ఇనుమడించిన దేశభక్తి

139 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ
మహారాణిపేట, న్యూస్టుడే: స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 139 జయంతి వేడుకలు మంగళవారం పాతనగరంలోని శ్రీస్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా 139 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పాతనగరంలోని పాతపోస్టాఫీసు, విక్టోరియా రాణి బొమ్మ, వాడవీధి, లక్ష్మిటాకీస్, కొత్తరోడ్డు తదితర ప్రాంతాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు జహీర్ అహ్మద్, యువభారత్ ఫోర్స్ అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ సాదిక్ మాట్లాడుతూ తెలుగు జాతికే కాకుండా యావత్తు దేశానికే ఖ్యాతి తెచ్చిన పింగళి వెంకయ్యకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని, పార్లమెంట్లో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ జెండా రూపశిల్పికి తగిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యాయవాది కె.సూర్యనారాయణ, డీఎస్ అగర్వాల్, ఎస్.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.