ఇంట్లో నుంచే ఈసీ.. సీసీ!
ఆన్లైన్ విధానానికి జనం నుంచి సానుకూల స్పందన
ఈనాడు,విశాఖపట్నం

కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. చేతులు తడపాల్సిన పని లేదు.. పౌర సేవల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాలి.. ఇదీ ప్రభుత్వ ఉద్దేశం. ఈ క్రమంలోనే వివిధ సేవలను ఆన్లైన్ పరిధిలోకి తెస్తోంది. రిజిస్ట్రేషన్ సేవలను సైతం సరళతరం చేసిన ప్రభుత్వం ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), సర్టిఫికెట్ కాపీ (సీసీ) ఇతర నకళ్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానానికి ఇప్పుడిప్పుడే ప్రజలు అలవాటు పడుతున్నారు. మొదట్లో పదుల సంఖ్యలో ఉన్న దరఖాస్తులు ఇప్పుడు వందల సంఖ్యలోకి చేరాయి. దీనికితోడు దస్తావేజు రాత, చలానా.. అన్నీ ఆన్లైన్లోనే నేరుగా చేసుకోవచ్చు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. గంటల తరబడి నిరీక్షించకుండా.. దస్తావేజు లేఖర్లను, దళారులను ఆశ్రయించకుండా.. చివరికు మీ- సేవ కేంద్రానికీ వెళ్లనవసరం లేకుండా ఇంటి నుంచే ఆన్లైన్లో ఈసీ, సీసీ పొందొచ్చు.
ఆన్లైన్లో ఉచితంగా..
ఒక ఆస్తి ఎవరి పేరుతో ఉంది..? గతంలో దాన్ని అమ్మింది ఎవరు..? కొనుగోలు చేసింది ఎవరు..? ప్రస్తుతం ఆ ఆస్తి యజమాని ఎవరు..? తదితర వివరాలు ఈసీలో ఉంటాయి. ఆ ఆస్తికి సంబంధించి మరో కాపీ కావాలంటే సీసీ కావాలి. అందుకోసం సీసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఇదివరకు మీ- సేవ కార్యాలయంలోగానీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోగానీ రూ. 200 చెల్లించి ఈసీగానీ, నకలుగానీ తీసుకునేవారు. ఇకపై ఆన్లైన్లో rgistration.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా ఉచితంగా పొందొచ్చు. వివరాలు పొందుపరిస్తే ఈసీ డాక్యుమెంట్లు సిద్ధం చేస్తారు. ఆన్లైన్లో వివరాలు సమర్పించడం వల్ల సబ్రిజిస్ట్రార్కార్యాలయ ఉద్యోగులకు సమయం కలిసి రావడంతోపాటు.. ఇటు ప్రజలకు అదనపు బాదుడు బెడద తప్పుతుంది. అనిశా, సీఐడీ, సీబీఐ కేసుల సమయంలో నేరుగా శాఖ వెబ్సైట్ నుంచి సమాచారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖకూ ఆన్లైన్ వివరాలు ఉపయోగపడనున్నాయి. తనఖా పత్రాలు, దస్తావేజులు, అమ్మకం, వీలునామా, గిఫ్ట్డీడ్లకు సంబంధించిన నకళ్లను ఇదే తరహాలో తీసుకోవచ్చు. డాక్యుమెంటు నంబరు కొడితే వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ప్రక్రియకు నగరం నుంచి స్పందన బాగున్నా.. గ్రామీణ జిల్లా నుంచి అంతంత మాత్రంగానే ఉంది. ఆన్లైన్ సేవలపై ప్రజలకు ఆశించిన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. కొందరికి అవగాహన ఉన్నా ఈ జోలికి వెళ్లని పరిస్థితీ ఉంది.
డాక్యుమెంటు తయారీకి వెనకడుగు..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ రోజుల తరగబడి తిరగకుండా.. గంటల తరబడి నిరీక్షించకుండా.. దస్తావేజుల రాత, చలానా అన్నీ ఆన్లైన్లోనే చేసుకునే వెసులుబాటును సర్కారు కల్పించింది. కొనబోయే ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి.. లేఖరితో దస్త్రం తయారు చేసుకుని.. విలువ ఎంతో తెలుసుకుని చలానా కట్టాల్సి వచ్చేది. ఇపుడు ఆన్లైన్లో నేరుగా ప్రజలే దస్తావేజు రాసుకునే అవకాశం ఉంది. కొన్ని ఖాళీలు నింపితే ఆ ప్రక్రియ పూర్తవుతుంది. వెబ్సైట్లో అమ్మకం, లీజు దస్రావేజులు, ఒప్పందం ఇలా.. పలు వివరాలు ఉంటాయి. ఏది అవసరమైతే అది క్లిక్ చేసి అందులో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలి. సేల్ అగ్రిమెంటు అయితే అమ్మే, కొనే వారి ఆధార్ సంఖ్యలు అప్లోడ్ చేస్తే చిరునామాలు, వివరాలు, హద్దులు వాటంతట అవే వచ్చేస్తాయి. వాటిని పొందుపరిస్తే దస్తావేజు
సిద్ధమవుతుంది.. రిజిస్ట్రేషన్ విలువ ఎంత..? చలానా ఎంత కట్టాలి..? అనేది ఆన్లైనేలోనే చెబుతుంది.. క్రెడిట్, డెబిట్ కార్డుతో ఈ మొత్తం చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఆ పత్రాలు ప్రింటు తీసుకుని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి దగ్గరకు వెళ్తే వాటిని సరిచూస్తారు. ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే సూచిస్తారు. అప్పుడు నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ అంశంపై ముందుకెళ్లడానికి ప్రజలు సాహసించడం లేదు. కొత్త విధానం అమల్లోకి వచ్చి మూడు వారాలు గడుస్తున్నా ఆన్లైన్లో ఒక్క రిజిస్ట్రేషనూ జరగలేదు. నగరంలో, గ్రామీణ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఈసీ, సీసీలకు మాత్రం ముందుకొస్తున్నారు. భూములకు సంబంధించి రూ.కోట్లతో కూడిన లావాదేవీలు కావడంతో అధిక శాతం మంది పాత పద్ధతినే అనుసరిస్తున్నారు. దీనిపై మరింత అవగాహన కల్పించాల్సి ఉంది.
పారదర్శకత కోసమే ఆన్లైన్ సేవలు
రిజిస్ట్రేషన్ శాఖ సేవల్లో దళారుల ప్రమేయం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరింత పారదర్శకత పెంచేందుకు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆన్లైన్లో ఈసీ, సీసీ సేవలను ఉచితంగా అందిస్తున్నాం. దస్తావేజు లేఖర్ల ప్రమేయం లేకుండా ఆన్లైన్లోనే దస్తావేజులు తయారు చేసుకునే సౌలభ్యమూ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రక్రియ చాలా సులభతరంగా రూపొందించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈసీలు, సీసీలపై వస్తున్న దరఖాస్తుల సంఖ్య మొదటి కంటే బాగా పెరిగింది. 24 గంటల్లో వీటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.