News

Realestate News

ఆన్‌లైన్‌లో మరో 40 సేవలు

ఆన్‌లైన్‌లో మరో 40 సేవలు
రవాణా శాఖలో ఏర్పాట్లు
ఈనాడు – విశాఖపట్నం

జిల్లా రవాణా శాఖలో దాదాపు 40 రకాల ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను రవాణా శాఖ సిద్ధం చేసింది. తొలుత ప్రయోగాత్మకంగా పరిశీలించిన అధికారులు అన్నీ అనుకూలిస్తే రెండు రోజుల్లోనే అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. మొత్తం 84 రకాల సేవలను ఆన్‌లైన్లోనే అందుబాటులో ఉంచాలన్నది ఆ శాఖ ఉన్నతాధికారుల లక్ష్యం. పన్నుల చెల్లింపు, ఎల్‌.ఎల్‌.ఆర్‌. స్లాట్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్లాట్‌ పొందడం, డీలర్ల వద్దనే వాహనాల రిజిస్ట్రేషన్‌ విధానాలను ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్నారు. తాజాగా మరో 40 రకాల సేవల కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ఇప్పటికే జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి వచ్చింది.

వాహనాల రిజిస్ట్రేషన్లు ఇంటి నుంచే…
* వాహనదారులు తమ ఫొటో, వేలిముద్రలు, ఆధార్‌కార్డు, ఫోన్‌ నెంబర్లను రవాణా శాఖ కార్యాలయంలో నమోదు చేయించుకుంటే అవసరమైన సేవలన్నీ ఆన్‌లైన్లోనే అందుతాయి. తమ వాహనాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేయించాలనుకున్న వ్యక్తి ఆన్‌లైన్లో రవాణాశాఖకు దరఖాస్తు చేసి తమ వేలిముద్రలు, ఆధార్‌కార్డు వివరాలను అందిస్తే…. వాటి ఆధారంగా అతను అధీకృత వ్యక్తా? కాదా? అని రవాణాశాఖ అధికారులు నిర్ధరిస్తారు. వివరాలన్నీ సరిపోలితే వారు సూచించిన వ్యక్తి పేరిట వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేసేస్తారు. విదేశాల్లో ఉన్నవారు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తమ వాహనాలను ఆన్‌లైన్‌ విధానంలో ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేసేయవచ్చు. వాహనాల రిజిస్ట్రేషన్లను కూడా నిర్ణీత సంవత్సరాల తరువాత పునరుద్ధరించుకోవాలి. అదీ ఆన్‌లైన్లోనే. ఫిట్‌నెస్‌ పరీక్షను మాత్రం రవాణాశాఖ అధికారుల వద్ద చేయించుకోవాలి. భవిష్యత్తులో ‘ఆటోమేటెడ్‌ ఫిట్‌నెస్‌ కేంద్రాలు’ రానున్నాయి. ఇవి వాహనాల సామర్థ్యం ఏమిటన్నది నిర్థరించి సామర్థ్య ధ్రువపత్రాలు ఇస్తాయి.

* ఇప్పటి వరకు రవాణాయేతర వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రమే డీలర్ల వద్ద చేస్తున్నారు. ఇకపై రవాణా వాహనాలను కూడా డీలర్ల వద్దే చేసుకోవచ్చు.
* గడువు తీరిన డ్రైవింగ్‌ లైసెన్సులను, అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్సులను విదేశాల నుంచే పునరుద్ధరించుకోవచ్చు.
* రుణం తీసుకుని వాహనాన్ని కొనుగోలు చేసినవారు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేశాక కొత్త రిజిస్ట్రేషన్‌ కార్డును ఇస్తారు. రవాణాశాఖకు సంబంధిత పత్రాలను ఆన్‌లైన్లోనే సమర్పించి ‘రుణ తొలగింపు’ (ఫైనాన్స్‌ టెర్మినేషన్‌) ప్రక్రియ ఆన్‌లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు.

* రవాణా వాహనాలకు ఐదేళ్లకోసారి ‘పర్మిట్లు’ ఇస్తారు. వాటి పునరుద్ధరణ కూడా ఆన్‌లైన్లో చేసుకోవచ్చు. తీర్థయాత్రలు, పెళ్లిళ్ల ఇచ్చే తాత్కాలిక పర్మిట్లు సైతం ఆన్‌లైన్లోనే పొందవచ్చు.
* వాహన లైసెన్స్‌లో చిరునామా మార్పు, లైసెన్స్‌ సి.సి. తీసుకోవడం తదితర సేవలను కూడా ఆన్‌లైన్లో అత్యంత సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

తొలుత విశాఖలోనే…
వాహనాలకు సంబంధించిన పలు సేవలను ఆన్‌లైన్లో అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అధునాతన సాఫ్ట్‌వేర్‌ను విశాఖ రవాణాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. సుమారు 40 రకాల సేవలను ఆన్‌లైన్లో ఇవ్వడానికి చేసిన ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతమయ్యాయి. రెండుమూడు రోజుల్లోనే అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాం. రాష్ట్రంలో మొదటిసారిగా విశాఖలోనే ఆన్‌లైన్‌ సేవలన్నీ అందుబాటులోకొస్తున్నాయి. తరువాత దశల్లో మిగిలిన రవాణాశాఖల కార్యాలయాల్లో అందుబాటులోకొస్తాయి.

– వెంకటేశ్వరరావు, డి.టి.సి., రవాణాశాఖ