ఇసుకకూ.. ఓ యాప్
ఆన్లైన్లో ఇంటివద్దకే సరఫరా
ఇవారం రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి
జేసీ నివాస్ వెల్లడి
విశాఖపట్నం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న ఉచిత ఇసుక ఇక నుంచి ఆన్లైన్లో ఇంటివద్దకే చేరనుంది. దీనికోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందించింది. ‘మన శాండ్’ పేరుతో ఇది రూపుదిద్దుకుంది. www.apsand.com వెబ్సైట్లో వెళ్తే ‘మన శాండ్’ తెరుచుకుంటుంది. దీనిలో ఉండే అప్లికేషన్లో పూర్తి వివరాలను పొందపర్చి ‘బుక్’ చేస్తే ఇసుక లారీ ఇంటి వద్దకే వస్తుందని, దీనికి సంబంధించిన వివరాలను సంయుక్త కలెక్టర్ జె.నివాస్ సోమవారం వెల్లడించారు. యాప్‌ను రూపొందించిన ప్రతినిధులు, గనులశాఖ అధికారులు, ఏపీఎండీసీ అధికారులతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో జేసీ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో బుక్ చేసుకొనే వినియోగదారులకు శ్రీకాకుళం నుంచి వచ్చే ఇసుకకు ఒక ధర, తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చే ఇసుకకు మరో ధర నిర్ణయించామని, నిర్ణీత మొత్తం కన్నా ఒక్క పైసా కూడా అదనంగా వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆన్లైన్ బుకింగ్ సమయంలో ఇంటి చిరునామా, ఇసుక అవసరం తదితర వివరాలను స్పష్టంగా తెలియచేయాలన్నారు. ఆన్లైన్లో బుకింగ్ అనేది తప్పనిసరి కాదని, డిపోల వద్దకు వెళ్లి కొనుగోలు చేసుకోవచ్చునన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యాప్‌ను రూపొందించామని, వారం రోజుల వ్యవధిలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చే ఇసుక 12 క్యూబిక్ మీటర్ల లోడు రూ.14వేలు, 15 క్యూబిక్ మీటర్ల లోడు రూ.16వేలుగా నిర్ణయించామని జేసీ వెల్లడించారు. అదే శ్రీకాకుళం జిల్లా నుంచి రప్పించుకుంటే 12 క్యూబిక్ మీటర్ల లోడు రూ. 12 వేలు, 15 క్యూబిక్ మీటర్ల లోడు రూ.13 వేలుగా నిర్ణయించామన్నారు. ఈ ధరకు కేవలం ఎన్ఏడీ కొత్తరోడ్డు వరకూ తెస్తారని, అదే ఇళ్లవద్దకు అయితే అదనపు సొమ్ము చెల్లించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జొన్నాడ, ముగ్గళ్ల, గోపాలపురం, శ్రీకాకుళం జిల్లా పరిధిలో పురుషోత్తమపురం, దూసి, పొన్నాడ, హయిత్నగర్ రీచ్‌లను విశాఖకు కేటాయించారని చెప్పారు.
జిల్లాలో గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలను నిరోధించేందుకు పక్కాగా చర్యలను తీసుకున్నామని జేసీ స్పష్టం చేశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా అమ్మకాలను చేపట్టామని, ఈ మేరకు రాంబిల్లి, అచ్యుతాపురం, అనకాపల్లిలో ఆరు క్వారీలు గుర్తించినట్లు చెప్పారు. క్యూబిక్ మీటరు గ్రావెల్ ధర రూ. 200లుగా నిర్ణయించామని, రవాణా ఛార్జీలను వినియోగదారులు భరించాలన్నారు. గ్రావెల్ అవసరం ఉన్న ఉన్నవాళ్లు ఏపీఎండీసీ అధికారులను సంప్రదించాలని జేసీ సూచించారు. తక్కువ పరిణామంలో అయితే ఒకరోజు వ్యవధిలో సరఫరా చేస్తామని చెప్పారు. సీతంపేట, లక్ష్మీ గణపతి ఆలయం సమీపంలో ఉన్న ఏపీఎండీసీ కార్యాలయాన్ని 0891-2550310 ఫోన్నెంబరులో కానీ టోల్‌ఫ్రీ నెంబర్ 8688939939ను కానీ సంప్రదించాలని సూచించారు. ఇటీవల భీమిలి మండల పరిధిలో బీచ్‌రోడ్డులో అక్రమ క్వారీ తవ్వకాలను గుర్తించామని, దీనికి బాధ్యునిగా వీఆర్వోను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సమీక్షలో గనులశాఖ అధికారులు వైవివిఎస్ చౌదరి, కె.సుబ్బారావు, సూర్యచంద్రరావు, ఏపీఎండీసీ జీఎం కె.రమణ, యాప్ ప్రతినిధి కె.మూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు.
Source : http://www.eenadu.net/
Notice: compact(): Undefined variable: limits in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Notice: compact(): Undefined variable: groupby in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
821
Warning: count(): Parameter must be an array or an object that implements Countable in
/home/manohars/public_html/vizagrealestate.com/wp-includes/class-wp-comment-query.php on line
399