ఆసియా, ప్రపంచ పోటీలకు స్కేటింగ్ క్రీడాకారుల ఎంపిక

ఏయూ ప్రాంగణం, న్యూస్టుడే: ఆసియా, ప్రపంచస్థాయి స్కేటింగ్ పోటీల్లో పాల్గొనబోయే క్రీడాకారుల ఎంపికకు విశాఖపట్టణం వేదికైంది. గత మూడు రోజులుగా క్రీడాకారుల ఎంపికను రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలోని వుడా పార్కు, బీచ్ రోడ్లలో నిర్వహిస్తున్నారు. ఆసియా, ప్రపంచ పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఉండాలి. ప్రతి విభాగంలోనూ 8మందిని ఎంపిక చేస్తామని ఆర్.ఎఫ్.ఎస్.ఐ. రిఫరీ, రాష్ట్ర కోచ్ కరణం గంగాధర్ తెలిపారు. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఏపీ, పంజాబ్, దిల్లీ, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. రింక్లోనే కాకుండా రహదారులపై కూడా స్కేటింగ్ తీరును పరిశీలించాల్సి ఉండడంతో బీచ్రోడ్లో బుధవారం ఎంపిక కసరత్తు జరిగింది. విశాఖ నుంచి ఎం.తేజశ్వి, సంజనారెడ్డి, నిఖిల్ మానస తదితరులు పోటీ పడుతున్నారు. గురువారం కూడా బీచ్రోడ్లో ఎంపికలు జరగనున్నాయి. ఎంపిక కమిటీ ప్రతినిధులు బగీరథ్ కుమార్, సెబాస్టియన్, పి.కె.సింగ్ తదితరులు పాల్గొన్నారు.