ఆలయానికి పయనమైన జగన్నాథుడు
భక్తిశ్రద్ధలతో తిరుగు రథయాత్ర

ఉక్కునగరంలో…
ఉక్కునగరం: ఉక్కునగరం సెక్టారు-9లో కొలువైన పూరీజగన్నాథ, బలభద్ర, సుభద్ర ఆలయాల ప్రాంగణంలో సోమవారం జగన్నాథస్వామి తిరుగు రథయాత్ర ఘనంగా జరిగింది. ముందుగా ఉక్కు సీఎండీ పి.మధుసూదన్ దంపతులు బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుగు రథయాత్ర (బహుడా యాత్ర)ను ప్రారంభించారు. భక్తులు భజనలు, కోలాటాలు, ఒడిశా సంప్రదాయ నృత్యాలతో స్వామిని వూరేగించారు.
గోకుల నందనుడిగా జగన్నాథుడు
పూర్ణామార్కెట్, న్యూస్టుడే: టర్నర్ సత్రం గుండిచాదేవి ఆలయంలో జరుగుతున్న జగన్నాథ రథోత్సవాల్లో భాగంగా స్వామివారు సోమవారం భక్తులకు శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. పాయకరావుపేట శ్రీపాండురంగస్వామి ఆలయం నుంచి ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఆలయ సిబ్బంది పట్టు వస్త్రాలను సమర్పించారు.