు క్లేపేబుల్ అనే పదార్థాన్ని వాడుతారు. ఇది తేమను ఎక్కువసేపు నిల్వ ఉంచుకుంటుంది.
వినియోగం ఇలా..
నీటి కొళాయికి ప్రత్యేకంగా రూపొందించిన రిజర్వాయర్‌ను అనుసంధానం చేస్తారు. ఇందులో మోటారును ఏర్పాటు చేస్తారు. అది నీటిని పంపింగ్ చేస్తుంది. దానికి ఈ పరికరం ఏర్పాటు చేస్తే అది బయటవున్న ఉష్ణోగ్రత, తేమను బట్టి మొక్కకు ఎంత మొత్తంలో నీరు అవసరమో అంచనా వేసి సరఫరా చేస్తుంది. ఈ స్మార్ట్ వాటరింగ్ సిస్టమ్‌ను విద్యార్థులు బెంగళూరులో ఇటీవల జరిగిన ‘ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్’లో ప్రదర్శించారు. 20 విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జరిగిన విశాఖ ఉత్సవంలో ప్లాటినమ్ బహుమతిని సొంతం చేసుకున్నారు.
ఉద్యోగాలను వదులుకుని..
సొంతంగా పరిశ్రమ స్థాపించి మరి కొంత మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇటీవల మా నలుగురుకి టీసీఎస్ సంస్థలో ఉన్నత కొలువులు వచ్చాయి. కానీ వాటిని వదిలి ‘వర్డె సొల్యుషన్స్’ సంస్థను ఏర్పాటు చేశాం. ఇటీవల ‘ఎనర్జీ మోనటరింగ్ సిస్టమ్’ను శిల్పారామంలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ అధికారులను సంప్రదించాం. వారు సానుకూలంగా స్పందించారు. భాగస్వామ్య సదస్సులో మంత్రి అయ్యన్నపాత్రుడుకి మేము రూపొందించిన సార్టర్ట్ల గురంచి వివరించగా వ్యవసాయరంగానికి స్మార్ట్ వాటరింగ్ సిస్టమ్ ఉపయుక్తంగా ఉంటుందని, వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు దీని గురించి తెలియజేసి ప్రమోట్ చేస్తారన్నారు.