ఇదిగో పైవంతెన!

ఇంగ్లండ్ తరహా నమూనాకు యంత్రాంగం ఆమోదం
నిర్మాణ వ్యయం రూ. 140 కోట్లు
ముఖ్యమంత్రి అనుమతే ఇక తరువాయి
ఎన్ఏడీ రద్దీకి పరిష్కారం
ఈనాడు – విశాఖపట్నం
ఒక రోజులో….లేదా 24 గంటల్లో…
ఒక ప్రయివేటు సంస్థ తాజాగా ఎన్ఏడీలో వారం రోజులపాటు అధ్యయనం చేసి ఇచ్చిన నివేదికలోని కీలకాంశాలు..
1,13,482
ఎన్ఏడీ కూడలి మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలు
33,125
నగరం నుంచి ఎన్ఏడీ మీదుగా బయటకు వెళ్తున్న వాహనాలు
17,731
విమానాశ్రయం మీదుగా గాజువాకవైపు జాతీయరహదారిపై వెళ్తున్న వాహనాలు
30,149
ఇతర ప్రాంతాల నుంచి విమానాశ్రయం మీదుగా నగరంలోకి వస్తున్న వాహనాలు
16,616
నగరం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్తున్న వాహనాలు
* నగరం నుంచి ఇతర ప్రాంతాలకు ఎన్ఏడీ కూడలి మీదుగా రోజూ వెళ్లేవి 33,125 వాహనాలైతే, వీటిలో అత్యధికంగా 17,731 వాహనాలు విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు గుర్తించారు. మిగిలినవి సింహాచలం, కొత్తవలస, మర్రిపాలెం వైపు వెళ్తున్నాయి.
* ఇటు మర్రిపాలెం, అటు సింహాచలం, కొత్తవలస, ఇంకో వైపున నగరం నుంచి ఎన్ఏడీ కూడలి, విమానాశ్రయం, గాజువాక మీదుగా రోజూ 30,015 వాహనాలు బయటకు వెళ్తున్నాయి.
* రోజూ నగరం నుంచి బయటకెళ్తున్న వాహనాల సంఖ్యే అధికంగా ఉంది.
* ట్రాఫిక్ నియంత్రణకు పైవంతెన నిర్మాణమే పరిష్కారమన్న నిపుణుల బృంద నివేదికపై జిల్లా యంత్రాంగం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వశాఖల అధికారులతో సమావేశమైన తరువాత ప్రతిపాదనలను ఆమోదించింది.
నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఎన్ఏడీ కూడలిలో ట్రాఫిక్ సమస్య తీరబోతోంది. ఇక్కడ పైవంతెన నిర్మాణం కోసం రూ. 140 కోట్లతో రూపొందించిన నమూనాకు జిల్లా స్థాయిలో ఆమోదం లభించింది. తుది నిర్ణయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు అధికారులు తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి అనుమతి రాగానే తదుపరి చర్యలు మొదలవుతాయి.
జాతీయరహదారిపై ఉన్న ఎన్ఏడీ కూడలిలో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఎక్కువ. నగరం నుంచి విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. నగరంలోకి చేరుకోవాలన్నా ఇదే కీలక మార్గం. ఇటు సింహాచలం వెళ్లే భక్తులకూ ఇదే ప్రధాన మార్గం. దీంతో 24 గంటలూ రద్దీగా ఉంటోంది.
ఇక్కడి ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాలపై జిల్లా యంత్రాంగం గత రెండు, మూడు నెలలుగా కసరత్తులు చేస్తోంది. సమగ్ర అధ్యయన బాధ్యతలను ఒక ప్రయివేట్ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇది పైవంతెన నిర్మాణం కోసం నాలుగు నమూనాలు (డిజైన్లు) తయారు చేసింది. వీటిని 20 రోజుల క్రితం విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)కు అందజేసింది. ఇందులో రూ. 140 కోట్లతో ప్రతిపాదించిన ఒక నమూనాను ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ డాక్టర్ యువరాజ్, వుడా ఉపాధ్యక్షుడు డాక్టర్ వి. బాబూరావునాయుడి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ పరిశీలించి ఆమోదించింది. ఈ నెల 23న వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ నమూనాను తీసుకెళ్లి అనుమతి తీసుకోవాలని అధికారులు యత్నించినా సమయాభావంతో సాధ్యం కాలేదు. ఈ నమూనాను విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి ఆమోదం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో ఇప్పటికే ఈ తరహా నమూనాలో నిర్మించిన పైవంతెన వాహన చోదకులకు ఎంతో వెసులుబాటుగా ఉంది. ఇదే నమూనా ఎన్ఏడీ కూడలిలో ట్రాఫిక్ సమస్యకు సరైన పరిష్కారమవుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
పైవంతెన నమూనా ఇలా….
* ఎన్ఎస్టీఎల్ నుంచి ఎన్ఏడీ మీదుగా రైల్వే వంతెన సమీపం వరకు జాతీయ రహదారికి 7 మీటర్ల అడుగున 550 మీటర్ల పొడవున అంతర్గత మార్గాన్ని (అండర్ పాస్) ఏర్పాటు చేస్తారు. ఆశీల్‌మెట్ట పైవంతెన దిగువన రామాటాకీస్ నుంచి జగదాంబకు వెళ్లేందుకు నిర్మించిన తరహాలోనే ఎన్ఏడీలోనూ అంతర్గత మార్గాన్ని నిర్మిస్తారు. దీంతో నగరం నుంచి ఎన్ఎస్టీఎల్ మీదుగా విమానాశ్రయం వైపునకు వెళ్లే వాహనాలు అంతర్గత మార్గంలోంచి వెళతాయి. అటు వైపు నుంచి కూడా వాహనాలు ఎన్ఏడీ కూడలి దాటుకొని ఎన్ఎస్టీఎల్ వరకు వచ్చేలా డిజైన్ రూపొందించారు.
* అంతర్గత మార్గానికి 7 మీటర్ల ఎత్తులో మర్రిపాలెం నుంచి సింహాచలం వైపు 1100 మీటర్ల పొడవున పైవంతెన నిర్మిస్తారు. దీంతో ఈ రెండు మార్గాల్లో రద్దీ పూర్తి నియంత్రణలోకి వస్తుంది. ఈ వంతెనపైన మరో 4 మీటర్ల ఎత్తులో మెట్రో వంతెన రావొచ్చని అధికారుల అంచనా. ఈ మేరకు మాత్రమే అనుమతులిస్తున్నట్లు తెలుస్తోంది.
* అంతర్గాత మార్గానికి, మర్రిపాలెం – సింహాచల మధ్య నిర్మించే పైవంతెనకు మధ్యలో 4 మీటర్ల పొడవునా రోటరీ రానున్నది. 12 మీటర్ల వెడల్పులో నిర్మించే ఈ రోటరీ మీదుగా ఎన్ఎస్టీఎల్ పక్క నుంచి సర్వీసు రోడ్లలో వచ్చే కార్లు, బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అటు సింహాచలం వైపునకు, ఇటు మర్రిపాలెంనకు వెళ్లొచ్చు. ఈ రోటరీకి ఇప్పుడున్న పాత రోడ్లును అనుసంధానం చేస్తారు.
నిధుల సమీకరణ బాధ్యత వుడాదే
ఈ పైవంతెన నిర్మాణం వ్యయాన్ని విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంబంధిత వర్గాలకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. వివిధ వ్యాపారాల రూపంలో నిధులు సమీకరించి ఇలాంటి కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు వుడా అధికారులు ప్రభుత్వం కేటాయించిన భూముల వినియోగంపై దృష్టి సారిస్తున్నారు. వీటిలో మరిన్ని లేఅవుట్లు వేసి స్థలాలను విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని పైవంతెన కోసం కేటాయించాలని అధికార వర్గాలు భావిస్తున్నాయి.