ఆరోగ్యానికి ‘అండ’దండ

పోషకాలు పుష్కలం.. తింటేనే ప్రతిఫలం
రోజుకో గుడ్డు తినడం మరవొద్దు..!
నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం (ఎగ్ డే)
-న్యూస్‌టుడే, గాజువాక, వన్‌టౌన్
ఏటా అక్టోబరు రెండో శుక్రవారం ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1996లో వియన్నాలో జరిగిన ప్రపంచ గుడ్డు సదస్సులో ఈ వేడుక జరపాలని నిర్ణయించారు. బ్రిటన్, డెన్మార్క్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రజల ఆహారంలో గుడ్డు తప్పనిసరిగా ఉంటే ఆరోగ్యానికి మంచిది అనే విషయంపై అవగాహన పెంచాలన్న ఉద్దేశ్యంతో ఈ వేడుకను జరుపుతున్నారు.
ఆరోగ్యానికి మేలు
* రోజూ ఆహారంలో భాగంగా గుడ్డు తీసుకుంటే… రక్తనాళాలు, గుండెజబ్బులు దరి చేరవని అనేక పరిశోధనల్లో తేలిందని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డులో ఉండే పోషకాలు రక్తం గడ్డకట్టడాన్ని అదుపులో ఉంచుతాయి. దానిలో లభించే కెరొటినాయిడ్లు, ట్యూటిన్, జెక్సాంతిన్ అనే పోషకాలు కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
* ఒక గుడ్డులో లభించే ప్రోటీన్ మానవ శరీరంలోని తొమ్మిది రకాల అవయవాల పనితీరుకు అవసరమైన అమీనో ఆమ్లాలను అందిస్తుంది.
* గుడ్డులోని పచ్చసొనలో 300 మైక్రోగ్రాముల కొలైన్ లభిస్తుంది. ఈ పోషకం మెదడు పనితీరుకు, నరాల వ్యవస్థ బలంగా ఉండడానికి దోహదపడుతుంది.
* గుడ్డు శరీరంలో హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అయితే ఇది శరీరానికి మేలు చేసే కొవ్వు పదార్థం.
* విటమిన్-డి సహజంగా దొరికే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు ఒకటి. వారంలో కనీసం ఆరు కోడిగుడ్లు తింటే… మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 44 శాతం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.
నగరంలో అవగాహన పెరగాలి
ఇన్ని పోషకాలు ఉన్న గుడ్డును వినియోగించడంలో మహావిశాఖలో ఇంకా చాలా మందికి అవగాహన పెరగాల్సి ఉంది. సుమారు 20 లక్షల జనాభా ఉన్న మహానగరంలో… గుడ్డు వినియోగిస్తున్న వారి సంఖ్య సగం దాటడం లేదంటే… పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. శరీరానికి ఆరోగ్యాన్ని అందించే వాటిలో పాలు మొదటి స్థానంలో ఉంటే… రెండోది గుడ్డు. దీనిపై ఇంకా ప్రజల్లో ఆరోగ్యస్పృహ కలగకపోవడంపై ఆందోళనకరమని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలల ఆరోగ్యమే ప్రదానం
* జిల్లా వ్యాప్తంగా 3,221 ప్రాథమిక, 371 ప్రాథమికోన్నత, 494 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 6.62 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారానికి ఓ గుడ్డు అందిస్తున్నారు. ఇటీవలే రోజూ గుడ్డు అందించాలనే ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.86 పైసలు చొప్పున మధ్యాహ్న భోజన పథకం నిర్వహకులకు చెల్లిస్తుండగా… ఇప్పుడు రోజూ గుడ్డు అందించాలన్న ప్రతిపాదనతో రోజుకు రూ.6.50 పైసలు చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
* నగర వ్యాప్తంగా దాదాపు 600 లకు పైగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు వారంలో నాలుగు రోజులు (మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో) గుడ్డు అందిస్తున్నారు. అయితే చిన్నారులు ఉడకబెట్టిన గుడ్డును సరిగ్గా తినలేకపోతున్నారని కొందరు తల్లిదండ్రులు గుడ్లను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఐసీడీఎస్ అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రాల్లోనే కార్యకర్తలు, ఆయాల సాయంతో పిల్లలకు గుడ్డును తినిపిస్తున్నారు.
