News

Realestate News

ఇష్టమైన రంగంలో రాణించండి

ఇష్టమైన రంగంలో రాణించండి
నవ్యాంధ్రలో అంకుర అభివృద్ధి ప్రాంతం ఏర్పాటు
జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు

నైపుణ్యం మీలో ఉందా.. లేకపోతే పెంచుకోండి. సమాచార నైపుణ్యాలు, మూర్తిమత్వం, పదిమందిని మీ దారిలోకి తెచ్చుకోగల సత్తా అలవర్చుకుంటే ఉపాధి మీ చెంతనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం ప్రారంభించిన అంకుర అభివృద్థి(స్టార్టప్‌)
కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం సైతం సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే నవ్యాంధ్రలో అంకుర అభివృద్ధిని ప్రారంభించారు.

న్యూస్‌టుడే, చీపురుపల్లి గ్రామీణం: విభిన్నంగా ఆలోచించే తత్వం గలది నేటి యువత. అందుకనే వారి నిమిత్తం అంకుర భారత్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కేవలం సాంకేతిక విద్యే కాకుండా సాధారణ డిగ్రీకోర్సులు చదివే విద్యార్థుల్లో విభిన్నంగా, సృజనాత్మకంగా ఆలోచించేతత్వం ఉండి సమాజానికి ఉపయోగపడే ఆలోచనలతో ముందుకు వస్తే చాలు అంకుర భారత్‌ స్టార్టప్‌ చేయూతనిందిస్తుంది. మనోళ్లు మాత్రం ఈ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఆమడ దూరంలో ఉంటున్నారు. జిల్లామొత్తం జనాభా 23.44 లక్షలు. ఇందులో 18-24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు 4.22 లక్షల మంది ఉన్నారు. ఇందులో జిల్లానుంచి యువత స్టార్టప్‌ కేంద్రాల్లో స్థానం సంపాదించిన వారిలో ఏఒక్కరూ లేకపోవడం గమనార్హం. ఇంజినీరింగ్‌ కళాశాలల నేతృత్వంలో నిర్వహిస్తున్న వివిధ ఫెస్ట్‌ కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రదర్శనలు కేవలం జిల్లాకే పరిమితమవుతున్నాయి. జాతీయ స్థాయికి వెళ్తున్న ప్రదర్శనలు అక్కడి నిర్వహకుల మెప్పును పొందలేకపోతున్నాయి.

ప్రభుత్వ ప్రోత్సాహం ఇలా
అంకురాల బాట పట్టే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. రంగాల వారీగా స్టార్టప్‌లతో ప్రాధాన్యం ఇస్తుంది. వ్యాపార కార్యకలాపాల్లో తక్కువ స్థాయిలో ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది. మూడేళ్ల పాటు ఎలాంటి తనిఖీలుండవు. మూడేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపునిచ్చింది. అవసరమైతే ప్రభుత్వమే రుణ సదుపాయాన్ని సైతం అందిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా యువత సైతం కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. ఇందుకు కళాశాల దశలోనే కొత్త ఆలోచనలకు బీజం వేయాలి. వచ్చిన ఆలోచనను స్టార్టప్‌లో పెట్టి నిర్వాహకుల అనుమతి పొందితే సరిపోతుంది. మనం ఇచ్చే ఆలోచన సమాజానికి పనికొచ్చేలా ఉండాలి. అప్పుడే స్టార్టప్‌లో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది.

నైపుణ్యాభివృద్ధి సంస్థ అండ
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్థి సంస్థ యువతలో నైపుణ్యాలను పెంచడానికి తనవంతు కృషిచేస్తుంది. ఆంగ్ల నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనలు, మూర్తిమత్వం తదితర అంశాలను శిక్షణలో ఇస్తున్నారు. గతేడాది జిల్లాలో ఇలాంటి శిక్షణలతో యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి సంస్థ తనవంతు సహకారం అందించింది. దీన్ని వినియోగించుకున్న విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 5 వేల మందివరకు ఉన్నారు. ఈ క్రమంలోనే సంస్థ చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో 500 మంది వరకు సాధారణ డిగ్రీకోర్సు నుంచి సాంకేతిక విద్య అభ్యసించిన వారంతా పలు కార్పొరేట్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలను  అందుకున్నారు. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఆంగ్ల నైపుణ్యాలను అందించడానికి ప్రభుత్వం విదేశీ విద్యా సంస్థలతో కలిసి ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఏడాదికి లక్ష మందికి ఆంగ్ల నైపుణ్యాలను అందించడానికి ధ్యేయంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆ దిశగా నైపుణ్య అభివృద్ధి సంస్థ అడుగులు వేస్తుంది. పొరుగు జిల్లా విశాఖపట్నం విభజన జరిగిన తర్వాత ఐటీ హబ్‌గా మారుతుంది. కొత్తకొత్త ఐటీ సంస్థలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా విద్యార్థులు నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే ఉపాధి దొరికే అవకాశాలుంటాయి.

నిపుణులతో సూచనలు
యువత జాతీయ నైపుణ్య అభివృద్థి సంస్థ(నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎన్‌ఎస్‌డీసీ)తో నైపుణ్యాలను పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అంతర్జాలాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యవసాయ నైపుణ్యాలు, ఆటోమొబైల్‌, పెట్టుబడి, నిర్మాణం, విద్యుత్తు ఉపకరణాలు, ఆరోగ్యం, బంగారు ఆభరణాలు, ఐటీ సెక్టారు, పత్రిక, టెలికాం సెక్టారు ఇలా పలు రంగాల్లో యువత నైపుణ్యాలు ఒడిసిపట్టుకోవడానికి ఈ అంతర్జాలం దోహదం చేస్తుంది. దేశంలో పేరొందిన నిపుణులు ఆయా రంగాల్లో అవసరమైన మార్గనిర్దేశం చేస్తారు. మనకు ఏ రంగంలో ఆలోచన వచ్చిందో అది ఎంచుకుని నిపుణులతో పంచుకుంటే అవసరమైన సూచనలు, సలహాలు అందుకోవడానికి వీలుంటుంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యువత నైపుణ్యాలు అలవర్చుకోవాలి. అందుకోసం అందుబాటులో ఉన్న అంతర్జాలాన్ని వేదికగా చేసుకోవాలి. కళాశాల దశ నుంచి విభిన్నంగా ఆలోచించాలి. ఐటీ సంస్థలు యువతలో సమాచార నైపుణ్యాలు, కొత్త ఆలోచనలకు పెద్దపీట వేస్తున్నాయి. ఆ దిశగా ముందుకు సాగాలి.

– చాముండేశ్వరరావు, నైపుణ్యాభివృద్థి సంస్థ ప్రబంధకుడు, విజయనగరం