News

Realestate News

ఇళ్లయినా.. ఫ్లాటైనా అటు చూడాల్సిందే!

ఇళ్లయినా.. ఫ్లాటైనా అటు చూడాల్సిందే!
జోరందుకున్న స్థిరాస్తి లావాదేవీలు

ఈనాడు, హైదరాబాద్‌

పెద్ద నోట్ల ఉపసంహరణ, జీఎస్‌టీ, రెరా వంటివన్నీ వచ్చినా స్థిరాస్తి మార్కెట్‌కు డిమాండ్‌ తగ్గలేదు. రెండు మూడు నెలలుగా వినియోగదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి లావాదేవీలు జోరందుకున్నాయి. పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూరగొనడంతో మార్కెట్‌లో నూతన ప్రాజెక్ట్‌లు ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. కార్యాలయ స్థలాలు, వాణిజ్య కేంద్రాల్లో బుకింగ్స్‌ పెరిగాయి.

కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో నెలల వ్యవధిలోనే స్థిరాస్తి ధరలు ఎగబాకుతున్నాయి. ఆరునెలల క్రితానికి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మార్కెట్లో వృద్ధి నమోదైంది. కొన్నిచోట్ల కృత్రిమ డిమాండ్‌ సృష్టించి ధరలు అమాంతం పెంచితే.. మరికొన్ని ప్రాంతాల్లో వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. క్రమంగా పెరుగుతున్న చోట చూస్తే ఇప్పటికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. ఇక అందే ధరల్లో ఉన్న ప్రాంతాల్లో చూస్తే ఆరు మాసాల కిందకు నేటికీ ధరలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ పరిణామాలతో సామాన్య, మధ్యతరగతి వాసులు కొత్త ప్రాంతాల వైపు చూస్తున్నారు.

మెట్రో కారిడార్‌ వెంట..
* మియాపూర్‌-ఎల్‌బీనగర్‌, నాగోల్‌- రాయదుర్గం, ఇమ్లిబన్‌ నుంచి జేబీఎస్‌ మార్గాల్లో మెట్రో వస్తుండడంతో అటుగా ఫ్లాట్లకు మంచి డిమాండ్‌ ఏర్పడింది. నాణ్యమైన నిర్మాణాల వైపు చూస్తున్నారు. ః స్థలాల విషయానికి వస్తే మెట్రో స్టేషన్ల నుంచి చుట్టుపక్కల 10 కి.మీ వరకు సొంతింటికి మొగ్గుచూపుతున్నారు. దూరమైనా కొనే స్థాయిలో ధరలు ఉండడమే కారణం.

బాహ్యవలయ రహదారి చుట్టూ..
బాహ్య వలయ రహదారి వైపు స్థిరాస్తి మార్కెట్‌ దూసుకెళుతోంది. స్థలాలు కొనాలంటే అక్కడివరకు వెళ్లక తప్పదు.
* వరంగల్‌ హైవే మార్గంలో ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టడం.. ఐటీ కంపెనీలు విస్తరణ చేపడుతుండడంతో ప్రస్తుతం ఎక్కువమందిని ఈ మార్గం ఆకర్షిస్తోంది.
* నాగార్జునసాగర్‌ హైవే మార్గంలో ఏరో సెజ్‌లు ఉండడం, కొత్త కంపెనీలు విస్తరణ.. విమానాశ్రయం చేరువలో ఉండడం వంటి అంశాలతో కొనుగోలుదారులు చూస్తున్నారు.
* బెెంగళూరు జాతీయరహదారి ప్రాంతంలో అంతర్జాతీయ సంస్థల వేర్‌హౌస్‌ల నిర్మాణం.. పరిశోధన సంస్థల వంటి వాటితో ఇక్కడ మార్కెట్‌ క్రమంగా పుంజుకుంది.
* ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ చుట్టుపక్కల స్థిరాస్తి మార్కెట్‌ మునుపటి జోష్‌లో సాగుతోంది. డిమాండ్‌ ఉండడంతో పెద్ద స్థిరాస్తి సంస్థల ప్రాజెక్ట్‌లన్నీ ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నాయి.

అందుబాటులో ఉండాలంటే..
* మీరు ఉంటున్న చోటుకు కొద్ది దూరం వెళ్తే వృద్ధికి ఆస్కారమున్న ప్రాంతాలు కన్పిస్తాయి. ధరలు అందుబాటులో ఉంటాయి.
* ఇప్పటికే శివార్లలో ఉంటున్నవారు భవిష్యత్తులో తాము ఇక్కడ ఉండమనే కారణంతో ఆ ప్రాంతం గురించి పెద్దగా ఆలోచించరు. మీరు అక్కడ తాత్కాలికంగా ఉంటున్నా.. స్థిరాస్తిలో మదుపు అవకాశాన్ని జార విడుచుకోవద్దు. వెళ్లేటప్పుడు అమ్మేసి అవసరమైతే మరోచోట తీసుకోవచ్చు.
* వేగంగా వృద్ధికి ఆస్కారమున్న చోట మినహాయిస్తే.. ఫలానా చోటే కొనుగోలు చేస్తాననే స్థిర నిర్ణయంతో ఉండొద్దు. ఆ ప్రాంతంలో ధర ఎక్కువ ఉంటే తక్కువకు వస్తుందేమోననే ఎదురుచూపులు ఎక్కువకాలం వద్దు. ఉన్న మొత్తంతో మరో చోట కొనుగోలు చేస్తే ఆ మేరకు వృద్ధి ఉంటుంది.

పరిశీలన ముఖ్యం
* తక్కువ ధరకు వస్తుందని.. భూముల పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకోకుండా కొనుగోలులో తొందరపడవద్దు.
* ఒకటి చూసి వద్దనుకుంటే మరొకటి కొనడానికి జాప్యం చేయకుండా వెంటవెంటనే ప్రయత్నిస్తేనే ప్రతిఫలం దక్కుతుంది. కనీసం అనుకున్న ధరలోనైనా దొరుకుతుంది.
* అనూహ్యంగా ధరలు పెరిగిన చోట తప్ప స్థిరాస్తిలో ఎక్కడ మదుపు చేసినా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. మార్కెట్‌ స్థితిగతులు గమనిస్తూ.. తెలివిగా పెట్టుబడి పెట్టగల్గితే మేలే.