ఒక గుడ్డు ద్వారా మానవ శరీరానికి అందే పోషకాలు
* కేలరీలు : 80
* ప్రోటీన్లు : 6.30 గ్రాములు
* కార్బోహైడ్రేట్లు : 0.6 గ్రాములు
* మొత్తం కొవ్వు : 5 గ్రాములు
* కొలెస్ట్రాల్ : 213 మిల్లీ గ్రాములు
* సోడియం : 63 మిల్లీ గ్రాములు
గుండె సమస్యలు ఉన్న వారు…
గుడ్డులో మిథలైన్, ఫెరాసీన్, లైసీన్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి శరీర నిర్మాణం పక్కాగా జరగడానికి ఉపయోగపడతాయి. చాలామంది కోడిగుడ్డులో కొవ్వు ఉంటుందని, దాన్ని తినకూడదని అనుకుంటారు. కాని గుడ్డులోని పసుపుసొనలో ఉండే కొవ్వు మానవ శరీరానికి ఉపకరిస్తుంది. అయితే గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు కోడిగుడ్డులో అంతర్లీనంగా ఉండే పసుపురంగు పదార్థాన్ని తినకపోవడమే మంచిది. తెలుపురంగు సొనను ఆహారంగా తీసుకుంటే మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు.
ఓ మంచి మాట
భారత జాతీయ పోషకాహార మండలి సిఫార్సు మేరకు ప్రతి మనిషి సగటున ఏడాదికి 180 కోడిగుడ్లు తినాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలోని ప్రజలు ఏడాదికి తలసరికి 99 గుడ్లు మాత్రమే తింటున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది.
అపోహలు వీడాలి
– షేక్ కైసర్, అధ్యాపకురాలు, గాజువాక
కోడిగుడ్డు అనేది మాంసాహారమన్న అపోహ చాలామందిలో బలంగా ఉంది. పాలు ఎంత స్వచ్ఛమైన శాకాహారమో గుడ్డు కూడా అంతే. ఈ రెండు లైగింక ప్రత్యుత్పత్తి జరిగిన తర్వాత సహజ సిద్ధంగా ఏర్పడినవే. గుడ్డు తింటే మన శరీరానికి 14 రకాల పోషక పదార్థాలు అందుతాయి. శరీర ఎముకలు, చర్మం, పళ్లు, నేత్రాలకు మేలు చేకూరుతుంది. నాణ్యమైన గుడ్లను నీళ్లలో వేస్తే మునుగుతాయి. కుళ్లిన గుడ్లు మాత్రం నీళల్లో తేలుతాయి.
‘పచ్చని’ ఆరోగ్యదాయిని..
డాక్టర్ పైడి హేమలత, వైద్యాధికారి, జీవీఎంసీ
కోడిగుడ్డులో ఉండే పచ్చనిసొన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తింటే కొవ్వు పెరుగుతుందన్నది కేవలం అపోహే. పచ్చసొనలో డీ3 విటమిన్ ఉంటుంది. ఇది శరీరంలోని ఎముకల గట్టిదనానికి దోహదపడుతుంది. గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడకుండా నివారించే లెసిపెన్ అనే రసాయనం పచ్చసొనలో ఉంటుంది. చాలామంది రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం వల్ల అనారోగ్యానికి గురవుతుంటారు. ఇలాంటి వారు గుడ్డు తీసుకుంటే చాలా మంచిది. ప్రజల్లో గుడ్డు ఉపయోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
– డాక్టర్ పి.వేణుగోపాల్, ప్రొఫెసరు, పిల్లల విభాగం, కేజీహెచ్
కోడిగుడ్డులో ఉండే పోషక విలువలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మానవ శరీర అవయవ నిర్మాణంతో సహా శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. పిల్లలకు చిన్నతనం నుంచే రోజుకు ఓ కోడిగుడ్డ తినిపించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే కోడిగుడ్డు తినకపోవడం వల్ల మనిషికి రక్తహీనత సమస్యలతో పాటు నిస్సత్తువు, నిద్రాణం వంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉంది.