News

Realestate News

ఇక ఆకాశమే హద్దు

ఇక ఆకాశమే హద్దు
త్వరలో అందుబాటులోకి విదేశీ కార్గో
నిర్వహణకు ముందుకొచ్చిన ఏపీఎస్‌టీసీ
లాభం పొందేందుకు శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ వ్యూహం
ఈనాడు, విశాఖపట్నం
రూ. 7 వేల కోట్లు..విశాఖ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కార్గో సర్వీసు మొదలైతే ఏటా ఎగుమతయ్యే సరకుల విలువ ఇది.అతి త్వరలోనే ఈ సర్వీసు మొదలుకాబోతోంది. వాణిజ్య హబ్‌గా ఎదుగుతున్న విశాఖ చరిత్రలో ఇదో కీలక పరిణామం.

ఫార్మా ఉత్పత్తుల జోరు..:
ఫార్మా పరిశ్రమ ప్రధాన కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందుతోంది. పలు కంపెనీలకు ఎఫ్‌డీఐ అనుమతులూ ఉన్నాయి. భవిష్యత్తులో మరికొన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్పత్తులను హైదరాబాదుకు తరలించి అక్కడ్నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. త్వరలో మెడిటెక్‌ పార్కు కూడా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో.. విశాఖ విమానాశ్రయం నుంచి ఫార్మాఉత్పత్తులు పెద్దఎత్తున తరలే అవకాశం ఉందని చెబుతున్నారు. లండన్‌, ప్యారిస్‌లాంటి యూరప్‌ ప్రాంతాలకు ప్రస్తుతం డిమాండ్‌ ఉంది. వైద్య పరికరాలకు ఎక్కడెక్కడ డిమాండ్‌ ఉందో పరిశీలనలు జరుగుతున్నాయి.

విశాఖ విమానాశ్రయం నుంచి విదేశీ కార్గో సేవల్ని అందించేందుకు ఏపీ స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ లిమిడెట్‌ (ఏపీఎస్‌టీసీ) ముందుకొచ్చింది. ఆసక్తి వ్యక్తీకరణ విధానంలో ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ అంగీకరించింది. అన్నీ అనుకూలిస్తే మరో నెలరోజుల్లోనే విశాఖ నుంచి వివిధ దేశాలకు కార్గో సేవలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఏపీఎస్‌టీసీ సహా వివిధ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు విశాఖ నుంచి విదేశీ కార్గోకు ఎంత డిమాండ్‌ ఉందో పరిశీలనలు చేశాయి. ఈ నగరం భవిష్యత్తులో పారిశ్రామికంగా, తయారీరంగపరంగా మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని తేలింది. ఇక్కడి ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉందని, ఇది కార్గో వాణిజ్యానికి వూతమిస్తుందని స్పష్టమైంది.

చేపలు, రొయ్యలకు ఎంతో గిరాకీ..:
సముద్రజీవుల ఉత్పత్తులకు కోస్తాంధ్ర పెట్టింది పేరు. వీటిని ప్రస్తుతం చెన్నై, కొచ్చిన్‌ విమానాశ్రయాల ద్వారా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశీ కార్గో అందుబాటులోకి వస్తే ఈ లావాదేవీలన్నీ విశాఖ నుంచే కొనసాగుతాయి.

కోస్తా తీరంలో ట్యూనా చేపలు విరివిగా దొరుకుతున్నాయి. జపాన్‌లాంటి దేశాలు ఈ చేపను కిలో రూ. 16 వేలకు కొంటున్నాయి. అవి పట్టుబడిన 48 గంటల్లోపే రవాణా చేస్తేనే ఈ ధర లభిస్తుంది. ఆలస్యమైతే ధర తగ్గిపోతుంది.

ఉత్తరకోస్తాంధ్ర నుంచి రొయ్యపిల్లల ఎగుమతి భారీగా జరుగుతోంది. యూరప్‌ సహా పలు ఆసియా దేశాల్లో మంచి గిరాకీ ఉంది. లావాదేవీలన్నీ జనవరి నుంచి ఆగస్టు మధ్యే ఉంటాయి. ప్రస్తుతం వీటిని విశాఖ విమానాశ్రయం నుంచి కోల్‌కతా, భువనేశ్వర్‌, చెన్నై, హైదరాబాద్‌, ముంబయికి తరలించి.. అక్కడ్నుంచి ఏజెంట్ల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇతర బతికున్న చేపలు, పీతలకూ మధ్యప్రాచ్య దేశాలు, దుబాయ్‌లాంటి ప్రాంతాల్లో మంచి గిరాకీ ఉంది. విదేశీ కార్గో అందుబాటులోకి వస్తే ఈ మొత్తం ఎగుమతులన్నీ విశాఖ నుంచే ఉంటాయి.

బంగారం నుంచి కూరగాయల వరకు..
బంగారం, వజ్రాల ఎగుమతి కీలకంగా మారింది. ప్రత్యేకించి సింగపూర్‌లాంటి దేశాల్లో ఎక్కువ గిరాకీ ఉన్నట్టు తేలింది. అంతర్జాతీయ విమానాల సర్వీసులు మరిన్ని దేశాలకు విస్తరిస్తే నగరం కేంద్రంగా ఈ వ్యాపారం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలనల్లో తేలింది.

విశాఖ చుట్టుపక్కల పండుతున్న పళ్లకూ విదేశీ మార్కెట్లు అనుకూలంగా ఉన్నాయి. మన ప్రాంత మామిడిని కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌లాంటి దేశాల ప్రజలు ఇష్టంగా తింటున్నారు. ఈ డిమాండ్‌ తగ్గట్టుగా కొంతమంది వ్యాపారులు ఇక్కడి నుంచి పండ్లను చెన్నై, హైదరాబాద్‌ విమానాశ్రయాలకు తరలించి ఎగుమతి చేస్తున్నారు.

ఇప్పటికే విశాఖ విమానాశ్రయం నుంచి అండమాన్‌కు కూరగాయలు పెద్దఎత్తున తరలుతున్నాయి. వంకరగా లేని మిర్చి, నాణ్యమైన ఆకుకూరలను ఒకే రోజులో చేర్చగలిగితే ఇతర దేశాల్లోనూ గిరాకీ ఉంటుందని తేలింది.

ఈ అవకాశం కోసమే ఉన్న శ్రీలంక..
శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు జులై 8 నుంచి విశాఖ విమానాశ్రయం నుంచి శ్రీలంకకు సేవలు అందించనున్నాయి. విదేశీ కార్గో సేవలుంటేనే విమానాల్ని నడిపేందుకు ముందుకొస్తామని శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్‌ ఇదివరకే మెలిక పెట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే నెలరోజుల్లోనే విదేశీ కార్గో సేవలను ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ నుంచి డిమాండ్‌ ఉన్న మార్కెట్‌ను తాము అందిపుచ్చుకోవాలన్నది శ్రీలంక వ్యూహం. ఇప్పటికే ఆ దేశం రవాణా హబ్‌గా ఎదిగింది. అక్కడి నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు విమానాల ద్వారా సరుకులు రవాణా అవుతున్నాయి. శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యేక కార్గో వ్యవస్థ కూడా ఉంది. విశాఖ నుంచి వివిధ ఉత్పత్తులను శ్రీలంకకు తరలించి.. అక్కడి నుంచి ఆయా దేశాలకు రవాణా చేయాలన్న ఉద్దేశంతో ఆ ఎయిర్‌లైన్స్‌ సంస్థ పథకరచన చేస్తోంది.

ఇప్పటికి తరలిస్తోంది 10 శాతమే..
ప్రస్తుతం విశాఖలో దేశీయ కార్గో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక్కడినుంచి సరుకుల్ని దేశంలోని వివిధ విమానాశ్రయాలకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా వెళ్తున్నది కేవలం పదిశాతమే. మిగిలిన 90 శాతం భూమార్గం ద్వారా చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతాకు పంపిస్తున్నారు. అక్కడి నుంచి వాయుమార్గంలో విదేశాలకు తరలిస్తున్నారు. ఇది కాలయాపనకు దారితీస్తోంది. దీన్ని పరిహరించడానికి ఏపీఎస్‌టీసీ విదేశీ కార్గో కోసం కసరత్తు చేస్తోంది.

అవగాహన పెరగాల్సి ఉంది
విదేశీ ప్రమాణాలకు తగ్గట్లు ఉత్పత్తుల్ని రూపొందించడంలో వ్యాపారుల్లో అవగాహన పెంచాలి. ఇందుకోసం ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయం నుంచి నెలకు 500 టన్నులకు పైగా సరకు దేశంలో వివిధ విమానాశ్రయాలకు తరలుతోంది. ఇక్కడి ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది.

– డి.శ్రీరామమూర్తి, ఏజీఎం, డెలెక్స్‌ (దేశీయ కార్గో నిర్వాహకులు)

అరకు కాఫీని ప్రోత్సహిద్దాం..
విశాఖలోని అరకు కాఫీకి ఎంతటి డిమాండ్‌ ఉందో అందరికీ తెలుసు. దీనికి విదేశాల్లో గిరాకీ సృష్టించి అక్కడికి ఎగుమతి చేసేలా విదేశీ కార్గోను వాడుకోవచ్చు. రాష్ట్రంలో చేతివృత్తుల పరిశ్రమలనూ ఈ తరహాలో వృద్ధి చేయాల్సిన అవసరముంది. భవిష్యత్తులో బ్యాంకాక్‌, అబుదాలకూ విదేశీ సర్వీసులు రానున్నాయి.

– డి.వరదారెడ్డి, అధ్యక్షుడు, ఏటీఏ-ఐ